పన్నీర్‌సెల్వంకు పెద్ద పీట
చెన్నై, సాక్షి ప్రతినిధి: మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఆర్థికమంత్రి ఓ పన్నీర్‌సెల్వంకు ప్రభుత్వంలో మళ్లీ పెద్ద పదవి లభించింది. తమిళనాడు అసెంబ్లీ శాసనసభాపక్ష నేతగా పన్నీర్‌సెల్వం నియమితులైనారు. గెజిట్‌నోట్‌లో అత్యంత ప్రత్యేక ప్రాధాన్యత అని మరీ ప్రస్తావిస్తూ అసెంబ్లీ కార్యదర్శి ఏఎంపీ జమాలుద్దీన్ బుధవారం జారీ చేసిన ఉత్తర్వులు గురువారం రాత్రి మీడియాకు విడుదల చేశారు.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడగానే ఆయా పార్టీలు సమావేశమై శాసనసభాపక్ష నేతను ఎన్నుకుంటారు. అలా అత్యధిక ఎమ్మెల్యేలచే ఎన్నుకోబడిన శాసనసభాపక్షనేత ముఖ్యమంత్రి పదవిని అధిష్టిస్తారు. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా సహజంగా జరిగే ప్రక్రియ ఇది. ఇటీవల కేకే నగర్ ఉప ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలిచిన జయలలిత ఇదే సంప్రదాయంలో అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నికై ఈ ఏడాది మే 23వ తేదీ నుంచి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా, అసెంబ్లీ కార్యదర్శి గురువారం విడుదల చేసిన గెజిట్‌లో ‘లీడర్ ఆఫ్ ది లెజిస్లేటీవ్ అసెంబ్లీ’ (తమిళనాడు శాసనసభాపక్ష నేత)గా రాష్ట్ర ఆర్థిక, ప్రజాపనులశాఖా మంత్రి ఓ పన్నీర్‌సెల్వం నియమితులైనట్లు ప్రకటించారు.
ఈ ప్రకటన వెలువడిన కొద్ది గంటల ముందే ఈనెల 4వ తేదీ నుంచిఅసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు జమాలుద్దీన్ ఒక ప్రకటన విడుదల చేశారు. సంపూర్ణ మద్య నిషేధం అమలుచేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న ఆందోళనలపై రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంది. అలాగే మౌళివాక్కంలో నిర్మాణంలో ఉన్న 11 అంతస్థుల అపార్టుమెంటు కూలిపోయిన దుర్ఘటనపై రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ఒక ప్రకటన చేస్తుందంటూ మద్రాసు హైకోర్టుకు ఇచ్చిన హామీని ఈ సమావేశాల్లో నిలబెట్టుకోవాల్సి ఉంది.
ఇటువంటి కీలకమైన అసెంబ్లీ సమావేశాలు ముందున్న తరుణంలో పన్నీర్‌సెల్వంను అకస్మాత్తుగా శాసనసభాపక్ష నేతగా తెరపైకి తీసుకురావడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇటీవల కొంతకాలంగా అనారోగ్య పరిస్థితులతో ముఖ్యమైన కార్యక్రమాలకు జయ దూరంగా మెలిగారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో సైతం అనారోగ్య పరిస్థితులు తలెత్తి సమావేశాలకు గైర్హాజరైన పక్షంలో ప్రతిపక్షాల విమర్శలకు అవకాశం ఇవ్వకుండా పన్నీర్ నియామకం జరిగినట్లు అంచనావేస్తున్నారు. శాసనసభాపక్ష నేత సభలో ఉన్నందున ముఖ్యమంత్రి లేకున్నా పరవాలేదనే వ్యూహమే పన్నీర్‌సెల్వం నియామకం వెనుక రాజకీయ రహస్యమని తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, డీఎంకే ప్రభుత్వ హ యాంలో ముఖ్యమంత్రి కరుణానిధి కాగా ఆర్కాడు వీరాస్వామి శాసనసభాపక్ష నేతగా వ్యవహరించారు. అలాగే ఆస్తుల కేసులో గత ఏడాది జయ జైలుకెళ్లినపుడు పన్నీర్‌సెల్వం ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టగా, విద్యుత్ శాఖా మంత్రి నత్తం విశ్వనాథన్ శాసనసభాపక్ష నేతగా నియమితులైనారు. అయితే అన్నా డీఎంకే అధినేత్రి జయలలిత ముఖ్య మంత్రిగా ఉన్నపుడు శాసనసభాపక్ష నేతగా మరొకరు ఉండడం ఇదే తొలిసారి.