గోదావరిఖని ఆస్పత్రిలో బాలింత మృతి
కరీంనగర్: కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో శుక్రవారం ఒక బాలింత మృతి చెందింది. మల్హర్ మండలం తాడిచెర్ల గ్రామానికి చెందిన అరుణ(21) కాన్పు కోసం ఆదివారం ఆస్పత్రిలో చేరింది. సోమవారం కవల ఆడశిశువులకు జన్మినిచ్చింది. ఒక పసికందు మృతి చెందగా, మరో శిశువు ఆరోగ్యంగా ఉంది. కాగా, శుక్రవారం ఉదయం తీవ్ర అనారోగ్యానికి గురైన అరుణ చనిపోయింది.
ఉదయం నుంచి అరుణకు కళ్లు కన్పించటం లేదని, చెవులు వినిపించటం లేదని.. ఈ విషయం డాక్టర్లకు చెప్పినా పట్టించుకోలేదని ఆమె తల్లి పోచమ్మ తెలిపింది. కొద్దిసేపటికే పరిస్థితి విషమించి అరుణ మృతి చెందిందని ఆమె విలపించింది. అరుణ మరణానికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని భర్త రమేష్, కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.