భీమిలి నుంచి వైఎస్సార్సీపీ ఎన్నికల శంఖారావం
సాక్షి, విశాఖపట్నం/తగరపువలస(విశాఖ): వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర రీజియన్ పరిధిలోని నాయకులు, ప్రజాప్రతినిధులను రానున్న ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు ఈ నెల 27వ తేదీన భీమిలి నియోజకవర్గంలోని సంగివలసలో సభ నిర్వహించనున్నట్లు పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ సభలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొని నాయకులు, ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేయడం ద్వారా భీమిలి నుంచి ఎన్నికల శంఖారావానికి శ్రీకారం చుడతారని వెల్లడించారు.
సంగివలసలో జాతీయరహదారి పక్కన ఎంపిక చేసిన సభా స్థలాన్ని బుధవారం మధ్యాహ్నం మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో కలిసి వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. సభాస్థలం, పార్కింగ్, హెలీప్యాడ్ వద్ద ఏర్పాట్ల గురించి భీమిలి సీఐ డి.రమేష్ ను అడిగి తెలుసుకున్నారు. వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులకు మరోసారి తెలియజేసి వారిని ఉత్తేజితులను చేయడమే ఈ సభ ఉద్దేశమని చెప్పారు. ఈ సభలో ఉత్తరాంధ్రలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 5 వేలు చొప్పున 2లక్షల మంది వరకు ప్రజాప్రతినిధులు, గృహ సారథులకు స్థానం కల్పించనున్నట్లు తెలిపారు.
ఇలాంటి సభలే రాష్ట్ర వ్యాప్తంగా మరో నాలుగుచోట్ల నిర్వహిస్తామన్నారు. సీఎం ప్రోగ్రాం కో–ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, పెన్మత్స సురేష్, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, నెడ్‌క్యాప్ చైర్మన్ కేకే రాజు, రీజనల్ యూత్ కో–ఆర్డినేటర్ ముత్తంశెట్టి శివనందీష్, డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, ఏపీ మారిటైం బోర్డు చైర్మన్ కె.వెంకటరెడ్డి, నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు. తొలుత విశాఖ నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్, డీసీపీ శ్రీనివాస్, ఏడీసీపీ జాన్ మనోహర్, ఏసీపీ జి.శ్రీనివాసరావు, భీమిలి ఆర్డీవో ఎస్.భాస్కరరెడ్డి, ట్రాఫిక్ సీఐ ఎస్.కాంతారావు సభా స్థలాన్ని పరిశీలించారు.