తాండవ నీరు విడుదలకు ముహూర్తం
నాతవరం : తాండవ జలాశయం నుంచి ఆయకట్టు భూములకు ఈనెల 17వ తేదీ నుంచి నీటి విడుదలకు నిర్ణయించినట్టు డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ పారుపల్లి కొండబాబు తెలి పారు. రిజర్వాయరు ప్రాంతంలో సోమవారం డీఈ రాజేంద్రకుమార్ ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఉబాలు, సాగునీటి అవసరం దష్ట్యా నీటిని విడుదల చేయాలని డీసీ మెంబరు,్ల నీటి సంఘాలు అధ్యక్షులు, రైతులు కోరారు. లేకుంటే వరినారుమడులు ఎండిపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఈనెల 17వ తేదీ మధ్యాహ్నం 3.45 గంటకు నీటి విడుదలకు నిర్ణయించారు. ఈనెల 9న సమావేశమై ఈనెల 22 నుంచి నీటి విడుదలకు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈవారం రోజులుగా ఎండల తీవ్రతతో వరినారు మడులు ఎండిపోతున్నందున తేదీని మార్చామని చైర్మన్ కొండబాబు తెలిపారు. ఈలోగా వర్షం అనుకూలిస్తే గతంలో నిర్ణయించిన 22వ తేదీ నుంచే నీటిని విడుదల చేస్తామన్నారు. జలాశయంలో సోమవారం సాయంత్రానికి 365.7 అడుగుల నీరు ఉంది. ఈ నీరు విడుదల చేస్తే సుమారు 62 రోజులకు మాత్రమే సరిపోతుందని డీఈ రాజేంద్రకుమార్ తెలిపారు.