Tandur agricultural market
-
వర్షార్పణం!
తాండూరు, న్యూస్‌లైన్: అకాల వర్షం అన్నదాతలను నిండా ముంచింది. వ్యాపారులకూ ఆర్థిక నష్టాన్ని మిగిల్చింది. మంగళవారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి తాండూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో పంటల ఉత్పత్తులకు భారీ నష్టం వాటిల్టింది. అమ్ముకునేందుకు యార్డుకు తరలించిన పంటలతోపాటు రైతుల నుంచి వ్యాపారులు కొనుగోలు చేసిన ఉత్పత్తులు వర్షార్పణం అయ్యాయి. దీంతో అటు రైతులు, ఇటు వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. క్రితం రోజు వర్షానికి వేలాది బస్తాల వేరుశనగలు, కందులు, శనగలు, మొక్కజొన్నలు తడిసి ముద్దయ్యాయి. సుమారు 12 వేల బస్తాల్లో నిల్వ చేసిన వేరుశనగలు నల్లగా రంగు మారాయి. సుమారు రూ.2 కోట్ల మేరకు పప్పుధాన్యాల ఉత్పత్తులు వర్షంలో తడిసి నష్టం వాటిల్లిందని వ్యాపారులు వాపోయారు. ఒకవైపు వర్షం జోరు.. మరోవైపు వడగళ్లు కురవడంతో యార్డులో పంటను కాపాడుకునేందుకు రైతులు, హమాలీలు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. మార్కెట్ యార్డులో పంటలను నిల్వ చేసుకునేందుకు రెండో షెడ్ లేకపోవడమే నష్టానికి కారణమని పలువురు వ్యాపారస్తులు పేర్కొన్నారు. పూర్తి సౌకర్యాలు కల్పించాలని ఎన్నోసార్లు పాలకమండలి, మార్కెట్‌యార్డు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా షెడ్ నిర్మాణం చేపట్టలేదని వ్యాపారులు విమర్శిస్తున్నారు. అలాగే హైదరాబాద్ మార్గంలోని ఖాంజాపూర్ సమీపంలో కొత్త యార్డు ఏర్పాటులో జాప్యాన్ని వారు తప్పుపడుతున్నారు. జరిగిన నష్టాన్ని ఎవరూ పూడ్చుతారని పలువురు వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. మాకెవరు దిక్కని రైతులు వాపోతున్నారు. ఇకముందైనా ఇలాంటి నష్టం వాటిల్లకుండా అధికారులు మార్కెట్లో పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించాలని వ్యాపారులు, రైతులు కోరుతున్నారు. రెండు రోజల నుంచి కురుస్తున్న వర్షాలకు షాబాద్ మండలంలోని కక్కులూరు, కేసారం, నరెడ్లగూడ, హైతాబాద్, మద్దూర్ గ్రామాల్లో మిర్చి, కీరదోస, సొరకాయ, టమాటా, ఉల్లి, క్యాబేజి, కాకర పంటలు దెబ్బతిన్నాయి. మామిడి, పూలతోటలకు నష్టం వాటిల్లింది. వడగళ్లు, ఈదురు గాలులకు ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్, శేరిగూడ, నాగన్‌పల్లి, పోల్కంపల్లి, ముకునూరు, నైల్లి గ్రామాల పరిధిలో గల వందలాది ఎకరాల్లోని మామిడి తోటలకు తీవ్ర నష్టం ఏర్పడింది. పూత, పిందెలు రాలిపోయాయి. రాందాస్‌పల్లి, మల్శెట్టిగూడ, చింతపల్లిగూడ తదితర గ్రామాల్లో వడగళ్లు పడడంతో వివిధ పంటలకు నష్టం కలిగింది. మేడ్చల్ మండలం డబిల్పూర్, సోమారం, లింగాపూర్, రాయిలాపూర్, బర్మాజిగూడ, శ్రీరంగవరం గ్రామాల్లో టమాటా, ఆలుగడ్డ పంటలు దెబ్బతిన్నాయి. బషీరాబాద్ మండలం జీవన్గిలో వడగళ్ల కారణంగా మిరప పంట దెబ్బతిన్నది. వరుస నష్టాలను చవిచూస్తున్న మిర్చి రైతులకు ఈ సారీ కలిసిరాలేదు. కందుకూరు మండల పరిధిలోని నేదునూరులో అధిక మొత్తంలో పంటలు దెబ్బతిన్నాయి. బాచుపల్లి, ధన్నారం, చిప్పలపల్లి, దెబ్బడగూడ, దాసర్లపల్లి గ్రామాల్లో వడగళ్లకు క్యాప్సికం, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. టమాటా, కీరదోస, చిక్కుడు, మొక్కజొన్న పంటలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. -
‘జీరో’ దందా జోరు!
తాండూరు, న్యూస్‌లైన్: కర్ణాటక సరిహద్దులో తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారుల నిఘా కొరవడింది. సరిహద్దులో గతంలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును సిబ్బంది కొరత కారణంగా ఎత్తివేశారు. చెక్‌పోస్టు లేకపోవడంతో వేరుశనగల అక్రమ రవాణాకు ఆస్కారం కలుగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మార్కెట్ యార్డులో కొందరు వ్యాపారులు వేరుశనగల జీరో వ్యాపారం చేస్తూ సరకును సరిహద్దులు దాటిస్తుండడంతో కమిటీకి రావాల్సిన 1శాతం ఫీజుకు గండిపడుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకవైపు జీరో వ్యాపారంతో వేరుశనగల కొనుగోళ్లపై మార్కెట్ ఆదాయానికి ఎగనామం పెడుతూ.. మరోవైపు ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధర కన్నా తక్కువ చెల్లించడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. యార్డులో గత జనవరి 10 నుంచి వేరుశనగల క్రయ విక్రయాలు ప్రారంభమయ్యాయి. 4300 క్వింటాళ్ల వేరుశనగల కొనుగోళ్లు ఇప్పటి వరకు తాండూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో సుమారు 4300 క్వింటాళ్ల వేరుశనగల వ్యాపారం జరిగింది. ప్రభుత్వం మద్దతు ధర క్వింటాలుకు రూ.4 వేలు. కానీ ఇప్పటి వరకు వేరుశనగలకు మద్దతు ధర పలకపోవడం గమనార్హం. సీజన్ ఆరంభం నుంచి ఈ నెల 7వ తేదీ వరకు క్వింటాలుకు గరిష్టంగా రూ.3400, కనిష్టంగా రూ.3100, సగటు (మోడల్) ధర రూ.3200 పలికింది. ఏ విధంగా ధరల తీరును పరిశీలించినా మద్దతు ధర కన్నా తక్కువ పలికినట్టు స్పష్టమవుతోంది. సగటు ధర ప్రకారమైతే క్వింటాలుకు ఒక్కో రైతు రూ.800 చొప్పున నష్టపోయినట్టు స్పష్టమవుతోంది. ఈ లెక్కన ఇప్పటి వరకు జరిగిన కొనుగోళ్లపై సుమారు రూ.34.40లక్షలు రైతులు నష్టపోవాల్సి వచ్చింది. మార్కెట్ ఫీజుకు గండి రైతుల నుంచి కొనుగోలు చేసిన వేరుశనగలపై వ్యాపారులు వంద రూపాయలకు ఒక రూపాయి (ఒక శాతం) మార్కెట్ ఫీజు కింద చెల్లిస్తారు. కొందరు వ్యాపారులు పూర్తి స్థాయిలో సరకుకు మార్కెట్ ఫీజు చెల్లిస్తున్నారు. మరికొందరు వ్యాపారులు కొనుగోలు చేసిన వేరుశనగలను తక్కువగా చూపిస్తూ.. మిగితా సరకు జీరో చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో మార్కెట్ ఫీజు కింద చెల్లించాల్సిన 1 శాతం ఫీజును ఎగవేస్తూ సరకును కర్ణాటక సరిహద్దులు దాటించేస్తున్నారనే ఆరోపణలున్నాయి. అధికారికంగా కొనుగోలు చేసిన సరకుకు సమానంగా జీరో వ్యాపారం సాగుతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. రాత్రి వేళలో అధికారులు పూర్తి స్థాయిలో నిఘా పెట్టకపోవడంతో సరిహద్దులోని గౌతాపూర్ మీదుగా సరకును తరలిస్తున్నారు. అర్ధరాత్రి నుంచి తతంగం ఈ వ్యవహారాలన్నీ అర్ధరాత్రి 12గంటలు తర్వాత మొదలై తెల్లవారుజాము వరకు కొనసాగుతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. మండల పరిధిలోని గౌతాపూర్ మీదుగా సరకు మహారాష్ట్రలోని షోలాపూర్‌కు తరలిస్తున్నారని తెలుస్తోంది. సుమారు రూ.కోటి సరకు అక్రమంగా సరిహద్దులు దాటిందని సమాచారం. సరిహద్దులో నిఘా పటిష్టం చేయడంతోపాటు రాత్రి పూట యార్డుపై అధికారులు దృష్టిసారిస్తే జీరో వ్యాపారానికి బ్రేక్‌పడి.. మార్కెట్ ఫీజు రూ.లక్షల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. బషీరాబాద్‌లో కందుల జీరో వ్యాపారం బషీరాబాద్ మండలంలో కందుల జీరో వ్యాపారం జోరుగా సాగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మండలంలో ఓ వ్యాపారి కందుల కొనుగోలుపై మార్కెట్ ఫీజు చెల్లించకుండానే కర్ణాటకకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడనే ఆరోపణలు వస్తున్నాయి. రైతుల పేరు మీదనే ఈ తతంగాన్ని కొనసాగిస్తూ సదరు వ్యాపారి మార్కెట్ ఫీజుకు గండి కొడుతున్నాడనే ఆరోపణలున్నాయి. -
సిండి‘కేట్ల’ దోపిడీ రూ.1.08 కోట్లు
తాండూరు, న్యూస్‌లైన్: తాండూరు వ్యవసాయ మార్కెట్లో కంది రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. మార్కెట్ యార్డులో రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర అందడం లేదు. తమ పంటోత్పత్తికి మద్దతు ధర లభిస్తుందని ఆశగా తాండూరు మార్కెట్‌కు కందులు తీసుకొచ్చిన రైతులు ఈ సీజన్లో మొత్తంగా రూ.1.08 కోట్లు నష్టపోవాల్సి వచ్చింది. సిండికేట్‌గా మారిన వ్యాపారులు, దళారులు నాణ్యత పేరుతో కొర్రీలు పెట్టి ఇటు రైతును, అటు మార్కెట్ సెస్‌ను దోచుకుంటున్నారు. ఈ సీజన్లో కందులకు ప్రభుత్వం రూ.4,300 మద్దతు ధర నిర్దేశించింది. తాండూరు వ్యవసాయ మార్కెట్లో నవంబర్ 7 నుంచి కందుల క్రయవిక్రయాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు సుమారు 36 వేల క్వింటాళ్ల కందులను మార్కెట్లో వ్యాపారులు కొనుగోలు చేశారు. సీజన్ ప్రారంభంలో గరిష్టంగా రూ. 4,530, కనిష్టంగా రూ.4,200 ధర పలికింది. వ్యాపారులు నామమాత్రంగా గరిష్ట ధరకు కొనుగోలు చేసి, మిగిలిందంతా కనిష్ట ధరకే కొనుగోలు చేసినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తర్వాత మార్కెట్‌కు కందులు వెల్లువెత్తుతుండడంతో వ్యాపారులు సిండికేట్‌గా మారారు. ధరలను తగ్గించివేశారు. ప్రస్తుతం మార్కెట్లో గరిష్ట ధర రూ. 4,160 పలుకుతుండగా, కనిష్టంగా రూ.3,800గా ఉంది. సగటు ధర (మోడల్) సీజన్ ఆరంభం నుంచి ఇప్పటివరకు రూ. 4,000 వద్ద స్థిరంగా ఉంది. సగటు ధర ప్రకారం రూ.14.40 కోట్ల విలువ చేసే 36 వేల క్వింటాళ్ల కందులు కొనుగోలు చేశారు. అంటే ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ. 4,300కు రూ.300 తగ్గించి కొనుగోలు చేశారు. ఈ లెక్కన క్వింటాకు రైతులు రూ.300 చొప్పున దాదాపు రూ.1.08 కోట్లు నష్టపోవాల్సి వచ్చింది. అంతేకాకుండా మార్కెట్ కమిటీకి వందకు రూపాయి చొప్పున రూ.1.08 లక్షల సెస్‌కు గండికొట్టారు. ఆందోళనలు చేసినా... కందుల కొనుగోళ్ల సీజన్ ఆరంభంలోనే జిల్లాలోని కోడంగల్, కోస్గి, దౌల్తాబాద్ గ్రామాలకు చెందిన రైతులు మార్కెట్ యార్డులో వ్యాపారుల సిండికేట్‌పై ఆందోళలనకు దిగారు. మద్దతు ధర చెల్లించకుండా కందులను కొనుగోలు చేస్తున్నా.. పట్టించుకోవడంలేదని అధికారులతో వాదనకు దిగారు. అయినా యార్డులో రైతులను పట్టించుకునే వారేలేకుండా పోయారు. తక్కువ ధరకు అమ్మక తప్పడం లేదు కందులకు ప్రభుత్వ మద్దతు ధర రూ.4,300 రావడం లేదు. నాణ్యతలేదని క్వింటాలుకు రూ.4వేల కన్నా ఎక్కువ ఇవ్వడం లేదు. ధర వచ్చే వరకు ఆగితే కుటుంబ అవసరాలు. సాగు కోసం చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించడం తదితర ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. తప్పనిసరి పరిస్థితుల్లో తక్కువ ధరకు అమ్ముకుంటున్నాం. - శివరాజ్, రైతు, చింతమణిపట్నం మా గోడు ఎవరూ పట్టించుకోరు ధర కోసం రోజుల తరబడి యార్డులో పంటను పెట్టుకోవడం సాధ్యం కావడం లేదు. మద్దతు ధర అడిగితే పంటను ఎవరూ కొనడం లేదు. మా గోడు ఎవరూ పట్టించుకోవడం లేదు. పంటను యార్డులో పెట్టినా ఆశించిన ధర రాలేదు. రూ.3,900 ధరకు రెండు బస్తాల కందులను విక్రయించాను. - వెంకటయ్య, రైతు, హస్నాబాద్