Tamil magazine
-
రంగస్థలం..శ్రీ మహాలక్ష్మీ లేడీస్ డ్రామా గ్రూప్
ఫ్లాష్‌బ్యాక్‌లు సినిమాల్లోనే కాదు నాటకాల్లో కూడా ఉంటాయి. నాటకాల్లోనే కాదు నాటకరంగ సంస్థలకు కూడా ఉంటాయి. ఒక తమిళపత్రికలో నాటకరంగానికి సంబంధించిన వ్యాసం ఒకటి చదివింది జ్ఞానం బాలసుబ్రమణియన్. ఒకాయన తన అభిప్రాయాన్ని ఇలా చెప్పాడు: ‘తమిళ నాటకరంగంలో రాసే మహిళలు, నటించే మహిళలు లేరు. ఎంతో సామర్థ్యం ఉంటేగానీ ఇది సాధ్యం కాదు అనుకోండి’ ఆయన మాటలను సవాలుగా తీసుకుంది జ్ఞానం. వరకట్న రక్కసిపై నాటిక రాసింది. నిజానికి అంతవరకు తనకు రచన, నాటకరంగంలో ఎలాంటి అనుభవం లేదు. తాను రాసిన నాటికను ఆకాశవాణికి పంపించింది. వారు తిరస్కరించారు. చిన్న నిరాశ! జ్ఞానం భర్త పెద్ద అధికారి. ఆయన బాంబేకు బదిలీ అయ్యాడు. భర్తతో పాటు బాంబేకు వెళ్లింది జ్ఞానం. ఒకానొక రోజు వరకట్న సమస్యపై తాను రాసిన నాటికను బాంబేలో ప్రదర్శించారు. అనూహ్యమైన స్పందన వచ్చింది. తన మీద తనకు నమ్మకం ఏర్పడడానికి ఆ స్పందనే కారణం అయింది. ఈ నమ్మకమే ‘మహాలక్ష్మీ లేడిస్ డ్రామా గ్రూప్’ శ్రీకారం చుట్టడానికి నాంది అయింది. నాటకరంగంలో స్త్రీ ప్రాతినిధ్యాన్ని పెంచడానికి ఏర్పాటయిందే ఈ డ్రామా గ్రూప్. అయితే...రకరకాల భయాల వల్ల ఈ డ్రామా గ్రూప్‌లో చేరడానికి మహిళలు సంకోచించేవారు. ‘ప్రయత్నిస్తే ఫలించనిదేముంది’ అనే నానుడిని మరింత గట్టిగా నమ్మింది జ్ఞానం. ఒకటికి పదిసార్లు వారితో మాట్లాడి ఒప్పించింది. మొదట్లో ఇద్దరు చేరారు. ఆ ఇద్దరు ఆరుగురు ఆయ్యారు... అలా పెరుగుతూ పోయారు. అలా చేరిన వాళ్లు గతంలో ఎన్నడూ నాటకాల్లో నటించలేదు. నటన మీద ప్రేమ తప్ప నటనలో ఓనమాలు తెలియని వాళ్లే. సాధారణంగా నాటకాల్లో స్త్రీ పాత్రలను పురుషులు ధరిస్తారు. కానీ ‘మహాలక్ష్మీ లేడీస్ డ్రామా గ్రూప్’లో పురుష పాత్రలను స్త్రీలే ధరిస్తారు. మొదట్లో ఇది చాలామందికి వింతగా అనిపించేది. ఇది ఆ నాటక సంస్థకు చెందిన ‘ప్రత్యేకత’గా కూడా మారింది. ఈ ఆల్–వుమెన్ డ్రామా గ్రూప్ నుంచి కాలక్షేప నాటకాలు రాలేదు. కనువిప్పు కలిగించే నాటకాలు వచ్చాయి. వర్నకట్నం, వర్కింగ్ ఉమెన్స్ ఎదుర్కొనే సమస్యలు, బాల్యవివాహాలు...మొదలైన వాటితో పాట ఆధ్యాత్మిక విషయాలను కూడా ఇతివృత్తాలుగా ఎంచుకుంది ఈ నాటకసమాజం. స్టేజీ ఎక్కడానికి ముందు ఒక్కో నాటకాన్ని ఇంచుమించు 30 సార్లు రిహార్సల్స్ చేస్తారు. కట్ చేస్తే....ఇది సోషల్ మీడియా కాలం. ఒక ఊళ్లో నాటకం వేస్తే ఆ ఊరే చూస్తుంది. అదే నాటకం డిజిటల్ స్పేస్‌లోకి వస్తే ఊరూ, వాడ ఏమీ ఖర్మ...ప్రపంచమే చూస్తుంది. అలా అని.. రంగస్థలాన్ని తోసిరాజనాలనేది వారి ఉద్దేశం కాదు. ఒకవైపు రంగస్థలానికి ప్రాధాన్యం ఇస్తూనే అదనపు వేదికను కూడా సమర్థవంతంగా ఉపయోగించుకోవాలనేది వారి నిర్ణయం వెనక కారణం. తొలిసారిగా ‘ఎందరో మహానుభావులు’ యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని మూడు లక్షల మందికి పైగా వ్యూయర్స్ చూడడం నాటక సంస్థకు ఎంతో ఉత్సాహం, ధైర్యాన్ని ఇచ్చింది. ‘మహాలక్ష్మీ...ఎందరో మహిళల కలలకు రెక్కలు ఇచ్చింది’ అంటోంది సుదీర్ఘ కాలంగా ఈ నాటకరంగ సంస్థతో అనుబంధం ఉన్న కమల ఈశ్వరీ. నాటక సంస్థ మొదలైనప్పుడు...సమస్యలు కొన్నే ఉండవచ్చు. ఇప్పుడు ఎటు చూసినా ఏదో ఒక సమస్య. మాధ్యమాలు కూడా పెరిగాయి. ఆ మాధ్యమాల వేదికగా, రకరకాల ఆధునిక సమస్యలపై పోరాడడమే ‘మహాలక్ష్మీ లేడిస్ డ్రామా గ్రూప్’ లక్ష్యం. -
అశాంతి సృష్టిస్తున్నారు: మోదీ
చెన్నై: భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అసాధ్యమనుకున్న కొన్నింటిని సుసాధ్యం చేశామన్నారు. అయితే, కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, దేశంలో అశాంతిని సృష్టిస్తున్నారని ఆరోపించారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తమిళనాడు సహా దేశవ్యాప్తంగా విపక్షాలు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. తమిళ పత్రిక ‘తుగ్లక్’ నిర్వహించిన కార్యక్రమానికి ప్రధాని మోదీ మంగళవారం ఒక వీడియో సందేశం పంపించారు. తమ ప్రభుత్వ విధానాలు దేశ సామాజిక, ఆర్థిక సామరస్యానికి మరింత దోహదపడ్డాయన్నారు. ‘నేను ఢిల్లీ వచ్చినప్పుడు ఒకటి గమనించాను. ఏళ్లకేళ్లు దేశాన్ని పాలించిన వాళ్లు కీలకాంశాలను పెండింగ్‌లో పెట్టేందుకే ఆసక్తి చూపారు. గోడ గడియారంలో పెండ్యులం లాగా అవి ముందుకు వెనక్కు వెళ్లాలనే వారు కోరుకున్నారు. సమస్యలను సృష్టించడం, వాటిని సాగదీయడం, పరిష్కరించినట్లు నటించడం.. ఇదే వారు చేశారు’ అని కాంగ్రెస్ పై పరోక్ష విమర్శలు చేశారు. ఇలాంటి సమయాల్లోనే ‘తుగ్లక్’ వంటి పత్రికల బాధ్యత మరింత పెరుగుతుందన్నారు. ఈ సందర్భంగా తుగ్లక్ వ్యవస్థాపక ఎడిటర్ చో రామస్వామిపై ప్రధాని ప్రశంసలు కురిపించారు. జీఎస్టీ అమలు, ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాఖ్‌పై నిషేధం.. తదితర చర్యలను ఉటంకిస్తూ.. తాము వచ్చాక గతంలోలా పరిస్థితి లేదన్నారు. నిష్పక్షపాత జర్నలిజం అవసరం: రజనీకాంత్ కార్యక్రమంలో తమిళ సినీ సూపర్ స్టార్ రజనీకాంత్ పాల్గొన్నారు. వాస్తవాలనే రిపోర్ట్ చేయాలని, నిష్పక్షపాతంగా జర్నలిజం ఉండాలని ఈ సందర్భంగా ఆయన మీడియా సంస్థలకు విజ్ఞప్తి చేశారు. చో రామస్వామి లాంటి జర్నలిస్టుల అవసరం దేశానికి ఉందన్నారు. ‘ఇప్పుడు సమాజం, రాజకీయాలు, పరిస్థితులు చెడ్డగా మారాయి. ఈ స్థితిలో మీడియా బాధ్యత మరింత పెరిగింది’ అన్నారు. కొన్ని మీడియా సంస్థలు పాల లాంటి వాస్తవాలను, నీళ్ల వంటి అవాస్తవాలను కలిపి రిపోర్ట్ చేసి, ఏది ఏంటో తెలుసుకోకుండా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని రజిని విమర్శించారు. వాస్తవాలనే రిపోర్ట్ చేయాలని, అబద్ధాలను నిజాలుగా చూపడం మానేయాలని కోరారు. -
తమిళ మ్యాగజైన్‌పై దుమారం..
చెన్నై: మహిళలు, అమ్మాయిల వస్త్రధారణపై అనుచిత వ్యాఖ్యానాలు చేస్తూ కవర్ పేజీ కథనాన్ని ప్రచురించిన తమిళనాడులోని ఓ పత్రికపై సోషల్ మీడియాలో వివాదం చెలరేగింది. 'లెగ్గింగ్స్ ఆర్ వల్గర్ వేర్' అనే పేరుతో వచ్చిన ఈ కథనంపై నెటిజన్లు మండిపడుతున్నారు. వివరాల్లోకి వెడితే తమిళనాడులో 'కుముదం' అనే వార పత్రిక 'నేటి యువత హద్దులు దాటుతున్నారు. మహిళలు ధరించే లెగ్గింగ్స్ చాలా అసభ్యంగా ఉంటున్నాయంటూ' ఈ కథనాన్ని ప్రచురించింది. దీనితో పాటు కొన్ని ఫోటోలను కూడా ఆ పత్రిక... కవర్ పేజీపై ప్రచురించింది. దీంతో దుమారం చెలరేగింది. ఈ కథనాన్ని విమర్శిస్తూ కొంతమంది మహిళలు సోషల్ మీడియాలో కామెంట్లు పోస్ట్ చేశారు. ఆడవాళ్లను అవమానిస్తున్న ఈ కథనంపై కుముదం పత్రిక యాజమాన్యం తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఆడవాళ్ల దుస్తుల గురించి అసభ్యంగా రాసిన సదరు పత్రిక కవర్ పేజీపై అలాంటి ఫోటోలు ఎందుకు ప్రచురించారంటూ ప్రశ్నించారు. అంతేకాకుండా లెగ్గింగ్స్ ధరించిన యువతుల అనుమతి తీసుకోకుండా వారి ఫోటోలను ప్రచురించడంపై మరికొంతమంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసభ్యత అనేది చూసే కళ్ళలోనూ, మనసులోనూ ఉంటుంది తప్ప మహిళల్లో కాదంటూ కామెంట్స్ పోస్ట్ చేశారు. అంతేకాదు దీనికి నిరసనగా 'స్కిన్ టైట్' దుస్తులతో వున్న ఫోటోలను ఆ పత్రికకు పంపాలంటూ సూచించారు.