
'హిందీ రుద్దుతున్నారుగా.. తమిళ్ భరించలేరా'
చెన్నై: స్వర మాంత్రికుడు, ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ నిర్వహించిన కచేరి భాషా విభేదాలు తీసుకొచ్చింది. ఆయన మొత్తం తమిళ పాటలే పాడారంటూ హిందీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేయగా అంతే స్థాయిలో తమిళులు రెహమాన్‌కు అండగా నిలిచారు. తమ తమిళ గీతాలను ఒక గంట భరించలేకపోయారా అంటూ మండిపడ్డారు. ఒక తమిళ ప్రోగ్రాం నిర్వహించి అందులో ఓ గంటపాటు ఏఆర్ రెహమాన్ తమిళ గీతాలు పాడితే వాటిని కూడా ఓర్చుకోలేకపోయారంటూ ఓ తమిళ అభిమాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దక్షిణాదిపై బలవంతంగా హిందీ రుద్దుతున్నప్పుడు మీరంతా ఎక్కడికి పోయారని, ఆ సమయంలో ఇప్పుడు మీరు ప్రదర్శిస్తున్న అసహనం ఎక్కడికిపోయిందంటూ మరో తమిళ అభిమాని ప్రశ్నించారు. అంతేకాదు, ఏఆర్ రెహమాన్ తమిళ్ వారని, ఆయనకు తమ వద్ద నుంచే పేరు వచ్చిందని, ఈ విషయాన్ని హిందీవాళ్లు గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. దసరా సమయంలో మైసూరులో హిందీ పాటలను విన్నప్పుడు, విమానాల్లో హిందీలో ప్రకటనలు విన్నప్పుడు తమకూ ఇలాగే అనిపిస్తుంటుందని మరో అభిమాని అన్నాడు. ఇలా సోషల్ మీడియాలో తమిళులు, హిందీ అభిమానులు పోరుబాటకు దిగారు. దీనిపై రెహమాన్ మాత్రం ఇంకా స్పందించలేదు.