చెన్నై: భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అసాధ్యమనుకున్న కొన్నింటిని సుసాధ్యం చేశామన్నారు. అయితే, కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, దేశంలో అశాంతిని సృష్టిస్తున్నారని ఆరోపించారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తమిళనాడు సహా దేశవ్యాప్తంగా విపక్షాలు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. తమిళ పత్రిక ‘తుగ్లక్’ నిర్వహించిన కార్యక్రమానికి ప్రధాని మోదీ మంగళవారం ఒక వీడియో సందేశం పంపించారు.
తమ ప్రభుత్వ విధానాలు దేశ సామాజిక, ఆర్థిక సామరస్యానికి మరింత దోహదపడ్డాయన్నారు. ‘నేను ఢిల్లీ వచ్చినప్పుడు ఒకటి గమనించాను. ఏళ్లకేళ్లు దేశాన్ని పాలించిన వాళ్లు కీలకాంశాలను పెండింగ్‌లో పెట్టేందుకే ఆసక్తి చూపారు. గోడ గడియారంలో పెండ్యులం లాగా అవి ముందుకు వెనక్కు వెళ్లాలనే వారు కోరుకున్నారు. సమస్యలను సృష్టించడం, వాటిని సాగదీయడం, పరిష్కరించినట్లు నటించడం.. ఇదే వారు చేశారు’ అని కాంగ్రెస్ పై పరోక్ష విమర్శలు చేశారు. ఇలాంటి సమయాల్లోనే ‘తుగ్లక్’ వంటి పత్రికల బాధ్యత మరింత పెరుగుతుందన్నారు. ఈ సందర్భంగా తుగ్లక్ వ్యవస్థాపక ఎడిటర్ చో రామస్వామిపై ప్రధాని ప్రశంసలు కురిపించారు. జీఎస్టీ అమలు, ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాఖ్‌పై నిషేధం.. తదితర చర్యలను ఉటంకిస్తూ.. తాము వచ్చాక గతంలోలా పరిస్థితి లేదన్నారు.
నిష్పక్షపాత జర్నలిజం అవసరం: రజనీకాంత్
కార్యక్రమంలో తమిళ సినీ సూపర్ స్టార్ రజనీకాంత్ పాల్గొన్నారు. వాస్తవాలనే రిపోర్ట్ చేయాలని, నిష్పక్షపాతంగా జర్నలిజం ఉండాలని ఈ సందర్భంగా ఆయన మీడియా సంస్థలకు విజ్ఞప్తి చేశారు. చో రామస్వామి లాంటి జర్నలిస్టుల అవసరం దేశానికి ఉందన్నారు. ‘ఇప్పుడు సమాజం, రాజకీయాలు, పరిస్థితులు చెడ్డగా మారాయి. ఈ స్థితిలో మీడియా బాధ్యత మరింత పెరిగింది’ అన్నారు. కొన్ని మీడియా సంస్థలు పాల లాంటి వాస్తవాలను, నీళ్ల వంటి అవాస్తవాలను కలిపి రిపోర్ట్ చేసి, ఏది ఏంటో తెలుసుకోకుండా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని రజిని విమర్శించారు. వాస్తవాలనే రిపోర్ట్ చేయాలని, అబద్ధాలను నిజాలుగా చూపడం మానేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment