ఇన్‌చార్జ్‌లతో డిశ్చార్జ్
సాక్షి, తాండూరు: తాండూరు పురపాలక సంఘంలో పాలన స్తంభించింది. మున్సిపల్ కార్యాలయంలో కీలక పోస్టులన్నీ ఖాళీగా మారాయి. అధికారులు లేకపోవడంతో ఇన్చార్జిల పెత్తనమే కొనసాగుతోంది. దీంతో పౌరసేవలు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాగునీరు, పారిశుధ్యం క్షీణించి జనం రోగాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా సిబ్బంది కొరత మున్సిపాలిటీని వేధిస్తోంది.
తాండూరు మున్సిపల్‌ను ఆదర్శంగా నిలబెడతామని అధికారులు, ప్రజా ప్రతినిధుల అంటున్న మాటలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. మున్సిపల్ కార్యాలయంలో అధికారులు లేకపోవడంతో సిబ్బంది అవినీతికి తెరలేపారు. తాండూరు మున్సిపల్ కార్యాలయ నిర్వహణ పూర్తిగా స్తంభించింది. అందుకు కారణం కార్యాలయంలో కమిషనర్, శానిటరీ ఇన్స్పెక్టర్, మేనేజర్, రెవెన్యూ అ«ధికారుల వంటి కీలక పొస్టులు ఖాళీగా ఉన్నాయి. అంతేకాకుండా మున్సిపల్ కార్యాలయం పరిధిలో 160 మంది సిబ్బంది టౌన్‌ప్లానింగ్, శానిటరీ, రెవెన్యూ, ఇంజినీరింగ్, అడ్మిస్ట్రేషన్ సెక్షన్లతోపాటు పలు విభాగాలలో విధులను నిర్వహించేందుకు సిబ్బంది అవసరం కాగా కేవలం 60 మంది మాత్రమే సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఇంకా 100 మంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో తాండూరు ప్రజలకు మున్సిపల్ సేవలు అందక ఇబ్బందులు పడుతున్నారు.
5 నెలలుగా ఇన్చార్జ్ కమిషనర్ పాలన
మున్సిపల్ కార్యాలయంలో 5 నెలలుగా ఇన్చార్జ్ మున్సిపల్ కమిషనర్లు కొనసాగుతున్నారు. గతంలో పరిగి కమిషనర్ తేజిరెడ్డికి తాండూరు మున్సిపల్ ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. పక్షం రోజుల క్రితం తేజిరెడ్డి స్థానంలో తాండూరు ఆర్డీఓ వేణుమాధవరావుకు మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు అప్పగించారు. వేణుమాధవరావుకు బాధ్యతలు అప్పగించిన నాటి నుంచి కార్యాలయంలో గడిపిన సందర్భాలు కనిపించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
డిప్యూటేషన్‌పై వెళ్లిన పారిశుధ్య అధికారి
తాండూరు మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వహించే శానిటరీ ఇన్స్పెక్టర్ విక్రంసింహారెడ్డి ఏడాదిన్నర క్రితం జహీరాబాద్‌కు డిప్యూటేషన్‌పై వెళ్లారు. తాండూరు మున్సిపల్ పరిధిలోని 36 వార్డులలో నిత్యం పారిశుధ్య పనులను పర్యవేక్షించే శానిటరీ ఇన్స్పెక్టర్ లేక పోవడంతో పారిశుధ్యం అధ్వాన్నంగా మారింది. ఎక్కడపడితే అక్కడ మురుగుమయంగా మారడంతో పాటు తాగునీరు సరిగా సరఫరా కావడం లేదు. మురుగుతో కూడిన కలుషిత నీరు సరఫరా కావడంలో పట్టణ ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. పక్షం రోజులుగా పట్టణంలోని ఆసుపత్రులలో జనాలు బారులు తీరుతున్నారు.
తాండూరు డీఈఈకి 4 మున్సిపాలిటీల బాధ్యతలు
తాండూరు మున్సిపల్ డీఈఈకి మూడు జిల్లాల్లోని నాలుగు మున్సిపాలిటీలకు ఇన్చార్జ్ బా ధ్యతలు అప్పగించారు. నాటి నుంచి తాండూరు మున్సిపల్‌కు ఉన్నతాధికారులు వచ్చిన సమ యంలో తప్ప మిగతా సమయంలో కనిపించిన దాఖలాలు లేవనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.