డబ్బులడిగితే కఠిన చర్యలు
108, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను తనిఖీ చేసిన డీఎంహెచ్ఓ
అనంతపురం సిటీ: అత్యవసర సేవలకు డబ్బు డిమాండ్ చేసినట్లు వచ్చిన ఆరోపణలపై జిల్లా వైద్యాధికారి వెంకటరమణ స్పందించారు. ఈ మేరకు బుధవారం జిల్లా వైద్య విధాన పరిషత్ కార్యాలయం వద్ద 108 వాహనాలతో పాటు తల్లీబిడ్డ ఎక్స్ ప్రెస్ వాహనాల్లోని పరికరాలను పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోందన్నారు. డబ్బులు డిమాండ్ చేసిన వారిపై ఫిర్యాదు చేయాలని సూచించారు. వాహనాల్లో మందులు, సిలెన్ బాటిళ్లు, వెంటిలేటర్లు తదితర పరికరాలను ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలన్నారు. సేవల్లో ఎలాంటి జాప్యం జరిగినా ఉపేక్షించేది లేదన్నారు.
విషజ్వరాల నియంత్రణకు కృషి చేయండి
జిల్లావ్యాప్తంగా విష జ్వరాలు నియంత్రించేందుకు సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వెంకటరమణ తెలిపారు. స్థానిక జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలోని సమావేశ భవనంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జనవరి నుంచి నేటి దాకా జిల్లా వ్యాప్తంగా 60 డెంగీ కేసులు, 425 మలేరియా కేసులు నమోదయినట్లు తెలిపారు. క్షేత్ర స్థాయిలో సిబ్బందిని అప్రమత్తం చేసి జ్వరాలు వ్యాపించకుండా చర్యలు చేపట్టామన్నారు. కార్యక్రమంలో టీబీ ఆఫీసర్ డాక్టర్ సుధీర్‌బాబు, లక్ష్మన్న, ల్యాబ్ టెక్నీషియన్లు శ్రీధర్, బాలాజీ, శ్రీనివాసులు, గంగాధర్ పాల్గొన్నారు.