తెలుగుకు మెలిక
సాక్షి ప్రతినిధి, చెన్నై: నిర్బంధ తమిళం నుంచి విముక్తి కోరుతున్న తెలుగు విద్యార్థులకు వెసులుబాటు కల్పిస్తున్న ముసుగులో ప్రభుత్వం మెలిక పెట్టింది. ఇతర రాష్ట్రాల నుంచి బదిలీపై వచ్చే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు మాత్రమే నిర్బంధ తమిళం నుంచి వెసులుబాటు ఉంటుందనే కొత్త వాదనను తెరపైకి తెచ్చింది.దేశంలోని నాలుగు ప్రధాన రాష్ట్రాల్లో ఒకటైన తమిళనాడు పలుభాషా ప్రజల సమ్మేళనంగా ఉంది.
దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు నివసిస్తున్నారు. ఉద్యోగరీత్యా వస్తూ పోయే వాళ్లూ ఉన్నారు. అయితే ఉమ్మడి మద్రాసు రాష్ట్రం విడిపోయిన నేపధ్యంలో తమిళనాడులో తెలుగువారే అధికశాతం స్థిరపడిపోయారు. ఆంధ్రప్రదేశ్గా వేరుపడినా తమిళనాడులోనే కొనసాగారు. ఇలా తమిళం తరువాత అధికశాతం ఉన్న తెలుగువారికి 2006లో డీఎంకే ప్రభుత్వం తీసుకువచ్చిన నిర్బంధ తమిళ చట్టం ఆశనిపాతమైంది.
మాతృభాషపై మమకారం చంపుకుని తమిళభాషను నేర్చుకోవాలన్న ఈ చట్టంపై తెలుగుతోపాటు ఇతర మైనార్టీ భాషల వారంతా మండిపడ్డారు. గత 10 చట్టపరమైన పోరు సాగిస్తూనే ఉన్నారు. 2006లో తీసుకువచ్చిన ఈ చట్టం ప్రకారం గత 2015-16 విద్యాసంవత్సరంలో మైనార్టీ భాషల విద్యార్థులంతా తమిళంలోనే పరీక్షలు రాయాల్సి వచ్చింది. న్యాయస్థానంలో అవిశ్రాంత పోరుతో ఎట్టకేలకూ దిగివచ్చిన ప్రభుత్వం గత విద్యాసంవత్సరం వరకు తెలుగు పరీక్ష రాసేందుకు అనుమతి ఇవ్వడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
మరి వచ్చే ఏడాది మాటేమిటి: దినగండం నూరేళ్లాయుష్షులా మారిన నిర్బంధ తమిళ చట్టం నుండి ఈ విద్యాసంవత్సరంలో మినహాయింపు లభించేనా అనే ప్రశ్న మళ్లీ ఉత్పన్నమైంది. పాఠశాలలు ప్రారంభమై నెలలు గడుస్తుండగా పది పరీక్షల్లో తెలుగా, తమిళమా అనే అంశంపై విద్యార్థులోల్లో ఆయోమయం నెలకొంది. ఈ అయోమయానికి ప్రభుత్వం తెరదించుతూ రానునున్న పది పరీక్షల్లో తమిళంకు బదులుగా తెలుగు పరీక్ష రాయగోరు విద్యార్దులు ఈనెల 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ కోర్టు ద్వారా హామీ ఇచ్చారు.
లింగ్విస్టిక్ మైనార్టీ భాషల విద్యార్దులు తమ అభీష్టాన్ని ఈనెల 20వ తేదీలోగా లిఖితపూర్వకంగా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అందజే యాలని సూచించారు.
మళ్లీ ఇదేమి మెలిక: ఇదిలా ఉండగా, ప్రభుత్వం మైనార్టీ భాషల విద్యార్దులకు, ముఖ్యంగా తెలుగును ఆశించే విద్యార్దులకు పరోక్షంగా కొత్త మెలిక పెట్టింది. ఇతర రాష్ట్రాల నుండి తమిళనాడుకు బదిలీపై వచ్చే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు వారు కోరిన భాషలో పరీక్ష రాసుకోవచ్చని ప్రకటించింది. అంటే బదిలీపై వచ్చే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు 2006 నిర్బంధ తమిళ చట్టం వర్తించదని పరోక్షంగా స్పష్టం చేసింది.
అంటే నిర్బంధ తమిళం చట్టం నుండి విముక్తి కోరుతూ పోరాడుతున్న వారి గోడును పట్టించుకోకుండా ఎక్కడి నుంచో బదిలీపై రానున్న వారి పిల్లల కోసం ప్రభుత్వం ఎర్రతివాచీ పరిచింది. ఈ కొత్త వాదన వల్ల 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకున్న మైనార్టీ భాషల విద్యార్థుల విజ్ఞప్తులకు ప్రభుత్వం విలువ ఇస్తుందా, అందులోని అంశాలను పరిగణనలోకి తీసుకుంటుందా అనే అనుమానాన్ని లేవనెత్తింది. ప్రభుత్వ తాజా ధోరణిపై ముస్లీం మైనార్టీ విద్యాసంస్థలు, సంఘాలతో కలిసి కోర్టులో సవాలు చేయనున్నట్లు ఏఐటీఎఫ్, లింగ్విస్టిక్ మైనార్టీల ఫోరం చైర్మన్ డాక్టర్ సీఎంకే రెడ్డి తెలిపారు.