40 రోజుల్లో తవ్వేశాడు..!
నాగ్ పూర్: దళితులపై ఇంకా ఉన్న వివక్షలు, అనాగరిక చేష్టలు తాజాగా మహారాష్ట్రలోని వసీం జిల్లాలో గల కలంబేశ్వరం గ్రామంలో బయటపడ్డాయి. నీటి కోసం బావి దగ్గరకు వెళ్లిన ఓ దళిత మహిళను నీటిని ముట్టుకోవద్దని అక్కడి అగ్రకులాల వారు చెప్పడంతో ఊరి కోసం ఆమె భర్త తాజ్నేబాపూరావు 40 రోజులలో కొత్త బావిని తవ్వేశాడు.
దీంతో ఇప్పుడు ఆ ఊరిలోని దళితులందరీకి నీటి కష్టాలు తప్పాయి. మొదట బావిని తవ్వడం ప్రారంభించినపుడు తాజ్నేకు అతని కుటుంబసభ్యులు కూడా సాయం చేయలేదు. బావి కోసం ఎంచుకున్న ప్రదేశానికి దగ్గరగా ఉన్న మూడు బావులు, ఒక బోరు పంపు కూడా ఎండిపోయి ఉండటంతో అందరూ తాజ్నేకు పిచ్చిపట్టిందని అనుకున్నారు. వారి మాటలను పట్టించుకోని తాజ్నే ఏకాగ్రతతో కేవలం 40 రోజుల్లో బావి తవ్వకాన్ని పూర్తిచేశారు. గత మార్చి నెలలో తన భార్య నీటి కోసం బావి వద్దకు ఈ సంఘటన జరిగిందని తాజ్నే తెలిపారు. ఆ రోజు దాదాపు ఏడ్చేశానని.. కేవలం దళితులం, పేదవాళ్లం కావడం వల్లే ఈ సమస్య వచ్చిందని ఆయన అన్నారు. వెంటనే చేరువలో ఉన్న మాలేగావ్ పట్టణానికి చేరుకుని పనిముట్లను కొని బావి తవ్వడం ప్రారంభించినట్లు వివరించారు. కచ్చితంగా నీరు ఉంటుందనే నమ్మకంతో దేవుడిని ప్రార్ధించి తవ్వకాన్ని ప్రారంభించినట్లు ఆయన చెప్పారు.
రోజూ వారీ కూలీ కావడంతో పొట్ట నింపుకోవడం కోసం ఉదయాన్నే పనిలోకి వెళ్లే ముందు నాలుగు గంటలు వచ్చిన తర్వాత రెండు గంటల పాటు సమయాన్ని 40 రోజుల పాటు బావి తవ్వకానిక వెచ్చించినట్లు తెలిపారు. బీఏ వరకు చదువుకున్న బాపూరావు తాజ్నే తన జాతి వాళ్లు వేరే కులాల ప్రజలను నీటి కోసం అడుక్కోవడం ఇష్టం లేకపోవడం వల్లే తాను ఈ పని చేసినట్లు తెలిపారు. తాజ్నే భార్య సంగీత మాట్లాడుతూ నీరు పడేవరకూ ఆయనకు తాను, కుటుంబసభ్యులెవ్వరూ సాయం చేయలేదని.. కానీ, బావిని వెడల్పు చేయడంలో ఆయనకు తోడుంటామని ఆమె పేర్కొన్నారు. బాపూరావు చేసిన పనిని మెచ్చుకున్న ఓ సామాజిక కార్యకర్త వసీం రూ.5000 లను బహుమతిగా అందించారు. దీనిపై స్పందించిన ఆ మండల తహసిల్దార్ తనకు ఎలాంటి సాయం కావాలని అడుగగా గ్రామానికి ఏం చేస్తే బాగుంటుందో ఆ పని చేయాలని తాజ్నే కోరారు.