దొరగా వస్తున్న కట్టప్ప!
‘బాహుబలి’కి ముందు తమిళ నటుడు సత్యరాజ్ తెలుగులో మంచి పాత్రలు చేసినప్పటికీ ఆ చిత్రంలో చేసిన ‘కట్టప్ప’పాత్ర ఆయన్ను చాలా పాపులర్ చేసేసింది. ఆ గుర్తింపుని దృష్టిలో పెట్టుకునే తమిళంలో ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘జాక్సన్ దురై’ చిత్రాన్ని తెలుగులోకి ‘దొర’ పేరుతో జక్కం జవహర్‌బాబు విడుదల చేస్తున్నారు. ధరణీధరన్ దర్శకత్వంలో రూపొందిన ఈ పీరియాడికల్ హారర్ ఎంటర్టైనర్లో సత్యరాజ్ తనయుడు శిబిరాజ్ హీరోగా నటించారు. తెలుగమ్మాయి బిందుమాధవి కథానాయిక. చిత్రవిశేషాలను జవహర్‌బాబు తెలియజేస్తూ- ‘‘ఆసక్తికి గురి చేసే హారర్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన చిత్రమిది.
తమిళంలో టీజర్‌కు స్పందన బాగుంది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నాం. సిద్ధార్థ్ విపిన్ అద్భుతమైన పాటలు స్వరపరిచాడు. వెన్నెలకంటి, చంద్రబోస్ చక్కటి సాహిత్యంతో పాటలు రాశారు. శశాంక్ వెన్నెలకంటి డైలాగులు హైలెట్‌గా నిలుస్తాయి. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయి. జూన్ మొదటి వారంలో పాటలనూ మూడో వారంలో సినిమానూ విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమేరా: యువరాజ్, నేపథ్య సంగీతం: చిన్నా.