దీపావళి తర్వాతనే జయ డిశ్చార్జి!
డాక్టర్ రిచర్డ్ అనుమతి కోసం నిరీక్షణ
సాక్షి ప్రతినిధి, చెన్నై: చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో 37 రోజులుగా చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత దీపావళి పండుగలోగా డిశ్చార్జి అయ్యేలా లేరు. పండుగ ఈ నెల 29, 30 తేదీలు కాగా అమ్మ డిశ్చార్జిపై 27న ఒక ప్రకటన వెలువడచ్చని అపోలో వర్గాలు గతంలో తెలిపాయి. పండుగ సమీపిస్తున్నా ప్రకటనరాకపోవడంతో దీపావళి తరువాతనే డిశ్చార్జి అని భావించాల్సి వస్తోంది.
అపోలో వైద్యులు ఇప్పటివరకు జయలలితకు జరిగిన చికిత్సకు సంబంధించి శుక్రవారం క్షుణ్నంగా అధ్యయనం చేశారు. ఇందుకు సంబంధించిన నివేదికను ఈ మెయిల్ ద్వారా లండన్ వైద్యుడు డాక్టర్ రిచర్డ్ పరిశీలనకు పంపారు. రిచర్డ్ నివేదికను పరిశీలించి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినప్పుడే అమ్మను డిశ్చార్జి చేయాలని అపోలో వైద్యులు నిర్ణయానికి వచ్చారు. దీంతో అమ్మ దీపావళి తరువాతనే డిశ్చార్జి అయ్యే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.