తమిళం, తెలుగు భాషల్లోకి సన్నిలియోన్ రాత్రి
శృంగార తుపాన్ సన్నిలియోన్ తన సహజ సిద్ధమైన అందాలారబోతతో పాటు భయపెట్టించే దెయ్యంగా నటించిన హిందీ చిత్రం రాగిణి ఎంఎంఎస్-2 చిత్రం రాత్రి పేరుతో తమిళం, తెలుగు భాషల్లో తెరపైకి రానుంది. గత 17 ఏళ్లుగా హిందీ చిత్ర నిర్మాణ రంగంలో పలు విజయవంతమైన చిత్రాలను నిర్మిస్తున్న బాలాజీ మోషన్ పిక్చర్స్ అధినేతలు శోభాకపూర్, ఏక్తాకపూర్ నిర్మించిన తాజా చిత్రం ఇది. హిందీలో వంద కోట్లకు పైగా వసూలు చేసిన ఈ చిత్రంలో సన్నిలియోన్ నటన ప్రధాన ఆకర్షణగా ఉంటుందంటున్నారు చిత్ర వర్గాలు.
సమురాయ్ చిత్రం ఫేమ్ అనిత, పర్విన్దబాస్, సత్య మృదుల్, కరణ్ దలూజా ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి భూషణ్ పటేల్ దర్శకత్వం వహించారు. చిత్తరంజన్బట్, మీట్పరాయ్ అంజాన్, యో యో హనీష్, ప్రణాయ్రిజియా, అమర్ మోహైల్ ఐదుగురు సంగీతాన్ని అందించిన ఈ చిత్రంలోని సన్నిలియోన్ నటించిన బేబీడాల్ అనే పాటను ఇప్పటికి యూట్యూబ్లో ఎనిమిది కోట్ల మంది చూశారట.
ఆ పాటను తెలుగు, తమిళ భాషల్లో నటి రమ్యానంబీషన్ పాడారని చిత్ర యూనిట్ తెలిపారు. చిత్ర షూటింగ్ కోసం ఒక బంగ్లాకు వెళ్లిన చిత్ర బృందాన్ని అందులో ఉన్న దెయ్యం ఎలా బాధించిందన్న ఇతివృత్తంతో తెరకెక్కించిన చిత్రం రాత్రి అనీ, త్వరలోనే చిత్రాన్ని విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించారు.