విశాల్‌కే పట్టం
తమిళసినిమా: ఆ సంఘం కార్యదర్శిగా సభ్యుల సంక్షేమం కోసం పాటు పడుతున్నారు విశాల్. ఇటీవల తమిళ నిర్మాతల పనితీరును ఎండగడుతూ విశాల్ చేసిన వ్యాఖ్యలు ఆయన్ని ఆ సంఘం నుంచి బహిష్కరణకు గురి చేశాయి. అయితే ఆయన చట్టబద్ధంగా పోరాడి అక్కడా గెలిచారు. అలాగే నిర్మాతల మండలి ఎన్నికల్లో పోటీ చేస్తానని విశాల్ ప్రకటించారు. ఆయన్ని ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకునే కుట్రలు సాగాయని చెప్పవచ్చు. అడ్డంకుల్ని ఎదుర్కొని నిర్మాతల మండలి ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేశారు. విశాల్ ఓటమి లక్ష్యంగా కొన్ని జట్లు ఏకం కూడా అయ్యాయి. అయితే వారి కుట్రలు, వ్యూహాలు విశాల్ ముందు పారలేదు. ఆయనకే పట్టంకడుతూ తీర్పు వెలువడింది.
త్రిముఖ సమరంగా రాజకీయ ఎన్నికల వాతావరణాన్ని తలపించిన తమిళ నిర్మాతల ఎన్నికలు ఆదివారం ఉదయం 8 గంటలకు స్థానిక అన్నానగర్‌లోని కందస్వామి కళాశాలలో జరిగాయి. గట్టి పోలీసుల బందోబస్తు మధ్య ఎన్నికల అధికారిగా నియమితులైన మద్రాస్ హైకోర్టు విశ్రాంతి న్యాయమూర్తి రాజేశ్వరన్ పర్యవేక్షణలో ఉత్కంఠభరితంగా జరిగాయి.ఈ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి విశాల్, రాధాకృష్ణన్, కేఆర్ పోటీ పడగా, కార్యదర్శి పదవికి దర్శకుడు మిష్కిన్, జ్ఙానవేల్ రాజ, ఏఎల్ అలగప్పన్, జేఎస్కే సతీష్ కుమార్, కదిరేషన్, మన్నన్, శివశక్తి పాండిన్ బరిలో దిగారు. కాగా కోశాధికారి పదవికి ఎస్.ఆర్.ప్రభు, బాబు గణేష్, ఎస్ఏ చంద్రశేఖరన్, విజయ్ మురళీ పోటీపడ్డారు. రెండు ఉపాధ్యక్ష పదవుల కోసం ప్రకాశ్‌రాజ్, గౌతమ్‌మీనన్, రాజన్, సురేష్, పవిత్రన్, ఏఎం రత్నం, రంగారెడ్డి, పీటీ సెల్వకుమార్ మొదలగువారు పోటీకి దిగారు. వీటితోపాటు 21 కార్యవర్గ సభ్యుల పదవుల కోసం 86 మంది బరిలో ఉన్నారు.
ఎన్నికలు సాయంత్రం 4.15 గంటలకు ముగిశాయి. రజనీకాంత్, కమల్‌హాసన్ మొదలగు సినీ ప్రముఖులు పలువురు ఓటింగ్‌లో పాల్గొని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఈ ఎన్నికల్లో విశాల్ అధ్యక్షుడిగా గెలుపొందారు. ఇందులో విషాల్‌కు 478 ఓట్లు పోల్ కాగా, రాధాకృష్ణన్‌కు 335, కేఆర్‌కు 224 ఓట్లు దక్కాయి. ఓటింగ్ సమయంలో వివాదాలు సైతం సాగాయి. ఓ సందర్భంలో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసినా పోలీసులు రంగప్రవేశంతో సద్దుమణిగింది.
ధన్యవాదాలు : గెలుపనంతరం విశాల్ మీడియాతో మాట్లాడుతూ తనను గెలిపించిన నిర్మాతలందరికీ ధన్యవాదాలు తెలిపారు. చిరు నిర్మాతలకు మాత్రమే కాకుండా నిర్మాతలందరికీ దక్కాల్సిన ఆదాయాన్ని అందేవిధంగా చూస్తామన్నారు. అదేవిధంగా పైరసీ, కేబుల్ టీవీలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే నిర్మాతల మండలి ప్రధాన లక్ష్యం ఏమిటంటే రాష్ట్ర రైతులను ఆదుకోవడానికి కృషి చేస్తామన్నారు. నిర్మాతలకు రావాల్సిన సబ్సిడీ గురించి ప్రభుత్వంతో చర్చించి రాబట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇది యువత కృషికి ప్రతిఫలమే ఈ విజయం అన్నారు.