చర్చలు సాగేనా
శ్రీలంక - తమిళ జాలర్ల మధ్య రెండో విడత చర్చలు సాగేనా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నారుు. తమిళ జాలర్లపై శ్రీలంక నావికాదళం మళ్లీ విరుచుకు పడింది. 78 మందిని తమ దేశానికి పట్టుకెళ్లింది. దీంతో ఈ నెల 25న జరగనున్న రెండో దశ చర్చలపై నీలినీడలు కమ్ముకున్నారుు.
సాక్షి, చెన్నై:
సముద్రంలో రాష్ట్ర జాలర్లకు భద్రత కరువు అయింది. శ్రీలంక నావికాదళం తన ప్రతాపాన్ని చూపిస్తూనే ఉంది. పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తూ తమిళ జాలర్లను పట్టుకెళ్లడం, కొన్నాళ్లు జైల్లో బంధించడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఒత్తిడితో విడిచి పెట్టడం పరిపాటిగా మారింది.
పడవలను మాత్రం తిరిగి ఇవ్వకుండా జాలర్లను అప్పుల ఊబిలో కూరుకునేలా చేస్తూ వస్తున్నది. రెండు దేశాల అధికారులు, జాలర్ల ప్రతి నిధుల మధ్య చర్చల ద్వారానైనా తమకు భద్రత దక్కుతుందన్న ఆశతో ఉన్న జాలర్లకు చివరకు నిరాశే మిగులుతోంది.
చర్చల వాయిదా: జనవరిలో చెన్నై వేదికగా జరిగిన రెండు దేశాల తొలివిడత చర్చలు
విషయం తెలిసిందే.
సంతృప్తినిచ్చిన చర్చలు సాగేనా?
ఇందులో తీసుకున్న నిర్ణయాలను గోప్యంగా ఉంచారు. రెండో విడతతో అన్నీ సర్దుకుంటాయన్న భరోసా ఇచ్చారు. అయితే, శ్రీలంక నావికాదళం ఏమాత్రం తగ్గలేదు. తన పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తూనే వచ్చింది. 177 మందిని పట్టుకెళ్లి తమ దేశ చెరలో ఉంచింది. ఈ పరిణామాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు.
తమ వాళ్లందర్నీ విడిచి పెడితేనే రెండో విడత చర్చలు అన్న మెలిక పెట్టారు. దీంతో కొలంబో వేదికగా ఈనెల 13న జరగాల్సిన చర్చలు చివరి క్షణంలో వాయిదా పడ్డాయి. కొలంబో వెళ్లడానికి అధికారులు, ప్రతినిధులు సిద్ధమైనా చివరి క్షణంలో పర్యటన వాయిదా పడటంతో వెనక్కు తగ్గాల్సి వచ్చింది.
అదే సమయంలో తమ వాళ్లందరినీ విడిచిపెడితే, ఈనెల 25న చర్చలకు సిద్ధం అని సీఎం జయలలిత ప్రకటించారు. జయలలిత ఒత్తిడితో కేంద్రం స్పందించింది. శ్రీలంక చెరలో ఉన్న 177 మందిని విడుదల చేయించే పనిలో పడింది. తొలివిడత చర్చల అనంతరం స్వాధీనం చేసుకున్న పడవలను తిరిగి అప్పగించే ఏర్పాట్లు చేసింది. రెండు రోజుల క్రితం 172 మందిని శ్రీలంక విడుదల చేసింది.
మళ్లీ బంధీ : శ్రీలంక చెర నుంచి 172 మంది విడుదలయ్యారో లేదో, అదే రోజు రాత్రి 78 మందిని శ్రీలంక నావికాదళం పట్టుకెళ్లడం జాలర్లలో మరింత ఆక్రోశాన్ని రగుల్చుతోన్నది. రామేశ్వరం నుంచి ఐదు పడవల్లో వేటకు వెళ్లిన 25 మందిని అర్ధరాత్రి వేళ శ్రీలంక సేనలు చుట్టుముట్టారుు. వారి నుంచి తప్పించుకునే యత్నం చేసినా ఫలితం శూన్యం. ఐదు పడవలతో పాటుగా 25 మందిని పట్టుకెళ్లిన నావికాదళం తలైమన్నార్ హార్బర్లో ఉంచి విచారణ జరుపుతున్నారు.
పుదుకోట్టై సమీపంలోని జగదాపట్నం, సేతు భావా సత్రంకు చెందిన 13 పడవలను శ్రీలంక సేనలు చుట్టుముట్టారుు. వలలను తెంచి పడేసి నానా వీరంగం సృష్టించారు. ఓ పడవ మాత్రం తప్పించుకుని ఒడ్డుకు చేరగా, మిగిలిన 12 పడవలు అందులో ఉన్న 55 మందిని పట్టుకెళ్లారు. వీరిని కాంగేయం కోర్టులో హాజరు పరిచారు. ఒకే రోజు రాత్రి రాష్ట్రానికి చెందిన 78 మంది జాలర్లను శ్రీలంక నావికాదళం పట్టుకెళ్లిన సమాచారం జాలర్ల గ్రామాల్లో కలకలం రేపింది.
తమ వాళ్లు సురక్షితంగా ఇళ్లకు చేరుకోవాలని ఆ కుటుంబాలు విలపిస్తున్నాయి.
నీలి మేఘాలు : సీఎం జయలలిత ఒత్తిడి మేరకు చెరలో ఉన్న వారిని విడిపించారు. ముందుగా ఇచ్చిన హామీ మేరకు ఈనెల 25న రెండో విడత చర్చలకు ఏర్పాట్లు చేశారు. అయితే, బుధవారం అర్ధరాత్రి 78 మందిని పట్టుకెళ్లడంతో చర్చలపై నీలి మేఘాలు అలుముకున్నాయి.
వీరందరినీ విడుదల చేయడానికి పదిహేను లేదా, నెల రోజులు పట్టే అవకాశం ఉంది. ఈ దృష్ట్యా, ఇక చర్చలు సాగవన్న అసంతృప్తి మొదలైంది. అయితే, రెండో దఫా చర్చలను జరగకుండా చేయడం లక్ష్యంగా శ్రీలంక వ్యవహరిస్తున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇది వరకు రెండో విడత చర్చల తేదీ ప్రకటించిన మరుసటి రోజే జాలర్లను పట్టుకెళ్లింది. తాజాగా, మరో నాలుగు రోజుల్లో రెండో దశ చర్చలు నిర్వహించనున్న సమయంలో జాలర్లను పట్టుకెళ్లడం అనుమానాలకు బలం చేకూరుతోంది.
కరుణ ఆగ్రహం: జాలర్లను పట్టుకెళ్లిన సమాచారంతో డీఎంకే అధినేత ఎం కరుణానిధి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగట్టారు. జాలర్లకు భద్రత కల్పించడంలో విఫలమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చల సమయంలో లంక సేనల వ్యవహారం అనుమాలకు తావిస్తోందని, తమిళ జాలర్లపై కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేనట్టుందని ధ్వజమెత్తారు.
జాలర్లను త్వరితగతిన విడుదల చేసి, రెండో దశ చర్చల ద్వారా భద్రతకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పీఎంకే నేత రాందాసు ఓ ప్రకటనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటుగా శ్రీలంక సేన పైశాచికత్వంపై ధ్వజమెత్తారు.