తాండూరు, న్యూస్‌లైన్: తాండూరు వ్యవసాయ మార్కెట్‌లో కంది రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. మార్కెట్ యార్డులో రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర అందడం లేదు. తమ పంటోత్పత్తికి మద్దతు ధర లభిస్తుందని ఆశగా తాండూరు మార్కెట్‌కు కందులు తీసుకొచ్చిన రైతులు ఈ సీజన్‌లో మొత్తంగా రూ.1.08 కోట్లు నష్టపోవాల్సి వచ్చింది. సిండికేట్‌గా మారిన వ్యాపారులు, దళారులు నాణ్యత పేరుతో కొర్రీలు పెట్టి ఇటు రైతును, అటు మార్కెట్ సెస్‌ను దోచుకుంటున్నారు. ఈ సీజన్‌లో కందులకు ప్రభుత్వం రూ.4,300 మద్దతు ధర నిర్దేశించింది. తాండూరు వ్యవసాయ మార్కెట్‌లో నవంబర్ 7 నుంచి కందుల క్రయవిక్రయాలు ప్రారంభమయ్యాయి.
ఇప్పటివరకు సుమారు 36 వేల క్వింటాళ్ల కందులను మార్కెట్‌లో వ్యాపారులు కొనుగోలు చేశారు. సీజన్ ప్రారంభంలో గరిష్టంగా రూ. 4,530, కనిష్టంగా రూ.4,200 ధర పలికింది. వ్యాపారులు నామమాత్రంగా గరిష్ట ధరకు కొనుగోలు చేసి, మిగిలిందంతా కనిష్ట ధరకే కొనుగోలు చేసినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తర్వాత మార్కెట్‌కు కందులు వెల్లువెత్తుతుండడంతో వ్యాపారులు సిండికేట్‌గా మారారు. ధరలను తగ్గించివేశారు. ప్రస్తుతం మార్కెట్‌లో గరిష్ట ధర రూ. 4,160 పలుకుతుండగా, కనిష్టంగా రూ.3,800గా ఉంది. సగటు ధర (మోడల్) సీజన్ ఆరంభం నుంచి ఇప్పటివరకు రూ. 4,000 వద్ద స్థిరంగా ఉంది. సగటు ధర ప్రకారం రూ.14.40 కోట్ల విలువ చేసే 36 వేల క్వింటాళ్ల కందులు కొనుగోలు చేశారు. అంటే ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ. 4,300కు రూ.300 తగ్గించి కొనుగోలు చేశారు. ఈ లెక్కన క్వింటాకు రైతులు రూ.300 చొప్పున దాదాపు రూ.1.08 కోట్లు నష్టపోవాల్సి వచ్చింది. అంతేకాకుండా మార్కెట్ కమిటీకి వందకు రూపాయి చొప్పున రూ.1.08 లక్షల సెస్‌కు గండికొట్టారు.
ఆందోళనలు చేసినా...
కందుల కొనుగోళ్ల సీజన్ ఆరంభంలోనే జిల్లాలోని కోడంగల్, కోస్గి, దౌల్తాబాద్ గ్రామాలకు చెందిన రైతులు మార్కెట్ యార్డులో వ్యాపారుల సిండికేట్‌పై ఆందోళలనకు దిగారు. మద్దతు ధర చెల్లించకుండా కందులను కొనుగోలు చేస్తున్నా.. పట్టించుకోవడంలేదని అధికారులతో వాదనకు దిగారు. అయినా యార్డులో రైతులను పట్టించుకునే వారేలేకుండా పోయారు.
తక్కువ ధరకు అమ్మక తప్పడం లేదు
కందులకు ప్రభుత్వ మద్దతు ధర రూ.4,300 రావడం లేదు. నాణ్యతలేదని క్వింటాలుకు రూ.4వేల కన్నా ఎక్కువ ఇవ్వడం లేదు. ధర వచ్చే వరకు ఆగితే కుటుంబ అవసరాలు. సాగు కోసం చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించడం తదితర ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. తప్పనిసరి పరిస్థితుల్లో తక్కువ ధరకు అమ్ముకుంటున్నాం.
- శివరాజ్, రైతు, చింతమణిపట్నం
మా గోడు ఎవరూ పట్టించుకోరు
ధర కోసం రోజుల తరబడి యార్డులో పంటను పెట్టుకోవడం సాధ్యం కావడం లేదు. మద్దతు ధర అడిగితే పంటను ఎవరూ కొనడం లేదు. మా గోడు ఎవరూ పట్టించుకోవడం లేదు. పంటను యార్డులో పెట్టినా ఆశించిన ధర రాలేదు. రూ.3,900 ధరకు రెండు బస్తాల కందులను విక్రయించాను.
- వెంకటయ్య, రైతు, హస్నాబాద్
సిండి‘కేట్ల’ దోపిడీ రూ.1.08 కోట్లు
Published Mon, Jan 6 2014 11:35 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement