పామాయిల్ ట్యాంకర్ బోల్తా.. జనం జాతర
ముత్తుకూరు: పామాయిల్ ట్యాంకర్ బోల్తా పడి, అందులోని పామాయిల్ అంతా నేలపాలు కావటంతో జనం ఎగబడుతున్నారు. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు సమీపంలోని కృష్ణపట్నం పోర్టు బైపాస్రోడ్డులో శనివారం ఉదయం సమయంలో ట్యాంకర్ బోల్తా పడింది.
దీంతో అందులో ఉన్న పామాయిల్ లీకయి నేలపాలు అవతుండటంతో గమనించిన చుట్టుపక్కల వారు బిందెలు, బకెట్లు, క్యాన్లతో తరలి వచ్చి, పట్టుకుపోతున్నారు. జనం ఉరుకులు పరుగులు పెడుతుండటంతో ఆ ప్రాంతం జాతరను తలపిస్తోంది. ముత్తుకూరులోని జెమిని పామాయిల్ ఫ్యాక్టరీ నుంచి ఆ ట్యాంకర్ 20 టన్నుల పామాయిల్తో కేరళ రాష్ట్రానికి వెళుతోందని సమాచారం. ప్రమాదం నుంచి ట్యాంకర్ లారీ సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు.