ప్రైవేటు బస్సు ,ఆటో ఢీ - 10 మందికి గాయాలు
పెంటపాడు : తాడేపల్లిగూడెం- భీమవరం రోడ్డుపై ముదునూరు వద్ద బుధవారం ఆటో, ప్రైవేటు బస్సు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో పదిమందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. తాడేపల్లిగూడెం నుంచి సుమారు పది మంది ప్రయాణికులతో ఓ ఆటో అత్తిలి వెళ్తుండగా, ముదునూరు సమీపంలో ఎదురుగా వస్తున్న ఓ ప్రైవేటు బస్సు దాని ముందు వస్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయి ఆటోను ఢీకొట్టింది.
ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న పెంటపాడుకు చెందిన డ్రైవర్ కర్రిశ్రీనివాసరెడ్డి, పాతూరుకు చెందిన బడే జయలక్షి, భీమవరానికి చెందిన గౌరీకుమారి, ఆకుతీగపాడుకు చెందిన ఏలూరి సత్యవతి, రేలంగి గవర్లపాలేనికి చెందిన కొడాలి నాగలక్ష్మి, దెందులూరు మండలం కేతవరానికి చెందిన మల్లా వరలక్ష్మి, ఏలూరు మండలం జాలిపూడికి చెందిన తల్లీబిడ్డలు తుపాకుల ధనలక్ష్మి, లీలా ప్రకాష్, పిప్పరకు చెందిన భార్యాభర్తలు ఇందుకూరి సూర్పరాజు, నాగమణి గాయపడ్డారు. ఆటో నుజ్జునుజ్జయింది. బాధితులను తొలుత స్థానిక ముదునూరు ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తరలించారు. వైద్యాధికారి రవికుమార్ వారికి ప్రాథమిక చికిత్స చేశారు. బడే జయలక్ష్మి, గౌరీకుమారిల పరిస్థితి విషమంగా ఉంది.
జలక్ష్మిని మెరుగైన వైద్యం నిమిత్తం తణుకు, ఆ తర్వాత విజయవాడ తరలించారు. గౌరీకుమారి తణుకులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం ఈమె అపస్మారకస్థితిలో ఉన్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే కొడాలి నాగలక్ష్మి, మల్లా వరలక్ష్మి, మల్లా సత్యవతి, తుపాకుల ధనలక్ష్మి, ఆమె ఐదేళ్ల కొడుకు లీలా ప్రకాష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వీరు తాడేపల్లి గూడెం, తణుకు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తాడేపల్లిగూడెం ఎస్సై కె.గుర్రయ్య ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఈ ప్రమాదంతో సుమారు 2 గంటలపాటు ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులతోపాటు రావిగుంట, ముదునూరు గ్రామాలకు చెందిన యువకులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. సహాయక చర్యలు చేపట్టారు.