ఇంటెలిజెన్స్ బాస్‌గా మళ్లీ ఆయనే
రెండు నెలల క్రితం రాష్ట్రంలో నిఘా బాస్‌గా ఆయన ఉండేందుకు వీల్లేదంటూ బయటకు పంపేశారు. ఇప్పుడు మళ్లీ ఆయన్నే తెచ్చుకున్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారి కేఎన్ సత్యమూర్తిని తమిళనాడు ప్రభుత్వం మళ్లీ ఇంటెలిజెన్స్ ఐజీగా నియమించింది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి వీకే శశికళ మీద మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తిరుగుబాటు ప్రకటించిన కీలకమైన తరుణంలో ఫిబ్రవరి 12న ఆయనను తప్పనిసరిగా వేచి ఉండాలంటూ బదిలీ చేశారు.
ఆయనను మళ్లీ ఇంటెలిజెన్స్ ఐజీగా నియమిస్తున్నట్లు ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి నిరంజన్ మర్దీ ఒక ప్రకటనలో తెలిపారు. సత్యమూర్తిని తప్పించినప్పుడు.. ఆయన స్థానంలో ఎస్. డేవిడ్సన్ దేవసిర్వతంను నియమించారు. అయితే, పది రోజుల్లోనే ఆయన్ను మళ్లీ వెనక్కి పంపారు. 2015 డిసెంబర్ నాటికి డేవిడ్సన్ ఇంటెలిజెన్స్ ఐజీగా ఉండేవారు. అన్నాడీఎంకే ప్రభుత్వం ఆయన్ను తప్పించి ఆయన స్థానంలో సత్యమూర్తిని నియమించింది.