పింఛన్‌తో కూడా సొంతిల్లు కొన్నారు
వాళ్లిద్దరూ ఉద్యోగులే. ఉద్యోగంలో ఉన్నన్నాళ్లూ ప్లానింగ్ బాగానే కుదిరింది. ఉన్న చోటే సొంతిల్లు సమకూర్చుకున్నారు. అందులో పెద్ద విశేషమేముంది అనుకోవచ్చు!!. నిజమే... అదేం పెద్ద విశేషం కాదు. కానీ రిటైర్మెంట్ తరువాతి జీవితాన్ని కూడా చక్కగా ప్లాన్ చేసుకోవటంతో పాటు పెన్షన్ ఆధారంగా ఓ వెకే షన్ హోమ్‌ను కూడా కొనుక్కోగలిగారు. అరె.. అదెలా? అనిపించిందా!. దీనికి తాడేపల్లి ఉమాశంకర్, సుబ్బలక్ష్మి దంపతులు ఏం చెబుతున్నారో మీరే చూడ ండి...
‘‘మేమిద్దరం ప్రభుత్వ ఉద్యోగులమే. పిల్లలందరూ తలోరకంగా సెటిలయ్యారు. మేం కూడా కొన్నాళ్ల కిందట రిటైరయ్యాం. ఇప్పటిదాకా సిటీలోనే ఉన్నాం. రిటైరయ్యాకనైనా ఈ రణగొణ ధ్వనులకు దూరంగా ప్రశాంత జీవనం గడపాలని ముందు నుంచీ అనుకునేవాళ్లం. కానీ, పిల్లల దృష్ట్యా పదవీ విరమణ చేసినా ఇక్కడ ఉన్న పూర్తిగా వేరేచోటుకు వెళ్లే పరిస్థితి లేదు. అందుకని ఇక్కడ ఉంటూనే ప్రశాంతత కోసం అప్పుడప్పుడూ వెళ్లి రాగలిగే వెసులుబాటు ఉండే ప్రాంతంలో ఇల్లు తీసుకోవాలని అనుకున్నాం. రూ.20-25 లక్షల బడ్జెట్లో ఉంటే చాలనుకున్నాం. దీనికోసం రిటైర్మెంట్కు ముందే ఇద్దరం ఒక ప్రణాళిక వేసుకున్నాం.
ఒకేసారి రూ. 20 లక్షలు చెల్లించటం కుదరదు కనక ఎలాగూ లోన్ తీసుకోవాలి. అయితే, రిటైరయ్యాక పెన్షనే ఆధారం కనక రుణభారం ఎక్కువగా ఉండకూడదని అనుకున్నాం. కనీసం సగమైనా డౌన్ పేమెంట్ చేయాలని, మిగతాది మరీ దీర్ఘకాలం కాకుండా తక్కువ వ్యవధిలో తేల్చేయాలని అనుకున్నాం. దానికి తగ్గట్టే ఇద్దరం మా జీతాల్లోంచి కొంత తీసి డౌన్‌పేమెంట్ కోసం పక్కనబెట్టాం. అలా మా బడ్జెట్లో సుమారు సగందాకా కూడబెట్టగలిగాం.
ఇంటికోసం అన్వేషణ మొదలుపెట్టాం. మరీ మారుమూల కాకుండా అవసరమైన సదుపాయాలన్నీ ఉండేచోట ఇల్లు తీసుకోవాలనుకున్నాం. వైజాగ్‌ను ఎంచుకున్నాం. వెతగ్గా వెతగ్గా వైజాగ్ సమీపంలోని భీమిలి ఏరియా మాకు తగ్గట్లు ఆహ్లాదకరంగా కనిపించింది. అక్కడ ఇల్లు కోసం వెదికాం. ఆన్లైన్లో వెతకడంతో పాటు, స్వయంగా వెళ్లి కూడా వాకబు చేశాం. చివరికి మా బడ్జెట్లో, బీచ్ వ్యూ ఉండే ఫ్లాట్.. నిర్మాణం చురుగ్గా జరుగుతున్న దశలో దొరికింది. డౌన్‌పేమెంట్ కట్టి బుక్ చేశాం. మిగతాది బ్యాంక్‌లోన్ తీసుకున్నాం. పెన్షన్‌కు తగ్గట్టే ఈఎంఐలు ఉండటంతో పెద్దగా ఇబ్బంది లేదు. కొన్నాళ్లలో అది కూడా తీరిపోతుంది. ఇన్వెస్ట్మెంట్గా కూడా అది బాగానే ఉంటుంది. పెపైచ్చు మాకు కావాల్సిన మానసిక ప్రశాంతతా దొరుకుతుంది.