టాక్లీలో రైతు ఆత్మహత్య
మూడేళ్లుగా కలిసిరాని వ్యవసాయం
అప్పులు బాధ తాళలేక అఘాయిత్యం
బేల : మండలంలోని టాక్లీ గ్రామానికి చెందిన రైతు కడ్కే బండు(45) శనివారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
తీరని అప్పులు.. తీసిన ప్రాణాలు
కడ్కే బండు నాలుగు ఎకరాల సొంత భూమితో పాటు అత్త పేరిట ఉన్న మరో ఆరు ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నాడు. సాగు కోసం సిర్సన్న గ్రామంలోని తెలంగాణ దక్కన్ గ్రామీణ బ్యాంకులో భార్య పేరిట ఉన్న నాలుగు ఎకరాల సొంత భూమిపై రూ.లక్షా 15 వేలు, అత్త పేరిట ఉన్న ఆరు ఎకరాల భూమిపై రూ.లక్షా 20 వేల రుణం తీసుకున్నాడు. దీంతో పాటు ప్రైవేటుగా రూ.లక్ష వరకు బాకీ చేశాడు. కాగా, మూడేళ్లుగా వ్యవసాయం కలిసిరాలేదు. పంట దిగుబడులు ఆశించిన మేర రాకపోవడంతో, ఈ అప్పులు తీర్చలేకపోయాడు. దీంతో పాటు ఇంట్లో పెళ్లికి వచ్చిన కూతురు ఉంది. ఈ క్రమంలో చేసిన అప్పులు తీర్చలేనని, పెద్ధ కూతురు పెళ్లి చేయలేనని దిగులుతో రైతు కడ్కే బండు శనివారం రాత్రి 9 గంటల సమయంలో ఇంటి సమీపాన పశువుల పాకలో పురుగుల మందు తాగాడు. ఇంటి ఆవరణలోకి వచ్చి స్పృహ తప్పి పడిపోయాడు. కొద్దిసేపటికి గమనించిన భార్య, పిల్లలు ఇరుగు పొరుగు సహకారంతో వైద్యం కోసం జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తరలించారు. కాగా, మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడికి నలుగురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. కాగా, మృతుడి భార్య లలిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై బొల్లు నానా పేర్కొన్నారు.