కత్తిగాటు లేకుండా గుండె ఆపరేషన్
14 ఏళ్ల బాలికకు బెలూన్ పద్ధతిలో చికిత్స
చెన్నై: గుండె కవాటం మూసుకుపోయిన ఓ బాలికకు తమిళనాడు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వైద్యులు కత్తిగాటు లేకుండానే బెలూన్ పద్ధతి ద్వారా సమస్యను నివారించారు. అమిన్జికరాయ్కి చెందిన దివ్య(14) అనే బాలికకు ఐదేళ్ల వయసులోనే కీళ్లవాపు సంబంధ జ్వరం వచ్చింది. దీంతో గుండెపై ప్రభావం పడి ఆమె గుండెకు చెందిన ఓ కవాటం దెబ్బతింది. ఫలితంగా 6 సెం.మీ. వెడల్పు ఉండాల్సిన ఆ కవాటం ఒక సెం.మీ. వెడల్పుకు కుంచించుకుపోయింది. దీంతో ఆమె తరచూ తీవ్ర తలనొప్పి, శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటూ వస్తోంది.
ఐదేళ్ల క్రితం దివ్యకు ఓ ఆస్పత్రి వైద్యులు శస్త్రచికిత్స చేసినా సమస్య అలాగే ఉంది. ఈ నేపథ్యంలో మరోసారి శస్త్రచికిత్సకు బదులుగా ప్రభుత్వాసుపత్రి వైద్యులు బెలూన్ పద్ధతిలో చికిత్స నిర్వహించారు. రక్తనాళం గుండా సూక్ష్మకేశనాళిక సాయంతో ఓ బెలూన్ను పంపించి, కవాటం వద్ద విచ్చుకునేలా చేయడంతో కవాటం తగిన మేరకు వెడల్పు అయింది. సాధారణంగా ఈ చికిత్సకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో రూ.5 లక్షల వరకూ ఖర్చవుతుందని, కానీ పేద కుటుంబానికి చెందిన దివ్యకు ముఖ్యమంత్రి ఆరోగ్య బీమా పథకం కింద ఉచితంగానే చికిత్స చేశామని వైద్యులు తెలిపారు.