లాఫింగ్గ్యాస్ ఎక్కించిన కేసులో తీర్పొచ్చింది
మదురై: ఆక్సిజన్‌కు బదులు లాఫింగ్ గ్యాస్ ఎక్కించి ఓ మహిళ ప్రాణాలుకోల్పోయేందుకు కారణమైన ప్రభుత్వ ఆస్పత్రి ఘటన విషయంలో బాధిత కుటుంబానికి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం రూ.28.37లక్షలు నష్టపరిహారం చెల్లించాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు, నర్సులు నిర్లక్ష్యం వల్లే ఆమె చనిపోయిందని చాలా స్పష్టమైన ఆధారాలు ఉన్నందున ఈ నష్టపరిహారం చెల్లించక తప్పదని చెప్పింది. రుక్మణీ అనే 34 ఏళ్ల మహిళ ట్యూబెక్టమీ చికిత్స కోసం తమిళనాడులోని ప్రభుత్వ నాగర్‌కోయిల్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో మార్చి 18, 2011న చేరింది.
అయితే, ఆమెకు ఆక్సిజన్‌కు బదులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులు నైట్రస్ ఆక్సైడ్ ఎక్కించారు. దీంతో ఆమెకు మరుసటి రోజు విపరీతంగా అనారోగ్యానికి గురైంది. శరీరంలో రక్తం శాతం పడిపోయింది. ఆ తర్వాత వేరే ఆస్పత్రుల్లో చూపించినా ఫలితం లేకుండా పోయింది. ఆమెకు నైట్రస్ ఆక్సైడ్ ఎక్కించినట్లు పరీక్షల్లో తేలింది. సరిగ్గా 2012 మే 4న ఆమె చనిపోయింది.
దీంతో ఆమె భర్త గణేశన్ ఆస్పత్రి తీరువల్ల తమకు తమ ఇద్దరి పిల్లలకు జరిగిన నష్టంపై ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని పరిహారంగా రూ.50లక్షలు చెల్లించాల్సిందేనని డిమాండ్ చేస్తూ కోర్టు మెట్లెక్కాడు. 2013లో ప్రారంభమైన ఈ కేసు విచారణపై తాజాగా తీర్పు వచ్చింది. రూ.28.37లక్షలు బాధిత కుటుంబానికి చెల్లించాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.