Taliban culture
-
మహిళా ఉద్యోగులకు తాలిబన్ల షాక్! ఆఫీస్‌కు మగాళ్లను పంపాలని ఆదేశం
కాబూల్: అధికారం చేపట్టినప్పటి నుంచి క్రూర చర్యలు, పురుషాధిక్య విధానాలను అనుసరిస్తూ వార్తల్లో నిలుస్తోంది అఫ్గానిస్థాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం. తాజాగా మరోసారి ఇలాంటి పనే చేసింది. మహిళా ఉద్యోగులను ఆఫీసుకు రావద్దని, వారి స్థానంలో కుటుంబం నుంచి లేదా సమీప బంధువుల్లోని మగాళ్లను పంపాలని ఆదేశించింది. ఈ మేరకు ఓ మహిళా ఉద్యోగి వెల్లడించారు. 'తాలిబన్ అధికారుల నుంచి నాకు కాల్ వచ్చింది. ఆఫీస్‌లో పని భారం పెరుగుతోంది. మీరు చేయలేరు. మీ స్థానంలో మీకు తెలిసిన పురుషుడ్ని పంపాలి అని చెప్పారు. తాలిబన్లు అధికారం చేపట్టిన తర్వాత మా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నా పదవిని తగ్గించారు. 60 వేలు ఉన్న నా జీతాన్ని 12 వేలు చేశారు. ఇదేంటని మా పై అధికారిని అడిగితే దరుసుగా ప్రవర్తించారు. ఆఫీస్ నుంచి బయటకు వెళ్లిపోమన్నారు. ఈ విషయంపై చర్చించవద్దన్నారు. జీతం తగ్గాక నా పిల్లాడికి స్కూల్ ఫీజు కూడా కట్టలేని దుస్థితి వచ్చింది. 15 ఏళ్లుగా నేను ఆర్థిక శాఖలో పని చేస్తున్నా. బిజినెస్ మేనేజ్మెంట్లో పీజీ కూడా చేశా' అని మహిళా ఉద్యోగి తెలిపారు. గతేడాది ఆగస్టులో అధికారం కైవసం చేసుకున్నప్పటి నుంచి మహిళల హక్కుల్ని కాలరాస్తున్నారు తాలిబన్లు. వారిపై కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. తాలిబన్ల తీరును అంతర్జాతీయ సమాజం కూడా తీవ్రంగా తప్పుబట్టింది. మహిళలపై ఆంక్షల వల్ల అఫ్గాన్ ఆర్థికంగా ఒక బిలియన్ డాలర్లు (అఫ్గాన్ జీడీపీలో 5 శాతం) నష్టపోతుందని ఐక్యరాజ్యసమితి మహిళల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిమా బాహౌస్ మే నెలలోనే అంచనా వేశారు. అఫ్గాన్ పేదరికంలోకి వెళ్లిందని, ఒక తరం మొత్తానికి ఆహార భద్రత, పోషకాహార లోపం ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. చదవండి: డెలివరీ బాయ్ కాదు హీరో.. ప్రాణాలకు తెగించి మంటల్లో చిక్కుకున్న ఫ్యామిలీని బయటకు -
Afghanistan Crisis: వాళ్లుంటే నరకమే!
భవిష్యత్తుపై ఆశలేదు. రేపటి కోసం ఆలోచన చెయ్యడం లేదు. బెంగంతా ఈ రోజు పైనే. మరుక్షణంలో ఏమి జరుగుతుందో! ఇదీ అఫ్గానిస్తాన్‌లో పరిస్థితి. మనదేశానికి విద్యార్థులుగా వచ్చిన ముగ్గురు మహిళల మనోగతం. ‘‘అఫ్గానిస్తాన్‌లో సామాన్యుల జీవితం కకావికలమైపోయింది. ఉపాధి కరువైన బ్రతుకులు... మహిళలకు ప్రాధాన్యత ఇవ్వని పాలకులు... ప్రాణాలకు విలువివ్వని ఆటవికరాజ్యంలో జీవనం దినదిన గండం కాదు, క్షణక్షణ గండం. సూక్ష్మంగా ఇవే అక్కడ ఉన్న మా వాళ్ల జీవితాలు’’ అంటూ అఫ్గానిస్తాన్ నుంచి విశాఖపట్నం, ఆంధ్రవిశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందరం చదువుకున్నాం! ప్రస్తుత పరిస్థితుల్లో అఫ్గానిస్తాన్‌కు వెళ్లే పరిస్థితి లేదని న్యాయ విద్య అభ్యసిస్తున్న అవాస్తా బకాష్ తెలిపారు. జూలై మాసంలో ఆమె కాబూల్‌లో తన కుటుంబంతో గడిపి వచ్చారు. గతంలో తాలిబాన్ల పాలను గుర్తుచేసుకుంటూ... తొమ్మిది సంవత్సరాల వయసులో పాఠశాలలో 4వ తరగతిలో చేరినట్లు తెలిపారు. ‘‘రెండు దశాబ్దాల క్రితం అప్పటి తాలిబాన్ పాలన ముగిసిన తరువాత ప్రాధమిక విద్య నుంచి న్యాయ విద్యలో డిగ్రీ వరకు కాబూల్‌లో పూర్తిచేశాను. మా నాన్న ఆర్మీ అధికారిగా, తల్లి ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేసి పదవీ విరమణ చేశారు. మేము మొత్తం ఏడుగురు సంతానం. ఇద్దరమ్మాయిలం. మా సోదరులు కనస్ట్రక్షన్ ఇంజనీరింగ్, ఎంబిఏ, బీటెక్, జర్నలిజం చేశారు. మా సోదరి వివాహం చేసుకుని నార్వేలో నివస్తోంది’’ అని చెప్పారు అవాస్తా బకాష్. రోజులు వెళ్లదీస్తున్నాం! ‘‘మా కుటుంబం కాబూల్‌లో నివసిస్తోంది. తాలిబాన్ల రాకతో అందరూ ఉపాధిని కోల్పోయారు. దాచుకున్న డబ్బులతో కాలం వెళ్లదీస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో నేను ఆఫ్గనిస్తాన్ వెళ్తే వాళ్లకు భారం కావడం తప్ప ప్రయోజనం లేదు. గతంలో నేను డిగ్రీ పూర్తిచేసిన తరువాత అఫ్గానిస్తాన్ కార్మిక మంత్రిత్వ శాఖలో లెజిస్లేటర్‌గా, రెండేళ్లు జెండర్ ఆఫీసర్‌గా, ప్రధాని కార్యాలయంలో అవినీతి నిరోధక అధికారిగా రెండేళ్లు పనిచేశాను. న్యాయవిద్యపై ఆసక్తితో ఆంధ్రవిశ్వవిద్యాలయంలో ఎల్ఎల్ఎం కోర్సులో చేరాను. ప్రసుతం ఎల్ఎల్ఎమ్ ఫైనల్లో ఉన్నాను. ఇప్పట్లో వెళ్లలేం! ప్రస్తుత తరుణంలో భారత్‌ను విడిచి అఫ్గానిస్తాన్‌కు వెళ్లలేను. అనుమతిస్తే భారత్‌లో శరణార్థిగా ఉండిపోతాను. తాలిబాన్లు ఇటీవల చంపేసిన వాళ్లలో అప్పట్లో నాతో పనిచేసిన ఇద్దరు ఉద్యోగులు కూడా ఉన్నారు. మేము ఎవ్వరికీ హాని చేయమని చెబుతున్నప్పటికీ తాలిబన్ల ధోరణిలో మార్పు రావడం లేదు, పాత పంథాలోనే వెళుతున్నారు. ఇప్పటికే తాలిబాన్లు ప్రధాని కార్యాలయంలో పనిచేసిన వారిని వదిలి పెట్టమని, వారు అమెరికాకు బానిసలుగా పనిచేసిన వారని బహిరంగంగా ప్రకటించారు. మా దేశానికి వెళితే నా ప్రాణాలకు ముప్పు తప్పుదు. అవకాశం వచ్చినట్టే వచ్చి... అఫ్గానిస్తాన్‌లో 1990 నుంచి మోడరనైజేషన్ ప్రారంభం అయ్యింది. గత ప్రభుత్వం మహిళలకు ప్రత్యేకమైన ఉద్యోగాలు కల్పించింది. మహిళలు విద్య, ఉద్యోగం, ఉపాధి రంగాలలో అడుగు పెట్టగలిగారు. రాజకీయరంగంలో సైతం రాణించారు. కొన్ని పరిమితులకు లోబడి పురుషులతో సమాన స్థాయిలో అన్ని కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనే అవకాశాలు వచ్చాయి. నేడు పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా మారిపోయింది. ఇప్పుడు అఫ్గాన్‌లో పురుషుడి సహాయం లేకుండా మహిళలు ఇంటి నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. మూసివేత దిశగా బ్యాంకులు తాలిబాన్లు తమ హవాను కొనసాగించడం అంత సులభం కాదు. విదేశీ బ్యాంకులు ఇప్పటికే తమ శాఖలను మూసివేయాయి. నేషనల్ బ్యాంక్ ఆఫ్ అఫ్గానిస్తాన్ సైతం మూతబడింది. ఆర్థిక పరిస్థితులు ఆశాజనకంగా లేవు. సమాజం సైతం తాలిబాన్ పాలనను స్వాగతించడం లేదు. అంతర్గతంగా వీరిపై పోరు ప్రారంభమవుతోంది. ప్రపంచ దేశాల నుంచి కొంత ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతున్న నేప«థ్యంలో తాలిబాన్లు తాత్కాలికంగా కొంత సంయమనం పాటిస్తున్నారంతే. కోవిడ్ కంటే ప్రమాదకరం వైద్య రంగంలో పనిచేస్తున్న మహిళలు విధులకు హాజరు కావచ్చని తాలిబాన్లు చెప్పారు. అయినప్పటికీ వారు విధులకు వెళ్లడానికి భయపడుతున్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ కంటే తాలిబాన్లే ప్రమాదకరమని నమ్ముతున్నాను. గత 15 సంవత్సరాలలో జరిగిన అభివృద్ధి నేడు ప్రశ్నార్థకమైంది. ప్రభుత్వ కార్యాలయాలు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని అనిశ్చితి నెలకొంది. డాన్సింగ్, సింగింగ్, పెయింటింగ్ వంటి కళారంగాలను పూర్తిగా నిషేధించారు. దీంతో ఆయా కళాకారులు తమ వృత్తిని మార్చుకోవాల్సిన అగత్యం ఏర్పడింది. ప్రస్తుతం అఫ్గాన్‌లో ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదు. భవిష్యత్తులో వస్తాయని చెబుతున్నారు, కానీ ఆ మాటను నమ్మే పరిస్థితి మాత్రం లేదు’’ అని వివరించారు అవాస్తా బకాష్. ఒక్క రోజులో జీవితాలు మారిపోయాయి అఫ్గానిస్తాన్‌లో మా జీవితాలు కేవలం ఒక్క రోజులోనే తలకిందులయ్యాయి. తాలిబన్లు మొదటగా మహిళలపైనే ఉక్కుపాదం మోపారు. తాలిబాన్లను ఆణచివేస్తామన్న ప్రభుత్వం ఒక్కరోజులోనే వారికి సరెండర్ అవడం అంతా కలగా జరిగిపోయింది. అక్కడ మహిళలు మాత్రమే కాదు, పురుషుల జీవితాలు సైతం ప్రశ్నార్థకంగా మారాయి. గడ్డం పెంచడం, సంప్రదాయ వస్త్రధారణ, టోపీ పెట్టుకోవడం వంటి ఆచారాలను తప్పనిసరిగా ఆచరించాల్సి ఉంటుంది. – ముబారకా, బీసీఏ స్టూడెంట్ ఇస్లాం పదాన్ని దుర్వినియోగం చేస్తున్నారు... తాలిబాన్ల సంఖ్య పెరగడానికి కారణం నిరక్షరాస్యత, పేదరికమే. 14 సంవత్సరాల పిల్లలను మదర్సాలకు పంపిస్తారు. అక్కడ వారి మనసులను ముల్లాలు మార్చివేస్తారు. ముల్లాలు చెప్పిందే వేదంగా భావించిన పిల్లలు తాలిబాన్ వైపు అడుగులు వేస్తున్నారు. తాలిబన్ల విస్తరణ ఇస్లాం అనే పవిత్రమైన పదాన్ని దుర్వినియోగం చేస్తూనే జరిగింది. నిరక్షరాస్యులైన తాలిబాన్లు పరిపాలన చేయడం, విధులను ఎలా నిర్వహిస్తారు? – పేరు చెప్పడానికి ఇష్టపడలేదు – వేదుల వి.ఎస్.వి నరసింహం సాక్షి, విశాఖపట్నం -
తాలిబన్ల పైశాచికత్వం: వంట బాలేదని మంటల్లో వేశారు
మహిళా హక్కులు, స్త్రీ స్వేచ్ఛపై తాలిబన్ల హామీలు నీటి మీద రాతలుగా మారుతున్నాయి. అఫ్గాన్‌కు చెందిన నజ్లా ఆయూబీ అనే మాజీ జడ్జి వారి దారుణాలను వెల్లడించారు. అమెరికాలో నివాసముంటున్న నజ్లా ‘స్కై న్యూస్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అఫ్గాన్‌లో మహిళలపై జరుగుతున్న అరాచకాలను బయటపెట్టారు. తమకు వండిన వంట బాగాలేదన్న కారణంగా ఉత్తర అఫ్గాన్‌కు చెందిన ఓ మహిళను చిత్రహింసలకు గురిచేసి ఆమెకు నిప్పు పెట్టారని ఆయూబీ తెలిపారు. చదవండి : Afghanistan: మగపిల్లలకు మహిళా టీచర్లు బోధించొద్దు తమకు ఆహారాన్ని అందించాలని అక్కడి ప్రజలను తాలిబన్లు ఒత్తిడి చేస్తున్నారని, స్థానిక యువతులను చెక్కపెట్టెల్లో బంధించి సెక్స్ బానిసలుగా మార్చేందుకు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని ఆరోపణలు చేశారు. తమ అధీనంలోని ప్రాంతాల్లోని యువతులను తమ ఫైటర్లకిచ్చి వివాహం చేయాలంటూ స్థానిక కుటుంబీకులపై ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు. ఒకపక్క ఇన్ని దారుణాలకు పాల్పడుతూ మరోపక్క మహిళలు స్వేచ్ఛగా పని చేసుకోవచ్చని బూటకపు హామీలు ఇస్తున్నారని ఆయూబీ మండిపడ్డారు. మహిళల హక్కుల కోసం పోరాడే తనలాంటి వారు తాలిబన్ల పాలనలో జీవించడం కష్టమన్న ఉద్దేశంతోనే తాను పారిపోయి వచ్చినట్లు చెప్పారు. మరోవైపు తమను కార్యాలయాలకు వెళ్లకుండా తాలిబన్లు అడ్డుకున్నారంటూ ఇప్పటికే పలువురు మహిళా జర్నలిస్టులు తమ గోడును ప్రపంచానికి వెళ్లబోసుకున్నారు. అఫ్గాన్ జాతీయ జండా పట్టుకున్న వ్యక్తిని చావబాదడం, పోలీసు అధికారి ఒకరిని కాల్చిచంపడం, మైనార్టీ వర్గాలను చిత్రహింసలు పెట్టడం వంటి చర్యలతో తాలిబన్లు తమ క్రూరత్వాన్ని చాటుకుంటున్నారు. -
షరియా.. ఉల్లంఘిస్తే ఉరే
కాబూల్: అఫ్గానిస్తాన్‌ను తాలిబన్లు మళ్లీ హస్తగతం చేసుకోవడంతోపాటు తమ పాలనను ప్రజలపై రుద్దడానికి ప్రయత్నాలు ప్రారంభించిన నేపథ్యంలో షరియా చట్టంపై ఇప్పుడు అందరి దృష్టి మళ్లింది. అఫ్గాన్‌లో తాలిబన్లు షరియా చట్టాన్ని కఠినంగా అమలు చేస్తారని, మహిళలకు ఇక కష్టాలు తప్పవని, వారు స్వేచ్ఛా స్వాతంత్య్రాలు కోల్పోతారని, మగవాళ్ల కింద బానిసలుగా మారిపోతారని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ చట్టానికి తాలిబన్లు తమదైన సొంత భాష్యం చెబుతున్నారు. నిజానికి షరియా అనేది ఇస్లాం లో ఒక చట్టబద్ధమైన వ్యవస్థ అంటున్నారు. షరియా చట్టం కింద అఫ్గానిస్తాన్‌లోని మహిళలు వారి హక్కులను సంపూర్ణంగా అనుభవించవచ్చని భరోసా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో తాలిబన్ల పాలనలో ఈ చట్టం కింద మహిళల స్థితిగతులు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.. ► మహిళలు మార్కెట్‌కు వెళ్లొచ్చా? వెళ్లొచ్చు. అయితే, వారి కుటుంబానికే చెందిన ఒక పురుషుడు తప్పనిసరిగా తోడుగా ఉండాలి. ఒంటరిగా బయట అడుగు పెట్టడానికి వీల్లేదు. ► బయటకు వెళ్లి స్నేహితులతో సరదాగా గడపొచ్చా? ఎంతమాత్రం కుదరదు. మహిళల సరదాలు, సంతోషాలు ఇంటికే పరిమితం. బయటకు వెళ్లి దొరికిపోతే కఠిన శిక్షలుంటాయి. ► మగ స్నేహితులను కలవొచ్చా? 12 ఏళ్ల వయసు దాటిన పరాయి పురుషులతో, కుటుంబ సభ్యులు కాని మగవాళ్లతో మాట్లాడటానికి అనుమతి లేదు. ► చదువుకోవచ్చా? మహిళలు చదువుకోవచ్చు. కానీ, బయట స్కూల్, కాలేజీల్లో కాదు. ఇళ్లల్లోనే చదువు నేర్చుకోవాలి. స్కూళ్లు, కాలేజీలు, మదర్సాలు కేవలం మగవాళ్ల కోసమే. ► మేకప్ వేసుకోవచ్చా? మహిళలు కనీసం గోళ్ల రంగుతో సహా ఎలాంటి మేకప్ వేసుకోవడానికి తాలిబన్లు అనుమతించరు. ► సంగీతం, నృత్యం నేర్చుకోవచ్చా? షరియా కింద సంగీతం చట్టవిరుద్ధం. డ్యాన్స్ కూడా నేర్చుకోవద్దు. వేడుకల్లో పాటలు పాడిన వారిని, నృత్యాలు చేసిన వారిని తాలిబన్లు గతంలో శిక్షించారు. ► కార్యాలయాల్లో పని చేయవచ్చా? చేసుకోవచ్చు. బ్యాంకులు, ప్రభుత్వ ఆఫీసుల్లో పనిచేసే మహిళలు ఇళ్లకు తిరిగి వెళ్లేటప్పుడు తాలిబన్లు ఎస్కార్టుగా వస్తుంటారట. మహిళల బదులు వారి కుటుంబాల్లోని మగవాళ్లను ఉద్యోగాలకు పంపించాలని సూచిస్తుంటారట. ► బుర్ఖా తప్పనిసరిగా ధరించాలా? అవును ధరించాల్సిందే. షరియా చట్టం ప్రకారం మహిళలు తమ అందాన్ని బహిర్గతం చేయకూడదు. 8 ఏళ్లు దాటిన ప్రతి బాలిక బయటకు వెళ్లి నప్పుడల్లా బుర్ఖా ధరించాలి. బయటకు వెళ్లి ఎవరితోనైనా మాట్లాడాల్సి వస్తే కుటుంబ సభ్యుల్లోని మగవారిని తోడుగా తీసుకెళ్లాలి. ► బిగ్గరగా మాట్లాడొచ్చా? అలా మాట్లాడొద్దు. మహిళలు అందరికీ వినిపించేలా గట్టిగా మాట్లాడడం నేరం. ► హై హీల్స్ సంగతేంటి? ఎత్తు మడమల చెప్పులు, బూట్లను తాలిబన్లు నిషేధించారు. మహిళలు నడిచేటప్పుడు శబ్దం రాకూడదు. ► ఇంటి బాల్కనీలో కూర్చోవచ్చా? తాలిబన్ల పాలనలో బాల్కనీల్లో మహిళలు కనిపించకూడదు. ఇంటి లోపలే ఉండాలి. ► సినిమాల్లో నటించవచ్చా? మహిళలు సినిమాల్లో నటించడం, వారి ఫొటోలను వార్తా పత్రికల్లో, పుస్తకాల్లో, పోస్టర్లలో ప్రచురించడం నిషిద్ధం. మోడలింగ్ చేయరాదు. ► షరియా చట్టాన్ని ఉల్లంఘిస్తే ఏమవుతుంది? ఈ చట్టాన్ని ఉల్లంఘించడాన్ని తాలిబన్లు సీరియస్‌గా తీసుకుంటారు. కొరడాలతో కొట్టడం, రాళ్లతో కొట్టి చంపడం, బహిరంగంగా ఉరి తీయడం వంటి కఠినమైన శిక్షలు విధిస్తారు. -
Afghanistan: ఏం పర్లేదు.. తాలిబన్లు క్రికెట్‌ను ప్రేమిస్తారు, మద్దతిస్తారు
కాబుల్: రెండు దశాబ్దాల తర్వాత అఫ్గనిస్తాన్‌లో మరోమారు తాలిబన్లు పాలనా పగ్గాలు చేపట్టడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాచరిక పాలన కొనసాగించే తాలిబన్లకు భయపడుతున్న ప్రజలు కట్టుబట్టలతో దేశం విడిచి పారిపోతున్నారు. ఈ నేపథ్యంలో అఫ్గన్ భవితవ్యం ఎంటనేది ప్రశ్నర్థకంగా మారింది. ఇక క్రికెట్లో కూడా అఫ్గన్ ఇప్పుడిప్పుడే పటిష్టంగా తయారవుతుంది. అయితే తాలిబన్ల రాకతో అఫ్గన్ క్రికెట్‌కు వచ్చిన ప్రమాదమేమి లేదని ఆఫ్గనిస్తాన్ క్రికెట్ సీఈవో హమీద్ షిన్వరీ తెలిపాడు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్య్వూలో హమీద్ మాట్లాడుతూ.. '' తాలిబన్లు క్రికెట్‌ను ప్రేమిస్తారు.. వాళ్లు ఆటకు కూడా మద్దతిస్తారు. వాళ్లు మా ఆటకు అభ్యంతరం చెప్పరనే భావిస్తున్నాం. ఇక దేశంలోని క్రికెటర్లకు మా భరోసా పూర్తిగా ఉంటుంది. ప్రస్తుతం స్టార్ క్రికెటర్లు రషీద్ ఖాన్, మహ్మద్ నబీ, ముజీబ్ జర్దన్‌లు యూకేలో ఉన్నారు. హండ్రెడ్ టోర్నమెంట్లో బిజీగా ఉన్న వాళ్లు తమ కుటుంబసభ్యుల గురించి ఆందోళన పడుతున్నారు. ఈ విషయం గురించి ఆందోళన అవసరం లేదు.. క్రికెటర్ల కుటుంబాలను కాపాడే బాధ్యత మాది.'' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా సెప్టెంబర్ 1 నుంచి పాకిస్తాన్, అఫ్గనిస్తాన్‌ల మధ్య జరగనున్న టీ20 సిరీస్ ప్రశ్నార్థకంగా మారింది. ఇక సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభంకానున్న లీగ్‌లో తమ జట్టుకు ఆడాల్సిన రషీద్ ఖాన్, మహ్మద్ నబీలు అందుబాటులో ఉంటారని సన్‌రైజర్స్ హైదరాబాద్ సోమవారం ప్రకటించింది. ఓ ప్రముఖ న్యూస్ ఏజన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎస్ఆర్హెచ్ ఫ్రాంఛైజీ సీఈవో షణ్ముగం మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్‌లో ఏం జరుగుతుందన్న దానిపై మేము మాట్లాడదలుచుకోలేదు. అయితే, తమ జట్టుకు ప్రాతినిధ్యం వహించే ఆ దేశ క్రికెటర్లు మాత్రం లీగ్‌కు అందుబాటులో ఉంటారని చెప్పగలనని పేర్కొన్నారు. -
మా నిర్ణయం సరైందే.. అది వాళ్ల వైఫల్యం: బైడెన్
US President Joe Biden On Afghan Crisis: అఫ్గనిస్థాన్ నుంచి సైనిక బలాల ఉపసంహరణ.. అటుపై తాలిబన్ల అలవోక ఆక్రమణ పరిణామాల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్ర ఎత్తున్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికా-నాటో దళాల ఉపసంహరణ ద్వారా తాలిబన్ల చేతికి దేశాన్ని అప్పజెప్పాడంటూ అఫ్గన్ ప్రభుత్వం-ప్రజలు సైతం బైడెన్‌పై దుమ్మెత్తి పోశారు. ఈ నేపథ్యంలో ఆయన మీడియా ముఖంగా స్పందించారు. భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి ఆయన జాతిని ఉద్దేశించి ప్రసగించారు. ఆఫ్గనిస్థాన్‌లో పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ కీలక ప్రకటన చేశారు. ఆఫ్ఘాన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణకు కట్టుబడి ఉన్నాం. రెండు దశాబ్దాల తర్వాత సరైన నిర్ణయం తీసుకున్నాం. ఈ నిర్ణయంపై మేం చింతించడం లేదు. అమెరికా ముందు రెండే దారులు ఉన్నాయి. ఒకటి అమెరికా దళాలను వెనక్కి రప్పించుకోవడం. రెండోది.. మూడో దశాబ్దంలోనూ మరింత సైన్యాన్ని పంపి.. మోహరింపు కొనసాగించడం. రెండో దారిలో కొనసాగకూడదనే మా నిర్ణయం ముమ్మాటికీ సరైందనే భావిస్తున్నాం అని బైడెన్ వెల్లడించారు. చదవండి: నేనుంటే రక్తపాతం జరిగి ఉండేది! జాతి నిర్మాణం మా బాధ్యత కాదు ఆఫ్ఘానిస్థాన్‌లో జాతి నిర్మాణం అమెరికా బాధ్యత కాదని, అమెరికాపై ఉగ్రవాదులను నిరోధించడమే లక్ష్యం ఈ సందర్భంగా బైడెన్ స్పష్టం చేశారు. 20 ఏళ్ల క్రితం ఆఫ్ఘనిస్థాన్‌లో ఆల్‌ఖైదాను అంతం చేశాం. బిన్ లాడెన్‌ను పట్టుకునేందుకు మేం వెనక్కి తగ్గలేదు. రెండు దశాబ్దాలుగా అఫ్గన్ సైన్యానికి శిక్షణ ఇచ్చాం. ప్రభుత్వానికి మనోధైర్యం అందించాం. కానీ, వాళ్లు పోరాట శక్తిని ప్రదర్శించలేకపోయారు. అక్కడి ప్రభుత్వం ఊహించిన దానికంటే వేగంగా పతమమైంది. ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్‌లో పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నాం. అవసరమైతే అప్ఘన్ ఉగ్రవాదంపై పోరాటం చేస్తాం. అఫ్గన్ ప్రజలకు అమెరికా సహకారం ఎప్పుడూ ఉంటుంది అని బైడెన్ తేల్చి చెప్పారు. మరోవైపు తాలిబన్ల చర్యలను చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించిన బైడెన్.. అఫ్గన్ నుంచి అమెరికా ప్రతినిధులను వెనక్కి రప్పించామని, అమెరికా సైన్యానికి సాయం చేసిన అఫ్గన్ ప్రజలను సైతం అవసరమైన చేయూత అందిస్తామని స్పష్టం చేశారు. -
తాలిబన్ సంస్కృతి వద్దు
న్యూఢిల్లీ: దేశంలో తాలిబన్ సంస్కృతికి తావు లేదని జేఎన్‌యూలోని ఏబీవీపీ కార్యవర్గ సభ్యులు పేర్కొన్నారు. జేఎన్‌యూ సంక్షోభంపై కేంద్రం వైఖరి సరిగా లేదన్నారు. కన్హయ్య విషయంలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చేవరకు చూడాలని జేఎన్‌యూలో ఏబీవీపీ నేత ప్రదీప్ నర్వాల్ అన్నారు. ప్రదీప్‌తోపాటు జేఎన్‌యూ స్కూల్ ఆఫ్ సోషల్ సెన్సైస్‌లో ఏబీవీపీ అధ్యక్షుడు రాహుల్ యాదవ్, ఇదే విభాగం కార్యదర్శి అంకిత్ హన్స్లు బుధవారం ఏబీవీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ ముగ్గురి తీరును ఏబీవీపీ సీనియర్ నేతలు తప్పుబట్టారు.