తాళి తెంచటం మనోభావాలు దెబ్బతీయడం కాదా?
తమిళనాడులో కొంత మంది ‘బుద్ధిమంతులు’ బహిరంగంగా కట్టుకున్న తాళిని తెంచుకోవడం.. దానికి మీడియా మితిమీరిన పబ్లిసిటీ ఇవ్వడం కూడా సెక్యులరిజంలో భాగమేనా? మరి 120 కోట్లమంది జనాభా ఉన్న భారతదేశంతో మొదలుకుని ప్రపంచంలోని అనేక దేశాల్లో జీవిస్తున్న కోట్లాది మంది హిందువుల మనోభావాలను ఇది దెబ్బ తీసినట్టు కాదా? మనకు స్వేచ్ఛ ఉంది కదా.. అని ఇతరుల మనోభావాలు దెబ్బతీయడం అనేది ఎంతవరకు సరైనది?
తాళి బొట్టు ఒక్కసారి మెడలో పడితే అది శరీరంలో భాగమైపో తుంది అనుకునే వారు కొందరు.. ఫంక్షన్లకు మాత్రమే వేసుకునే వారు మరికొందరు.. పండుగలకు మాత్రమే వేసుకునే వారు ఇంకొందరు.. అసలే వేసుకోని వారు కొందరు. ఇలా వారివారి ఇష్టానుసారం మేరకు వారు తాళిని ధరిస్తారు. మరి కొందరేమో.. తాళి బొట్టే సర్వస్వం.. అంటూ ఉదయాన్నే లేవగానే రెండు కళ్లకు అద్దుకుని పసుపు కుంకుమలు క్షేమంగా ఉండాలని పూజిస్తారు. అది వారి వారి వ్యక్తిగత విషయం. కానీ అందరూ అలానే చేయాలి అంటే కుదరవచ్చు.. కుదరక పోవచ్చు. మహిళల మైండ్‌సెట్‌కు సంబంధించిన అంశం అది.
హిందూ సమాజంలో చాలామంది మహిళలు భర్త ఉన్నన్ని రోజులు మంగళసూత్రాన్ని పవిత్రంగానే భావిస్తారు. భర్త పోయాక దాన్ని కూడా తీసేస్తారు. అది ఆచారం..సంప్రదాయం కూడా. కానీ భర్త ఉండగానే తాళి తెంచుకోవడం అనేది కూడా వారి వారి వ్యక్తిగత విషయమే. కానీ దానికి ఓ వేదిక ఏర్పాటు చేసుకుని అందరి సమక్షంలో తాళిని తెంపటం అంటే మెజారిటీ వర్గాల మనసు నొప్పించడమే.. కయ్యానికి కాలు దువ్వడమే తప్ప ఇంకోటి కాదు. బహిరంగంగా తాళి తెంపేటందుకే ఓ వేదిక ఏర్పాటు చేసుకుని మెజారిటీ వర్గాల ప్రజల మనోభావాలపై దాడి చేయడం ఏమాత్రం సమంజసం కాదు. పైగా తాళి బొట్లు తెంచేయండి.. సహజీవనం చేస్తూ పిల్లలను కనండి అంటూ డీకే పార్టీ అధ్యక్షుడు శివమణి బహిరంగంగా ప్రకటించడం వెనక మతలబు ఏంటి? మరీ ముఖ్యంగా ఆ వ్యాఖ్యలను లోతుగా గమనిస్తే కుటుంబ వాతావరణంలో జీవించే వారికి తలవంపులు తెచ్చే విధంగా ఉన్నాయి. హిందూ జీవన విధానాలు విశ్వసిస్తూ.. ఆచరించే ప్రతి వ్యక్తి చొరవచూపి, ఇలా తాళినితెంచిన, తెంచుతున్న చర్యలను ఖండించాలి. సెక్యులర్ అంటే అన్ని మతాలు సమానమే.. వ్యత్యాసాలు వద్దని. కానీ ఈ దేశంలో సెక్యులర్ అంటే కేవలం మెజారిటీ వర్గాలను అవమానించ డమే పనిగా సాగుతోంది. ఇలాంటి విధానం మాను కోవాలి. అపుడే సెక్యులరిజాన్నిఅందరూ గౌరవిస్తారు. అభిమానిస్తారు.
పగుడాకుల బాలస్వామి హైదరాబాద్