నగల దుకాణంలో చోరీ
పైకప్పు తొలగించి 5కిలోల వెండి, 4 తులాల బంగారు ఆభరణాల అపహరణ
తాండూరు: తాండూరు పట్టణంలోని ఓ జువెలర్స్ దుకాణంలో చోరీ జరిగింది. సోమవారం అర్థరాత్రి తరువాత దుండగులు దుకాణంలోకి ప్రవేశించి 5 కిలోల వెండి, 4 తులాల బంగారు ఆభరణాలను అపహరించారు. దుకాణం యజమాని కథనం ప్రకారం.. పట్టణంలోని గాంధీ చౌక్ సమీపంలోని టి.సంజయ్‌కుమార్‌కు చెందిన శ్రీరంజని జువెలర్స్ దుకాణం ఉంది. సోమవారం రాత్రి సుమారు 9గంటల ప్రాంతంలో దుకాణాన్ని మూసి సంజయ్‌కుమార్ ఇంటికి వెళ్లిపోయాడు. మంగళవారం ఉదయం దుకాణం తెరిచి చూడగా చోరీ జరిగినట్టు తెలిసింది.
దుకాణం పైకప్పు బండలను తొలగించి దుండగలు లోపలికి ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు. దుకాణంలోని వస్తువులు చిందరవందరగా పడిఉన్నాయి. దుకాణంలోని 5 కిలోల వెండి ఆభరణాలతోపాటు 4 తులాల బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయని బాధితుడు వివరించాడు. చోరీ సొత్తు విలువ సుమారు రూ.2లక్షలకుపైగా ఉంటుందని వివరించారు. గతంలో కూడా ఒకసారి దుండగలు ఈ దుకాణంలో చోరీకి విఫలయత్నం చేశారన్నారు.
మంగళవారం ఉదయం చోరీ సమాచారం తెలియగానే తాండూరు అర్బన్ సీఐ వెంకట్రామయ్య, ఎస్ఐ నాగార్జునలు సంఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ జరిపారు. క్లూస్ టీం సంఘటనా స్థలానికి వచ్చి ఆధారాలు సేకరించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు. అయితే దీపావళి పండుగకు ముందు ఈ జువెల్లర్స్ దుకాణం పక్కనే ఉన్న దుస్తుల దుకాణంలో కూడా ఇదే మాదిరిగా దుండగలు చోరీకి పాల్పడ్డారు. మరి ఈ రెండు చోరీలు ఒకే ముఠా చేసిందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సమాచారం.