‘జీరో’ దందా జోరు! | Groundnut smuggling at border | Sakshi
Sakshi News home page

‘జీరో’ దందా జోరు!

Published Tue, Feb 11 2014 1:56 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM

Groundnut smuggling at border

తాండూరు, న్యూస్‌లైన్:  కర్ణాటక సరిహద్దులో తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారుల నిఘా కొరవడింది. సరిహద్దులో గతంలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును సిబ్బంది కొరత కారణంగా ఎత్తివేశారు. చెక్‌పోస్టు లేకపోవడంతో వేరుశనగల అక్రమ రవాణాకు ఆస్కారం కలుగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మార్కెట్ యార్డులో  కొందరు వ్యాపారులు వేరుశనగల జీరో వ్యాపారం చేస్తూ సరకును సరిహద్దులు దాటిస్తుండడంతో కమిటీకి రావాల్సిన 1శాతం ఫీజుకు గండిపడుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

 ఒకవైపు జీరో వ్యాపారంతో వేరుశనగల కొనుగోళ్లపై మార్కెట్ ఆదాయానికి ఎగనామం పెడుతూ.. మరోవైపు ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధర కన్నా తక్కువ చెల్లించడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. యార్డులో గత జనవరి 10 నుంచి వేరుశనగల క్రయ విక్రయాలు ప్రారంభమయ్యాయి.

 4300 క్వింటాళ్ల వేరుశనగల కొనుగోళ్లు
 ఇప్పటి వరకు తాండూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో సుమారు 4300 క్వింటాళ్ల వేరుశనగల వ్యాపారం జరిగింది. ప్రభుత్వం మద్దతు ధర క్వింటాలుకు రూ.4 వేలు. కానీ ఇప్పటి వరకు వేరుశనగలకు మద్దతు ధర పలకపోవడం గమనార్హం. సీజన్ ఆరంభం నుంచి ఈ నెల 7వ తేదీ వరకు క్వింటాలుకు గరిష్టంగా రూ.3400, కనిష్టంగా రూ.3100, సగటు (మోడల్) ధర రూ.3200 పలికింది.

 ఏ విధంగా ధరల తీరును పరిశీలించినా మద్దతు ధర కన్నా తక్కువ పలికినట్టు స్పష్టమవుతోంది. సగటు ధర ప్రకారమైతే  క్వింటాలుకు ఒక్కో రైతు రూ.800 చొప్పున నష్టపోయినట్టు స్పష్టమవుతోంది. ఈ లెక్కన ఇప్పటి వరకు జరిగిన కొనుగోళ్లపై సుమారు రూ.34.40లక్షలు రైతులు నష్టపోవాల్సి వచ్చింది.

 మార్కెట్ ఫీజుకు గండి
 రైతుల నుంచి కొనుగోలు చేసిన వేరుశనగలపై వ్యాపారులు  వంద రూపాయలకు ఒక రూపాయి (ఒక శాతం) మార్కెట్ ఫీజు కింద చెల్లిస్తారు. కొందరు వ్యాపారులు పూర్తి స్థాయిలో సరకుకు మార్కెట్ ఫీజు చెల్లిస్తున్నారు. మరికొందరు వ్యాపారులు కొనుగోలు చేసిన వేరుశనగలను తక్కువగా చూపిస్తూ.. మిగితా సరకు జీరో చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

దీంతో మార్కెట్ ఫీజు కింద చెల్లించాల్సిన 1 శాతం ఫీజును ఎగవేస్తూ సరకును కర్ణాటక సరిహద్దులు దాటించేస్తున్నారనే ఆరోపణలున్నాయి. అధికారికంగా కొనుగోలు చేసిన సరకుకు సమానంగా జీరో వ్యాపారం సాగుతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. రాత్రి వేళలో అధికారులు పూర్తి స్థాయిలో నిఘా పెట్టకపోవడంతో సరిహద్దులోని గౌతాపూర్ మీదుగా సరకును తరలిస్తున్నారు.

 అర్ధరాత్రి నుంచి తతంగం
 ఈ వ్యవహారాలన్నీ అర్ధరాత్రి 12గంటలు తర్వాత మొదలై తెల్లవారుజాము వరకు కొనసాగుతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. మండల పరిధిలోని గౌతాపూర్ మీదుగా సరకు మహారాష్ట్రలోని షోలాపూర్‌కు తరలిస్తున్నారని తెలుస్తోంది.  సుమారు రూ.కోటి సరకు అక్రమంగా సరిహద్దులు దాటిందని సమాచారం. సరిహద్దులో నిఘా పటిష్టం చేయడంతోపాటు రాత్రి పూట యార్డుపై అధికారులు దృష్టిసారిస్తే జీరో వ్యాపారానికి బ్రేక్‌పడి.. మార్కెట్ ఫీజు రూ.లక్షల ఆదాయం వచ్చే అవకాశం ఉంది.

 బషీరాబాద్‌లో కందుల జీరో వ్యాపారం
 బషీరాబాద్ మండలంలో కందుల జీరో వ్యాపారం జోరుగా సాగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మండలంలో ఓ వ్యాపారి కందుల కొనుగోలుపై మార్కెట్ ఫీజు చెల్లించకుండానే కర్ణాటకకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడనే ఆరోపణలు వస్తున్నాయి. రైతుల పేరు మీదనే ఈ తతంగాన్ని కొనసాగిస్తూ సదరు వ్యాపారి మార్కెట్ ఫీజుకు గండి కొడుతున్నాడనే ఆరోపణలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement