భూసేకరణను అడ్డుకుందాం
భూ సేకరణ చట్టం అమలును అడ్డుకుందామని రాజకీయ పక్షాలకు
సామాజిక కార్యకర్త మేథాపాట్కర్, ఎండీఎంకే నేత వైగో పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో ఆదిద్రావిడ, గిరిజన సామాజిక వర్గాల స్థలాల స్వాధీనంపై
తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై విచారించి చర్యలు తీసుకోవాలని
రాష్ట్ర గవర్నర్ కొణిజేటి రోశయ్యకు విజ్ఞప్తి చేశారు.
సాక్షి, చెన్నై : రైతు సంఘాల సమ్మేళనం నేతృత్వంలో భూసేకరణ చట్టానికి వ్యతిరేకంగా తిరువణ్ణామలై జిల్లా సెయ్యూరులో ఆదివారం మహా నిరసన ర్యాలీ జరిగింది. ఇందులో పాల్గొనేందుకు సామాజిక కార్యకర్త మేథాపాట్కర్ వచ్చారు. చెన్నై మీనంబాక్కం విమానాశ్రయంలో ఆమెకు ఎండీఎంకే నేత వైగో శాలువ కప్పి ఆహ్వానం పలికారు. అనంతరం సీపీఎం, సీపీఐ, ఎండీఎంకే ప్రతినిధులతో కలసి రాష్ట్ర గవర్నర్ కొణిజేటి రోశయ్యకు రాష్ర్టంలో ఆది ద్రావిడ, గిరిజన సామాజిక వర్గాల స్థలాల అన్యాక్రాంతం, బలవంతపు స్వాధీనాలపై ఫిర్యాదు చేశారు. అనంతరం ఎండీఎంకే నేత వైగో కలిసి మేథాపాట్కర్ విలేకరులతో మాట్లాడారు.
అడ్డుకుందాం: భూసేకరణ చట్టం ప్రజలకు, దేశానికి వ్యతిరేకమని మండి పడ్డారు.
ఇది కేవలం పెట్టుబడి దారుల కోసం తీసుకొచ్చిన చట్టం మాత్రమేనని ఆరోపించారు. తమిళనాడులో ఆది ద్రావిడ, గిరిజన సామాజిక వర్గాల స్థలాలు కబ్జా అవుతున్నదని, బలవంతంగా లాక్కుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై రాష్ట్ర గవర్నర్ రోశయ్యకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. సీఎం జయలలితతో సంప్రదింపులు జరిపి న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చినట్టు పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కలవడానికి తనకు అవకాశాలు సులభంగా దక్కుతున్నాయని, అయితే, తమిళనాడు సీఎం జయలలితను కలుసుకోవడం గగనం అవుతోందని పేర్కొన్నారు. భూ సేకరణ చట్టానికి వ్యతిరేకంగా ప్రజలందరూ ఏకం కావాలని, అప్పుడే దాని అమలును అడ్డుకోగలమని పిలుపునిచ్చారు. ఎండీఎంకే నేత వైగో మాట్లాడుతూ, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ వస్తుంటే, తమిళనాడు సీఎం జయలలిత మాత్రం మద్దతు ఇవ్వడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా సమయం మించి పోలేదని, ఆ చట్టానికి వ్యతిరేకంగా రాష్ర్ట ప్రభుత్వం తన గళాన్ని విన్పించాలని డిమాండ్ చేశారు.