ఉయ్యాలవాడను జాతీయ యోధుడుగా గుర్తించాలి
♦ తమిళనాడు తెలుగు యువత ఆధ్వర్యంలో సంతకాల సేకరణ
♦ ఉయ్యాలవాడ చరిత్రను వివరిస్తూ ప్రధాని మోదీకి లేఖ
♦ బళ్లారిలో ఉయ్యాలవాడ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండు
బెంగళూరు: తొలి తెలుగు స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి గారిని జాతీయ యోధుడుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించాలని తమిళనాడు తెలుగు యువశక్తి ఆధ్వర్యంలో శుక్రవారం సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. బెంగళూరులోని సెంచరీ క్లబ్ లో జరిగిన ఈ సమావేశానికి రాజ్యసభ సభ్యులు కెసీ రామ్మూర్తి గారు పాల్గొని తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి స్వాతంత్ర్య సమరయోధుడని కొనియాడారు. ఉయ్యాలవాడను జాతీయ యోధుడుగా గుర్తించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి మాట్లాడుతూ.. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని జాతీయ యోధుడుగా గుర్తించేందుకు కర్ణాటక ప్రభుత్వం కూడా కృషి చేయాలన్నారు. కర్ణాటకలోని బళ్లారిలో ఉయ్యాలవాడ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్యని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కేసీ రెడ్డి మనవరాలు రాధికా, బిజేపీ కర్ణాటక నాయకుడు మోహన్ రెడ్డిలు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం తమిళనాడు యువశక్తి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్రను తెలియజేస్తూ జాతీయ యోధుడుగా గుర్తించాలని ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.