ఈ గజ దొంగపై 150 కేసులు
తాండూరు(రంగారెడ్డి): కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడిన అంతర్ రాష్ట్ర దొంగను తాండూరు అర్బన్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. రంగారెడ్డి జిల్లా తాండూరు అర్బన్ ఇన్చార్జి సీఐ సైదిరెడ్డితో కలిసి ఏఎస్పీ చందన దీప్తి శుక్రవారం పట్టణ పోలీసుస్టేషన్లో విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం గోవింద్ గ్రామానికి చెందిన షేక్ బోయ సోమశేఖర్ (36) కర్ణాటక రాష్ట్రం బళ్లారి శ్రీరాంపూర్ కాలనీ సమీపంలో గల పాండురంగ గుడి వద్ద నివాసం ఉండేవాడు. కూలి పనులు చేస్తూ భార్యపిల్లలను పోషించుకుంటూ తాగుడుకు బానిసయ్యాడు. ఈ క్రమంలో బళ్లారి, అనంతపురం జిల్లాల్లో పలు చోరీలకు పాల్పడి జై లుకెళ్లివచ్చాడు. అనంతరం భార్యాపిల్లలలో కలిసి ముంబైకి మకాం మార్చాడు.
తాండూరులో చోరీలు..
గత ఏడాది అక్టోబర్ 7న తాండూరు గుమాస్తానగర్లోని మాణిక్యం ఇంటి తాళం పగుల కొట్టి మూడు తులాల బంగారు ఆభరణాలతోపాటు రూ.3,500 నగదు, 8న అదే కాలనీలోని పెయింటర్ రమేష్ ఇంటి తాళం పగుల కొట్టి ఆరు తులాల బంగారు ఆభరణాలు, రూ.25 వేలు, ఈ ఏడాది ఫిబ్రవరిలో గాంధీనగర్లో వడ్ల బ్రహ్మయ్య ఇంట్లోంచి సెల్ఫోన్తోపాటు రూ.3 వేల నగదును అపహరించాడు. చోరీ చేసిన నగలను తాకట్టుపెట్టి డబ్బులతో జల్సా చేశాడు. కొన్ని ఆభరణాలను భార్య వద్ద దాచేవాడు. గత శుక్రవారం మళ్లీ తాండూరుకు వచ్చిన నిందితుడు బస్టాండ్లో అనుమానాస్పదంగా సంచరిస్తుండంతో పోలీసులు అదుపులోకి తీసుకొని ఠాణాకు తరలించారు. విచారణలో చోరీలు చేసినట్టు ఒప్పుకున్నాడు.
ఇదీ నేరచరిత్ర...
మూడు రాష్ట్రాలోని బళ్లారి, అనంతపురం, కడప, కర్నూలు, ప్రకాశంతోపాటు రంగారెడ్డి జిల్లా (తాండూరు)లో ఇతనిపై 150 చోరీ కేసులున్నాయి.. ఇందుకు సంబంధించి ఆయా జిల్లాల్లో సుమారు 16ఏళ్లు జైలు జీవితం గడిపాడు. నిందితుడి నుంచి 4 తులాల బంగారు ఆభరణాలతోపాటు ఒక సెల్ఫోన్, రూ.3 వేల నగదును రికవరీ చేశారు.