బకాయిలు రూ.11 కోట్లు
గత వేసవిలో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా
ట్యాంకర్ల యజమానులకు నేటికీ చెల్లించని డబ్బులు
మెదక్ జోన్ : బిల్లులు రాక ట్యాంకర్ల యజమానులు ఆందోళన చెందుతున్నారు. గత వేసవిలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొనడంతో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేశారు. ఇందుకు జిల్లాలో రూ.11 కోట్లకుపైగా బిల్లులు చెల్లించాల్సి ఉంది. మళ్లీ వేసవి వస్తున్నా.. బకాయిలు రాకపోవడంతో ట్యాంకర్ల యజమానులు ఆందోళన చెందుతున్నారు. అధికారుల మాటలు నమ్మి అప్పుల పాలయ్యామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనటంతో గత వేసవిలో జిల్లాలోని అనేక గ్రామాల్లో ట్యాంకర్ల, బోరుబావులను లీజుకు తీసుకుని ట్యాంకర్ల ద్వారా తాగు నీటిని సరఫరా చేశారు. కాగా ఇందుకు సంబంధించి బోరుబావులు, ట్యాంటర్ల యజమానులకు సుమారు పదకొండున్నర కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉండగా నేటికీ పైసా ఇవ్వలేదు. దీంతో ట్యాంకర్ల యజమానులు, బోర్లను లీజుకు ఇచ్చిన రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కాగా వర్షాకాలం చివరన పుష్కలంగా వర్షాలు కురవడంతో భూగర్భ జలాలు కొద్ది మేర పెరిగాయి.. రైతులు ఖరీఫ్‌సీజన్ కన్నా అధికంగా రబీలో వరిపంటలను సాగు చేశారు. దీంతో సాగునీటి వినియోగం పెరగడం, వేసవిని తలపిస్తున్న ఎండలతో బోరుబావుల్లో నీటి మట్టం తగ్గిపోయాయి. పరిస్థితిని చూస్తుటే ఈ యేడు సైతం ట్యాంకర్ల ద్వారానీటిని సరఫరా చేయాల్సి వస్తుందనే భావన వ్యక్తమవుతోంది.
నేటికీ డబ్బులు ఇవ్వలేదు
పోయిన వేసవిలో మెదక్ మండలం శివ్వాయిపల్లిలో ట్యాంకర్ ద్వారా మార్చి నుంచి సెప్టెంబర్ వరకు మంచి నీటిని సరఫరా చేశాను. రూ.2 లక్షల రూపాయలు రావాలి. అప్పులు చేసి డీజిల్‌ను పోయించాను. ఎప్పుడు అడిగినా ఆఫీసర్లు ఈ రోజు, రేపు అంటున్నారు. అప్పులోళ్లు ఇబ్బందులు పెడుతున్నారు. పైసలిచ్చి ఆదుకోవాలి.
– బాలమొల్ల రాజు శివ్వాయిపల్లి