నేడు తుదిదశ పోలింగ్
15 జిల్లాల్లో జెడ్పీ, టీపీ ఎన్నికలు
17,698 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు
ఎన్నికల నిర్వహణకు తరలివెళ్లిన లక్షమంది సిబ్బంది
ఎన్నికలను బహిష్కరించాలని పోస్టర్లు విడుదల చేసిన నక్సల్స్
కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
బెంగళూరు: జిల్లా, తాలూకా పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ముఖ్య ఘట్టమైన పోలింగ్ నేడు(శనివారం) జరగనుంది. మొత్తం 15 జిల్లాల్లో జరగనున్న తుది దశ పోలింగ్‌కు ఎన్నికల కమిషన్ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. చిక్కమగళూరు, దక్షిణ కన్నడ, ఉడుపి, హాసన్, కొడగు, మండ్య, మైసూరు, చామరాజనగర, బీదర్, బళ్లారి, రాయచూరు, కల్బుర్గి, యాదగిరి, కొప్పాళ, విజయపుర జిల్లాల్లో శనివారం పోలింగ్ జరగనుంది. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఇక మొత్తం 15 జిల్లాలకు గాను 531 జిల్లా పంచాయతీ స్థానాలు, 1,939 తాలూకా పంచాయతీలకు సంబంధించి మొత్తం 17,698 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో 4,097 కేంద్రాలను సమస్యాత్మక (సెన్సిటీవ్), 3,626 కేంద్రాలను అతి సమస్యాత్మక ప్రాంతాలుగా (హైపర్ సెన్సీటీవిటీ) అధికారులు గుర్తించారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాలపై ఇప్పటికే ప్రత్యేక దృష్టి సారించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ అక్కడి అభ్యర్థులతో పాటు వారి అనుచరుల పై గట్టి నిఘాను ఏర్పాటు చేసింది. 15 జిల్లాల్లో ఎన్నికల విధుల కోసం 1,00,243 మంది సిబ్బంది పనిచేయనున్నారు.
నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో భద్రత పెంపు....
ఇక నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైన ఉడుపి, హాసన్, రాయచూరు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధిక సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. అవసరమైన చోట బీఎస్ఎఫ్ బలగాలను సైతం మోహరించారు.
నక్సల్స్ పేరిట పోస్టర్లు.....
ఇక చిక్కమగళూరు జిల్లాలోని శృంగేరి తాలూకా బుకుడె బయలు గ్రామంలో ‘ఎన్నికలను బహిష్కరించాల్సిందిగా కోరుతూ నక్సల్స్ పేరిట వెలిసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. ‘గ్రామాల్లో తాగునీటి సౌకర్యం, సరైన రోడ్డు సౌకర్యం, విద్యుత్ వంటివి కల్పించే వరకు ఓటు వేయడానికి వెళ్లకండి, ఎన్నికలను బహిష్కరించండి’ అని రాసి ఉన్న పోస్టర్లు ఈ ప్రాంతంలో వెలిసినట్లు గుర్తించిన శృంగేరి పోలీసులు పరిసర ప్రాంతాల్లో నక్సల్స్ జాడ కోసం కూంబింగ్ ప్రారంభించినట్లు తెలుస్తోంది.