Tammareddy Krishna Murthy
-
తమ్మారెడ్డి కృష్ణమూర్తి కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: ప్రజానాట్యమండలి వ్యవస్థాపకుడు, కమ్యూనిస్టు పార్టీ సానుభూతిపరుడు, అభ్యుదయ చిత్రాల నిర్మాత తమ్మారెడ్డి కృష్ణమూర్తి సోమవారం ఉదయం మరణించారు. నగర శివార్లలోని కొండాపూర్ చండ్రరాజేశ్వరరావు ఫౌండేషన్ నిర్వహిస్తున్న వృద్ధాశ్రమంలో ఉంటున్న తమ్మారెడ్డి బాత్రూంలోనే కుప్పకూలి చనిపోయారు. ఆయన వయస్సు 94 ఏళ్ళు. ఆయనకు భార్య కృష్ణవేణి, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒక కుమారుడు లెనిన్‌బాబు మృతిచెందగా, మరొకరు ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. కృష్ణమూర్తి మరణవార్త తెలిసిన వెంటనే పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు, బంధుమిత్రులు వృద్ధాశ్రమానికి చేరుకుని ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన భౌతికకాయాన్ని నాగార్జుననగర్‌లోని ఆయన స్వగృహానికి తరలించి మూడు గంటలపాటు ఉంచారు. ఈ సమయంలో అనేక మంది ప్రముఖులు తమ్మారెడ్డి భౌతికకాయాన్ని సందర్శించారు. ఆ తర్వాత సనత్‌నగర్‌లోని ఈఎస్ఐ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. జీవనయానం ఇలా...: కృష్ణా జిల్లా చినపాలపర్రులో 1920 అక్టోబర్ 4న జన్మించిన తమ్మారెడ్డి కృష్ణమూర్తి సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన తమ్మారెడ్డి సత్యనారాయణకి స్వయానా సోదరుడు. తన అన్నతో పాటే ఆయన కూడా కృష్ణాజిల్లా గుడివాడలో సీపీఐ పూర్తికాలపు కార్యకర్తగా పని చేశారు. యువజన, విద్యార్థి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఆయన ప్రజానాట్యమండలి ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. స్వాతంత్య్ర పోరాటంలోనూ, కమ్యూనిస్టు ఉద్యమంలోనూ పాల్గొన్నారు. 1949లో కమ్యూనిస్టు పార్టీపై నిషేధం విధించినప్పుడు ఆయన మద్రాసు వెళ్లి సినీరంగ ప్రవేశం చేశారు. చిత్రసీమ మద్రాసు నుంచి హైదరాబాద్‌కు తరలిరావడంతో ఆయన కూడా ఇక్కడకు వచ్చారు. రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ పేరిట ఓ సంస్థను నెలకొల్పి ఎన్నో అభ్యుదయ, సందేశాత్మక చిత్రాలను నిర్మించారు. లక్షాధికారి, జమీందార్, బంగారుగాజులు, ధర్మదాత, ఇద్దరు కొడుకులు, దత్తపుత్రుడు వంటి చిత్రాలు ఆయన నిర్మించినవే. సినీరంగానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా 2007లో రఘుపతి వెంకయ్య అవార్డు గెలుచుకున్నారు. రాష్ట్రంలో ప్రజానాట్యమండలి పునర్నిర్మాణంలో కీలకపాత్ర పోషించిన కృష్ణమూర్తి తుది శ్వాస విడిచేవరకు ఆ సంస్థతోనూ, కమ్యూనిస్టు పార్టీతోనూ సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. వృద్ధాశ్రమంలో నిర్వహించిన ప్రతి కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. అన్ని విధాలుగా సహాయసహకారాలను అందించారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. -
నిర్మాత తమ్మారెడ్డి కృష్ణమూర్తి ఇక లేరు
స్వాతంత్య్ర సమరయోధుడు, కమ్యూనిస్ట్ నాయకుడు, ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి కృష్ణమూర్తి(93) సోమవారం హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. కృష్ణమూర్తి స్వస్థలం కృష్ణాజిల్లా చినపలపర్రు. పిన్న వయసులోనే దేశభక్తిని హృదయం నిండా నింపుకున్న కృష్ణమూర్తి స్వాతంత్య్రోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఈ సందర్భంలోనే జైలు శిక్ష కూడా అనుభవించారు. కృష్ణమూర్తి గొప్ప వామపక్ష భావజాలికుడు. ప్రజానాట్యమండలిలో కీలక బాధ్యతలను నిర్వర్తించారు. కెరీర్ ప్రారంభానికి ముందు మద్రాసులో సినిమా ఆర్టిస్టుల పిల్లలకు కృష్ణమూర్తి ట్యూషన్స్ చెప్పేవారు. ఎన్టీఆర్ ‘పల్లెటూరు’(1952) చిత్రానికి నిర్మాణ సారథిగా కృష్ణమూర్తి సినీ ప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత సారథీ స్టూడియోస్ నిర్మించిన పలు చిత్రాలకు ప్రొడక్షన్ వ్యవహారాలు పర్యవేక్షించారు కృష్ణమూర్తి. హాలీవుడ్, బాలీవుడ్‌ల్లో ప్రాచుర్యం పొందిన ‘థ్రిల్లర్’ నేపథ్యాన్ని మన తెలుగు తెరకు తీసుకొచ్చింది కృష్ణమూర్తే! ఎన్టీఆర్ హీరోగా వి.మధుసూదనరావు దర్శకత్వంలో ‘లక్షాధికారి’(1962) అనే థ్రిల్లర్ తీశారు. నిర్మాతగా ఆయన తొలి సినిమా ఇదే. దీనికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. తర్వాత ఆ దారిలోనే చాలా సినిమాలు వెలుగు చూశాయి, చూస్తున్నాయి. దటీజ్ తమ్మారెడ్డి! రవీంద్ర ఆర్ట్స్ పతాకంపై కృష్ణమూర్తి నిర్మించిన చిత్రాలు కేవలం పదకొండే. రాశి కన్నా వాసికి విలువిచ్చే నిర్మాత ఆయన. సమాజానికి ఉపయోగ పడే అంశం లేకుండా ఒక్క సినిమా కూడా కృష్ణమూర్తి తీయలేదన్నది నిజం. అక్కినేని కథానాయకునిగా ఆయన నిర్మించిన జమీందార్, బంగారు గాజులు, ధర్మదాత చిత్రాలు వాణిజ్యపరంగా విజయం సాధించడమే కాక, విమర్శకుల ప్రశంసలందుకున్నాయి. తన కుమారుడు లెనిన్‌బాబు దర్శకత్వంలో దత్తపుత్రుడు, డాక్టర్ బాబు, అమ్మా-నాన్న, చిన్ననాటి కలలు, లవ్ మ్యారేజ్ చిత్రాలను నిర్మించారు. కృష్ణమూర్తి నిర్మించిన సిసింద్రీ చిట్టిబాబు, ఇద్దరు కొడుకులు చిత్రాలు కూడా విజయాన్ని అందుకున్నాయి. 1982 నుంచి కృష్ణమూర్తి సినీ నిర్మాణానికి పుల్‌స్టాప్ పెట్టారు. నిర్మాతగా బాధ్యతలను విరమించినా ఒక పౌరునిగా చివరి క్షణం వరకూ అవిశ్రాంతంగా సేవాకార్యక్రమాలు నిర్వహించారు. ఆయనకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడైన దర్శకుడు లెనిన్‌బాబు చిన్న వయసులోనే దివంగతులయ్యారు. రెండో కుమారుడు తమ్మారెడ్డి భరద్వాజ్ దర్శక, నిర్మాతగా, కార్మిక నేతగా రాణిస్తూ... సినీ ప్రముఖునిగా వెలుగొందుతున్నారు. ఎందరికో స్ఫూర్తిదాయకుడైన తమ్మారెడ్డి కృష్ణమూర్తి మరణం తెలుగు చలనచిత్ర పరిశ్రమకు నిజంగా తీరని లోటు. సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లో ఆయన అంత్యక్రియలు జరిగాయి. కృష్ణమూర్తి పార్థివ దేహాన్ని సందర్శించిన వారిలో డా.అక్కినేని నాగేశ్వరరావు, దాసరి నారాయణరావు, జమున, సి.నారాయణరెడ్డి తదితర సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నారు.