'సెంచరీలు, రికార్డుల కోసం పాకులాడను'
టెయిలెండర్లలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాల్సిన అవసరం ఉందని టెస్టుల్లో టీమిండియా వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా అభిప్రాయపడ్డాడు. టెయిలెండర్ల నుంచి స్ట్రైకింగ్ తాను తీసుకోవాలని ఎప్పుడూ భావించలేదన్నాడు. ఈ టెస్టులో రాణించి తొలి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా దక్కించుకున్నాడు. సెంచరీల కోసం తాను పాకులాడే ఆటగాడిని కాదని, జట్టుకోసం అవసరమైన ఇన్నింగ్స్ లు ఆడేందుకు ఆసక్తి చూపిస్తానన్నాడు. కొన్నిసార్లు బ్యాట్స్ మన్ చేసే 30, 40 పరుగులే జట్టుకు కీలకం అవుతాయని సాహా చెప్పాడు.
మిడిలార్డర్లో బ్యాటింగ్ దిగిన తర్వాత టెయిలెండర్లతో కలిసి బ్యాటింగ్ చేయాల్సి వస్తుందని.. అందుకే వారికి కూడా పరుగులు చేసే ఛాన్స్ ఇవ్వాలని చెప్పాడు. స్ట్రైకింగ్ ఇచ్చినప్పుడే వారికి కాన్ఫిడెన్స్ వస్తుందని, దాంతో తర్వాత వచ్చే ఆటగాళ్లు కూడా స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయగలుగుతారని సాహా పేర్కొన్నాడు. తాజాగా ఈడెన్ గార్డెన్స్ లో న్యూజిలాండ్ తో జరిగిన రెండో టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో హాఫ్ సెంచరీలు సాధించి అజేయంగా నిలిచిన విషయం తెలిసిందే. తద్వారా భారత టెస్టు క్రికెట్ చరిత్రలో ఒక మ్యాచ్ రెండు ఇన్నింగ్స్ ల్లోనూ అర్థ శతకాలు సాధించిన నాల్గో వికెట్ కీపర్ గా సాహా(54 నాటౌట్, 58 నాటౌట్) రికార్డు నెలకొల్పాడు. అయితే అంతకుముందు ఈ ఘనతను అందుకున్న భారత వికెట్ కీపర్లలో మహేంద్ర సింగ్ ధోని, దిల్వార్ హుస్సేన్, ఫరూఖ్ ఇంజనీర్లు ఉన్నారు.