బీటెక్ విద్యార్థి అనుమానాస్పద మృతి
తాళ్లరేవు :యానాంకు చెందిన బీటెక్ విద్యార్థి సత్తి భీమేశ్వరరెడ్డి (24) అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. తాళ్లరేవు మండలం అరటికాయలంక వద్ద గౌతమీ గోదావరిలో అతని మృతదేహం గురువారం ఉదయం లభ్యమైంది. పోలీసుల కథనం ప్రకారం.. యానాం గోపాల్ నగర్‌కు చెందిన భీమేశ్వరరెడ్డి స్థానిక రీజెన్సీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఆర్ఐటీ)లో ఇటీవలే బీటెక్ పూర్తి చేశాడు. ఎటువంటి ఉద్యోగం రాకపోవడంతో కొన్ని రోజులుగా మనస్తాపంతో ఉన్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే అతను బుధవారం రాత్రి భోజనం చేసి బయటకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత గురువారం ఉదయం అతని మృతదేహం లభ్యమైంది.
దీంతో గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నారు. అయితే భీమేశ్వరరెడ్డి మృతదేహం, అతని బైక్ లభ్యమైన ప్రాంతాలను బట్టి అతని మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతదేహం గోదావరిలో లభ్యమైనప్పటికీ బైక్ మాత్రం యానాం కనకాలపేటలోని కొబ్బరి తోటలో లభ్యమైంది. అక్కడకు వెళ్లాలంటే కొబ్బరితోటల్లోంచి వెళ్లాల్సి ఉంటుంది. ఆత్మహత్య చేసుకునేవాడే అయితే ప్రధాన రహదారి మీదుగా వెళ్లకుండా అంత మారుమూల ప్రాంతానికి ఎందుకు వెళ్లాడు, అక్కడకు ఒక్కడే వెళ్లాడా లేక ఎవరితోనైనా కలిసి వెళ్లాడా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ ప్రాంతం మద్యం సేవించేందుకు అనుకూలంగా ఉండడంతో స్నేహితులతో కలిసి వెళ్లి ఉండవచ్చన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కోరంగి ఏఎస్సై ఆర్వీఎస్ఎన్ మూర్తి బృందం ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించింది. ఎస్సై ఆర్.ఆనంద్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.