డీఎండీకే నేత ఇంటిపై బాంబు దాడి
టీనగర్(చెన్నై): పెరంబుదూరు సమీపంలో డీఎండీకే నేత ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు బాంబుతో దాడి చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి బాంబు దాడికి పాల్పడిన ముఠా కోసం గాలిస్తున్నారు. పెరంబుదూరు సమీపంలోని తండలంలో డీఎండీకే నేత శశికుమార్ నివసిస్తున్నారు. ఇతడు తండలం పంచాయతీ ఉపాధ్యక్షునిగా, డీఎండీకే యూనియన్ నిర్వాహకునిగా ఉన్నారు.
ప్రస్తుతం స్థానిక ఎన్నికల్లో శశికుమార్ పంచాయతీ అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు నిర్ణయించారు. ఇందుకోసం ఆయన శుక్రవారం ఉదయం నామినేషన్ వేసేందుకు బయలుదేరారు. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు శశికుమార్ ఇంటిపై నాటు బాంబులు విసిరి పరారయ్యారు. అదృష్టవశాత్తు బాంబు దాడిలో ఎవరూ గాయపడలేదు. కాగా శశికుమార్ పంచాయతీ అధ్యక్ష పదవికి పోటీ చేయడం ఇష్టంలేని వర్గం ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసులు బాంబులు విసిరిన ముఠా కోసం గాలిస్తున్నారు.