బన్రూటికి ‘అన్నా’
సాక్షి, చెన్నై: రాష్ట్ర ప్రభుత్వం నేతృత్వంలో ప్రతి ఏటా తిరువళ్లువర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని తమిళ మేధావులు, సమాజ హితాన్ని కాంక్షిస్తూ సేవల్ని అందిస్తున్న వారికి బిరుదుల్ని ప్రదానం చేస్తారు. ఈ ఏడాదికి గాను బిరుదులకు ఎంపికైన వారి వివరాల్ని సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి అన్నా బిరుదుకు బన్రూటి రామచంద్రన్ ఎంపికయ్యారు. ఇటీవల డీఎండీకే నుంచి బన్రూటి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. రాజకీయాల నుంచి తాను వైదొలగుతున్నట్టు బన్రూటి ప్రకటించినా, ఆయన సేవల్ని తమ పార్టీకి ఉపయోగించుకునేందుకు అన్నాడీఎంకే వ్యూహ రచన చేస్తున్నది. ఈ పరిస్థితుల్లో సేవలకు గుర్తింపుగా దివంగత నేత అన్నాదురై అడుగుజాడల్లో నడుస్తున్న బన్రూటికి అన్నా బిరుదును ప్రకటించడం గమనార్హం.
బిరుదులు: తిరువళ్లువర్ బిరుదును యూసీ(తైవాన్), ద్రవిడ సిద్ధాంతకర్త పెరియార్ బిరుదును అన్నాడీఎంకే నాయకురాలు సులోచనా సంపత్, అంబేద్కర్ బిరుదును ప్రొఫెసర్ ఎం ప్రకాష్, అన్నా బిరుదును బన్రూటి రామచ ంద్రన్, విద్యా ప్రదాత, మాజీ ముఖ్యమంత్రి కామరాజర్ బిరుదును అయ్యారు వాండయార్, భారతీయార్ బిరుదును ప్రొఫెసర్ కె జ్ఞాన సంబంధన్, భారతీ దాసన్ బిరుదును రాధాచల్లప్పన్, తిరువికా బిరుదును అశోక్ మిత్రన్, ముత్తమిళ్ కావలర్ విశ్వనాథన్ బిరుదును ప్రొఫెసర్ జయ దేవన్కు ఇవ్వనున్నారు. బుధవారం తిరువళ్లువర్ దినోత్సవ వేడుకలు ఎగ్మూర్ మ్యూజియం ఆవరణలో ఘనంగా జరగనున్నాయి. ఇందులో వీరికి బిరుదులు ప్రదానం చేయనున్నారు. బిరుదులతోపాటుగా సర్టిఫికెట్లు, తలా రూ.లక్ష నగదు, ఒక సవరం బంగారు పతకం అందజేయనున్నారు. అలాగే, ఆర్థికంగా చితికిన తమిళ మేధావులు 30 మందికి ప్రభుత్వ సహకారం అందించనుంది.
సంక్రాంతి పతకాలు: పోలీసుల సేవలకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం పలు అవార్డులను ప్రదానం చే స్తారు. నేరాల కట్టడిలో, సంఘ విద్రోహ శక్తులపై ఉక్కు పాదం మోపే రీతిలో పోలీసులకు సర్వాధికారాల్ని అప్పగించారు. ఈ ఏటా తొలి సారిగా సంక్రాంతి పతకాలు అందించేందుకు నిర్ణయించారు. ఈమేరకు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఆ మేరకు పోలీసు విభాగాల్లో పనిచేస్తున్న 1685 మందికి సంక్రాంతి పతకాలను ప్రకటించింది. 1500 మంది పోలీసులకు, 119 మంది అగ్నిమాపక సిబ్బందికి, 60 మంది జైళ్లలో పనిచేస్తున్న వార్డెన్లు తదితర సిబ్బందికి, పోలీసు ఫొటోగ్రాఫర్లు, డాగ్ స్క్వాడ్, తదితర విభాగాల్లో పనిచేస్తున్న వాళ్లకు తలా ఇద్దరికి చొప్పున ఈ పతకాలను ప్రకటించారు. ఈ పతకాలతో పాటుగా వీరికి ప్రతి నెలా వేతనంతో పతకాల ప్రోత్సాహంగా రూ.200 అదనంగా ఇవ్వనున్నారు.