మరో ముందడుగు..
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు దిగువ న 21కిలోమీటర్ల దూరంలో నల్లగొండ-గుంటూరు జిల్లాల నడుమ 7టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో టెయిల్‌పాండ్ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఇక్కడ నిలిచిన నీటితో నాగార్జునసాగర్ పవర్‌హౌజ్‌లోని రివర్స్‌బుల్ టైర్బైన్ల ద్వారా విద్యుత్ డిమాండ్ లేని సమయంలో తిరిగి సాగర్‌లోకి నీటిని పంప్ చేస్తారు. ఈ టర్బైన్లను నాగార్జునసాగర్ డ్యాంవద్ద 1978 నుంచి 1985 మధ్య కాలంలో నిర్మించారు. విద్యుత్ డిమాండ్ మేరకు సాగర్‌లోని ప్రధాన విద్యుదుత్పాదక కేంద్రంలోని 8 టర్బైన్ల ద్వారా విద్యుత్ జనరేట్ చేస్తూ నీటిని టెయిల్‌పాండ్‌లోకి విడుదల చేస్తారు. దీంతో 810 మెగావాట్ల విద్యుదుత్పాదన జరిగే అవకాశాలున్నాయి. తిరిగి నీటిని తోడటానికి ఉత్పత్తి అయిన విద్యుత్‌లో 70శాతం వినియోగించుకోవాల్సి ఉంటుంది. విద్యుత్ డిమాండ్ లేని సమయంలో ఈనీటిని జలాశయంలోకి తోడి పోస్తారు. ఈవిధంగా టెయిల్‌పాండ్‌లోని ఒక టీఎంసీ నీటిని మాత్రమే తోడుకోవడానికి వీలుంటుంది. ఎప్పుడు టెయిల్‌పాండ్ జలాశయంలో 6 టీఎంసీల నీరు నిల్వ ఉంటుంది. ప్రస్తుతం టెయిల్‌పాండ్ ప్రాజెక్టుకు 20 గేట్లు అమర్చాల్సి ఉండగా 17 ఏర్పాటు చేశారు. మరో మూడు అమర్చితే ఇక టెయిల్‌పాండ్ ప్రాజెక్టు పనులు పూర్తయినట్లేనని అధికారులు తెలిపారు.
జోరుగా ట్రాష్‌రాక్ పనులు
సాగర్ డ్యాం దిగువన ఉన్న ప్రధాన విద్యుదుత్పాదన కేంద్రం ముందు ట్రాష్‌రాక్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అందుకు రూ.8కోట్లు మంజూరయ్యాయి. ఆరు టర్బైన్ల గేట్ల ముందు పనులు జరుగుతున్నాయి. టర్బైన్ల గేట్లకు 40 మీటర్ల దూరంలో 155 మీటర్ల పొడవు 12మీటర్ల ఎత్తులో నిర్మాణాలు సాగుతున్నాయి. టెయిల్‌పాండ్ జలాశయం నుంచి నాగార్జునసాగర్ డ్యాం దిగువ వరకు నీరు నిలువ ఉంటుంది. ఈనీటిని టర్బైన్ల ద్వారా సాగర్ జలాశయంలోకి తోడిపోసే సమయంలో కృష్ణానదిలోని రాళ్లు, కర్రలు,చెత్త, మత్స్యకారుల వలలు తదితర సామగ్రి రాకుండా జాలీలు ఏర్పాటు చేయనున్నారు. అందుకుగాను ఇప్పటి వరకు 3 నుంచి 8 వరకు టర్బైన్ల ముందు ట్రాష్‌రాక్ పనులు చేస్తున్నారు. అక్కడ ఉన్న పెద్దబండ రాళ్లను తొలగించి గోడలు నిర్మించి వాటికి గేట్లు అమరుస్తారు. ఆ గేట్లకు జాలీలు పెడతారు. ఇవి పూర్తికాగానే 1, 2 టర్బైన్ల ముందు ఈవిధమైన పనులు చేస్తారు. అనుకున్న రీతిలో ఆగస్టు మొదటివారం వరకు పనులు పూర్తయితే 30 ఏళ్ల జెన్కో కల నెరవేరనున్నది. విద్యుత్ ఎప్పుడంటే అప్పుడు ఉత్పత్తి చేసుకునే వీలు కలుగుతుంది.