నిర్వేదంగా కాదు... నిక్షేపంగా!
మాన్వి, న్యూస్‌లైన్ : తాలూకాలోని కుర్డి గ్రామంలో పిడుగుపాటుకు గురై ఐదుగురు మృతి చెందిన ఘటన మంగళవారం మధ్యాహ్నం జరిగింది. గ్రామానికి చెందిన హులిగప్ప(40), నిర్మల(30), చంద్రు(22), నాగరాజ్(20), చైతన్య(9)లు పొలం పనిలో నిమగ్నమై ఉండగా, ఉన్నఫళంగా వర్షం ప్రారంభమైంది. దీంతో వారంతా తలదాచుకునేందుకు ఓ చెట్టు కిందకు చేరారు. ఆ సమయంలో చెట్టుపైన పిడుగు పడటంతో ఐదుగురు అక్కడికక్కడే మరణించగా, తీవ్రంగా గాయపడిన పరశురామను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో మరో ఇద్దరు చిన్న పిల్లలకు గాయాలు కాగా, వారిని కుర్డి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందిన వెంటనే మాన్వి ఎమ్మెల్యే హంపయ్య నాయక్, రాయచూరు రూరల్ ఎమ్మెల్యే తిప్పరాజు హవల్దార్, జిల్లాధికారి నాగరాజ్, తహశీల్దార్ శ్యావనూరు, సీఐ హరీష్, ఎస్ఐ దీపక్ బూసరెడ్డి తమ సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఒక్కొ కుటుంబానికి రూ. లక్ష 50 వేలు పరిహారం అందజేస్తామని ప్రకటించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం మాన్వి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మాజీ ఎమ్మెల్యేలు బోసురాజు, రాజారాయప్ప నాయక్, ఎమ్మెల్యే హంపయ్య నాయక్‌లు ఆస్పత్రికి చేరుకుని మృతుల కుటుంబాలను పరామర్శించారు. ఈ ఘటనతో కుర్డి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.