తాజ్ ఉద్యోగినికి వేధింపులు
న్యూఢిల్లీ: హోదా తగ్గింపు, అభద్రత, లైంగిక వేధింపులతో టాటా గ్రూపుకు చెందిన ఉన్నత స్థాయి ఉద్యోగిని జాబ్ వదులుకుంది. టాప్ ఎగ్జిక్యూటివ్ పై ఫిర్యాదు చేసినందుకు ఆమె ఉద్యోగం కోల్పోయింది. అప్పటి టాటా గ్రూపు చైర్మన్ సైరస్ మిస్త్రీ, హెచ్ ఆర్ హెడ్ ఎన్ ఎస్ రాజన్ కు మొరపెట్టుకున్నా ఆమెకు న్యాయం జరగలేదు.
తన ఉద్యోగానికి రాజీనామా చేస్తూ బాధితురాలు బాధితురాలు గతేడాది నవంబర్ 3న మిస్త్రీకి ఈ-మెయిల్ పంపింది. ఇందులో తన గోడును వెళ్లబోసుకుంది. తాజ్ హోటల్ టాప్ ఎగ్జిక్యూటివ్ ఒకరు తనను ఆరు నెలలుగా లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపించింది. తాను ఎదురు తిరగడంతో తన హోదాను జనరల్ మేనేజర్ నుంచి సీనియర్ మేనేజర్ కు తగ్గించారని వాపోయింది. ఇన్ని అవమానాలు జరిగిన తర్వాత ఇక్కడ పనిచేయలేనని ఈ-మెయిల్ లో పేర్కొంది.
దీనిపై స్పందించిన మిస్త్రీ ఒక కమిటీ వేశారు. అయితే 18 నెలలు గడిచినా కమిటీ నివేదిక ఇవ్వలేదు. మహిళా ఉద్యోగుల భద్రత విషయంలో మిస్త్రీ రాజీపడలేదని ఆయన తరపు ప్రతినిధులు తెలిపారు. నివేదిక ఇవ్వాలని కమిటీని మిస్త్రీ కోరారని, రిపోర్ట్ వచ్చిన తర్వాత చర్యలు చేపడతామని చెప్పారు. ఏడాదిన్నర గడిచినా బాధితురాలికి న్యాయం చేయకపోవడం మిస్త్రీకి నిష్ఫూచికి రుజువన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.