Tamil fans
-
'మీ తప్పుడు చూపులు మార్చుకోండి'
సాక్షి, చెన్నై: వెట్రిమారన్ దర్శకత్వంలో ధనుష్ నటించిన ఆడుగళం చిత్రంతో కోలీవుడ్లోకి అడుగుపెట్టిన బ్యూటీ తాప్సీ. ఆ తర్వాత పలు తమిళ చిత్రాల్లో నటించినా ఈ అమ్మడుకి ఆశించినంత అవకాశాలు, విజయాలు అందలేదు. దీంతో తెలుగు, హిందీ చిత్రాలపై దృష్టి సారించి అక్కడ వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. అదే సమయంలో తాను నటిస్తున్న సినిమాల్లోని గ్లామర్, ఫొటోలను అప్పుడప్పుడు సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులను, నెటిజన్లను అలరిస్తోంది. దీనిపై తెలుగు, హిందీ అభిమానుల నుంచి మంచి స్పందన వస్తుంటే తమిళ అభిమానులు మాత్రం అందుకు భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాప్సీ తాజాగా విడుదల చేసిన ఫొటోలను చూసిన తమిళ తంబీలు తాప్సీని ఘాటుగానే విమర్శించారు. అరకొర దుస్తులు ధరిస్తున్నందునే పురుషులు మహిళలను తప్పుడు చూపులతో చూస్తున్నారని దుయ్యబట్టారు. డబ్బు కోసమే ఈ విధంగా నటిస్తున్నారంటూ తాప్సీపై మండి పడ్డారు. అయితే వారి విమర్శలకు తాప్సీ ఘాటుగానే స్పందించింది. మీరంతా ఉత్తములైతే ఎందుకు తప్పుడు భావనతో చూస్తున్నారని ప్రశ్నించింది. ఎదుటి వారిని విమర్శించే ముందు మీ చూపులు మార్చుకోండి అంటూ తమిళ తంబిలకు ఉచిత సలహాలు ఇచ్చింది. -
'హిందీ రుద్దుతున్నారుగా.. తమిళ్ భరించలేరా'
చెన్నై: స్వర మాంత్రికుడు, ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ నిర్వహించిన కచేరి భాషా విభేదాలు తీసుకొచ్చింది. ఆయన మొత్తం తమిళ పాటలే పాడారంటూ హిందీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేయగా అంతే స్థాయిలో తమిళులు రెహమాన్‌కు అండగా నిలిచారు. తమ తమిళ గీతాలను ఒక గంట భరించలేకపోయారా అంటూ మండిపడ్డారు. ఒక తమిళ ప్రోగ్రాం నిర్వహించి అందులో ఓ గంటపాటు ఏఆర్ రెహమాన్ తమిళ గీతాలు పాడితే వాటిని కూడా ఓర్చుకోలేకపోయారంటూ ఓ తమిళ అభిమాని ఆగ్రహం వ్యక్తం చేశారు. దక్షిణాదిపై బలవంతంగా హిందీ రుద్దుతున్నప్పుడు మీరంతా ఎక్కడికి పోయారని, ఆ సమయంలో ఇప్పుడు మీరు ప్రదర్శిస్తున్న అసహనం ఎక్కడికిపోయిందంటూ మరో తమిళ అభిమాని ప్రశ్నించారు. అంతేకాదు, ఏఆర్ రెహమాన్ తమిళ్ వారని, ఆయనకు తమ వద్ద నుంచే పేరు వచ్చిందని, ఈ విషయాన్ని హిందీవాళ్లు గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. దసరా సమయంలో మైసూరులో హిందీ పాటలను విన్నప్పుడు, విమానాల్లో హిందీలో ప్రకటనలు విన్నప్పుడు తమకూ ఇలాగే అనిపిస్తుంటుందని మరో అభిమాని అన్నాడు. ఇలా సోషల్ మీడియాలో తమిళులు, హిందీ అభిమానులు పోరుబాటకు దిగారు. దీనిపై రెహమాన్ మాత్రం ఇంకా స్పందించలేదు.