tapi dharmarao
-
సంపాదకుల సంపాదకుడు.. తాపీ ధర్మారావు
‘‘పత్రికలు వట్టి మాటల పోగులే కాదు, క్రియాకలాపానికి కూడా దారి తీయాలి. సంఘంలో ఒక కొత్త జీవనకళను కలిగించడంలో చేతనైన విధంగా పత్రికాముఖంగా పాటు పడాలి’’ ఇది తాపీ ధర్మారావు సంపాదకుడుగా ‘కాగడా’ వార పత్రికలో సుమారు ఏడు దశాబ్దాల క్రితం రాసిన విషయం! అది ఇప్పటికీ అర్థవంతమైనదే. తాపీ ధర్మారావును కొందరు జనవాణి, సమదర్శిని, కాగడా మొదలైన పత్రికల సంపాదకుడుగా గుర్తుంచుకుంటే–మరికొందరు ఎన్నో విజయవంతమైన తెలుగు చలనచిత్రాల స్క్రీన్ ప్లే, సంభాషణల రచయితగా స్మరించుకుంటారు. కొంతమంది కొత్తపాళీ, దేవాలయాలపై బూతు బొమ్మలెందుకు?, విజయవిలాసానికి హృదయోల్లాస వ్యాఖ్య వంటి విభిన్నమైన రచనల కర్తగా ప్రస్తుతిస్తుండగా – ఇంకొంతమంది రచయితల సంఘాలకు వారు చేసిన సేవలను కొనియాడుతారు. కానీ వారు చేసిన సేవ ప్రధానంగా ఏమిటో విద్వాన్ విశ్వం, ఆరుద్ర వంటివారు చాలా విస్పష్టంగా పేర్కొన్నారు. తెలుగు దినపత్రికల్లో తొలిసారిగా వ్యావహారిక భాషను ప్రవేశపెట్టిన సాహసిగా విద్వాన్ విశ్వం ‘మాణిక్యవీణ’లో ధర్మారావును శ్లాఘించారు. మన తెలుగు సినిమాల్లో వ్యావహారిక భాష ఆయన పెట్టిన భిక్ష అని ఆరుద్ర ‘వనిత’ మాసపత్రికలో తాపీవారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ విశదం చేశారు. 1887 సెప్టెంబరు 19న పుట్టిన తాపీ ధర్మారావు 1973 మే 8న కన్నుమూశారు. గిడుగు రామమూర్తి ఆయనకు పర్లాకిమిడిలో పాఠం చెప్పిన గురువు. ఆయన విజయనగరంలో చదువుకునే కాలంలో గురజాడ అప్పారావు ఉన్నారు. ధర్మారావు ఆసక్తి చూపిన అంశాల జాబితాగానీ, తిరిగిన ఊళ్ళ సంఖ్య గానీ, చేసిన ఉద్యోగాల చిట్టాగానీ పరిశీలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది! శ్రీకాకుళం, విజయనగరం, బరంపురం, పర్లాకిమిడి, చీకటి సంస్థానం, విశాఖపట్నం, మదరాసు, చుండి, ఊర్కాడు, దక్షిణ వల్లూరు, మందసా, చల్లపల్లి, విజ యవాడ – ఇలా చాలా ఊళ్ళలో ఆయన పనిచేశారు. ఉపాధ్యాయుడు, సర్వేయరు, సంరక్షకుడు, అంతరంగిక కార్యదర్శి, మేనేజర్, రిక్రూటింగ్ ఆఫీసర్ – ఇలా ఎన్నో ఉద్యోగాలు చేశారు. ఈ ఉద్యోగాల సమయంలో వేట, గుర్రపుస్వారి, తుపాకి పేల్చడం, ఫొటోగ్రఫీ, టెన్నిస్ వంటివి నేర్చుకున్నారు. కుస్తీలు, నాటకాలు, మ్యూజిక్ గురించి చెప్పనక్కరలేదు. కనుకనే వారికి జీవితమంటే ఏమిటో తెలుసు. జనం భాష ఏమిటో బాగా తెలుసు! గూడవల్లి రామబ్రహ్మంగారి తోడ్పాటుతో దేవాలయాలపై బూతు బొమ్మలెందుకు– అనే శీర్షికతో వ్యాసాలు రాశారు. అంతేకాదు ఆయనతో కలసి ‘మాలపిల్ల’తో చలనచిత్రరంగ ప్రవేశం చేశారు. తెలుగు చలనచిత్రాల తొలిదశలో ప్రవేశించిన ధర్మారావు ఒకవైపు సంభాషణలలో వ్యావహారిక భాషను, మరోవైపు హేతుబద్ధతను రంగరించారు. అప్పట్లో తెలుగు సినిమారంగంలో స్క్రీన్ ప్లే పరంగా ‘తాపీ స్కూలు’ అని ప్రత్యేకంగా పిలిచేవారట. పత్రికలలో అగ్రస్థానంలో ఉంటూనే సినిమాల్లో పనిచేశారు. ఏక కాలంలో మేధావుల, పండితుల వేదిక అయిన పత్రికారంగంలోనూ; పామరుల, సామాన్యుల రంజకమైన సినిమాల్లోనూ రాణించడం చిన్న విషయం కానేకాదు. వారికి ఆ మాధ్యమాల మర్మాలే కాదు, వాటి ప్రభావాలు కూడా బాగా తెలిసి వుండాలి! ధర్మారావు సంభాషణలు రాసిన ప్రతి సినిమా శతదినోత్సవం జరుపుకుంది. వారి దగ్గర ఉపసంపాదకులుగా పనిచేసిన నార్ల వెంకటేశ్వరరావు, పండితారాధ్యుల నాగేశ్వరరావు, పి. శ్రీరాములు మొదలైన వారు తర్వాతి కాలంలో ప్రముఖ సంపాదకులుగా రాణిం చారు. తాపీ ధర్మారావు సంపాదకుల సంపాదకుడు, ఆయనను చూసి నేర్చుకున్నానని నార్ల వెంకటేశ్వరరావు పేర్కొనడం గమనించాలి. తన పత్రికాభాషకు స్ఫూర్తి వేమన అని ప్రకటించిన ప్రజాస్వామిక స్ఫూర్తిమూర్తి తాపీ ధర్మారావు. -డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ వ్యాసకర్త ఆకాశవాణి మాజీ ఉన్నతోద్యోగి మొబైల్ : 94407 32392 (నేడు తాపీ ధర్మారావు వర్ధంతి సందర్భంగా) -
రామప్పలో కచ్చడాల దురాచారం?
సాక్షి ప్రతినిధి, వరంగల్ : సాంఘిక దురాచారాల్లో ఒకటిగా పరిగణించే ఇనుప కచ్చడాల దురాచారం కాకతీయుల కాలంలో అమలులో ఉందా? అంతః పుర కాంతల శీలం కాపాడేందుకు ఈ దుర్మార్గపు సంప్రదాయాన్ని వారేమైనా అమలు చేశారా? లేదా అమానవీయమైన ఈసంస్కృతి కాకతీ యు ల కాలంలోనే అంతరించిపోయిందా ? అంటే.. అవుననే చర్చకు తెరతీస్తున్నాయి జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని గణపేశ్వరాలయంతోపాటు రామప్ప ఆలయంపై ఉన్న స్త్రీల శిల్పాలు. కాకతీయుల కాలంలో నిర్మించిన ఆలయాలు కావడంతో నాటి పరిస్థితికి ఇవి అద్దం పడుతున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాకతీయుల కాలంలో శిల్పకళ ఉన్నత స్థితిలో వర్ధిల్లింది. రామప్ప ఆలయమే ఇందుకు ఉదాహరణ. కాకతీయుల కాలంలో అనేక ఆలయాలను నిర్మించారు. వీటిలో రామ ప్ప, గణపురం కోటగుళ్లు ప్రముఖమైనవి. గణపు రం కోటగుళ్లలోని ప్రధాన ఆలయంలో శివుడు ఆరాధ్య దైవం. ఇక్కడ మొత్తం 22 ఆలయాలు ఉన్నాయి. వీటి చుట్టూ మట్టి కోట నిర్మాణం ఉంది. కాకతీయుల కాలంలో గణపురం కోటగుళ్లు ఉన్న ప్రదేశం గొప్ప సైనిక స్థావరంగా ఉండేది. ప్రస్తుతం ఆ ఆలయం శిథిలావస్థలో ఉన్నప్పటికీ నిత్యం పూజలు జరుగుతున్నాయి. పునరుద్ధరణ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఆలయంలో ప్రధాన ఆలయం ఎడమ వైపు ఉన్న గోడపై వివిధ శిలాకృతులు ఉన్నాయి. ఇందులో రెండు స్త్రీ శిల్పాలు లోహ కచ్చడాలను ధరించినట్లుగా చెక్కారు. అలాగే రామప్ప ఆలయంపైన కూడా ఇలాంటి శిల్పాలే ఉన్నాయి. తేల్చాల్సిన విషయమే.. గణపేశ్వరాలయం ప్రధాన ఆలయం ఎడమవైపు గోడతోపాటు మట్టికోటలోనే హరిత హోటల్ వద్ద భద్రపరచిన శిల్పాల్లో మరొకటి ఇదే తరహాలో ఉంది. ఈ శిల్పం ఉన్న తీరులో ఎలాంటి లైంగిక భంగిమలకు ఆస్కారం లేదు. అంతేగాక శృంగారోద్దీపన లేదు. మిగతా శరీర వస్త్రాలను చూపించడం లేదు. కేవలం అంతవస్త్రంలాంటిది తొలగిస్తున్న మహిళగా ఈ శిల్పం ఉంది. ఈ వస్త్రాన్ని చెక్కిన తీరు అచ్చం ఇనుప కచ్చడాలను పోలి ఉండడంతో సరికొత్త చర్చ మొదలైంది. పూర్వ కాలంలో అంతఃపురం స్త్రీల విషయంలో ఇనుప కచ్చడాలను అమలు చేసే దురాచారం అమలులో ఉండేది. ఆ దిశగా శిల్పాన్ని పరిశీలించగా వివిధ దేశాల్లో, వివిధ కాలాల్లో ఉన్న ఇనుప కచ్చడాలకు ఈ శిల్పానికి సారుప్యతలు ఉన్నా యి. దీంతో ఇది ఇనుప కచ్చడమేనా అనే దిశగా చర్చ మొదలైంది. అయితే కాకతీయుల కాలంలో ఇనుప కచ్చడాల సంస్కృతి అమల్లో ఉన్నట్లుగా నాటి కావ్యాల్లోగానీ మరెక్కడా ఆధారాలు లభించలేదు. ఇప్పటి వరకు లభించిన శాసనాలు, ఆలయాల్లో ఈ తరహా శిల్పాలు లేవు. దీంతో ఈ విషయంపై మరింత పరిశోధన చేయాల్సిన అవసరం ఏర్పడింది. మరోవైపు ఈ శిల్పానికి కాలక్రమంలో మార్పులు చేసినట్లుగా ఎలాంటి ఆనవాళ్లు లభిం చడం లేదు. అందువల్ల గణపురంలో, రామప్ప ఆలయంలో వెలుగు చూసిన స్త్రీ శిల్పాల్లో ధరించింది అంగవస్త్రమా లేక ఇనుప కచ్చడమా తేలాల్సి ఉంది. మరిన్ని ఆధారాలు కావాలి :కట్టా శ్రీనివాస్, చరిత్ర పరిశోధకుడు గణపేశ్వరాలయం నిర్మాణ సమయంలో ఇనుప కచ్చడాల దురాచారం అమలులో ఉందా లేదా అనేది తెలియదు. ఒక వేళ ఉంటే ఆ సమయంలో ఎలాంటి ఉద్యమం నడిచిందో, ఎలాంటి విప్లవా త్మక రాజాజ్ఞ పనిచేసిందో తెలియదు. ఆడామగా సమానమనే కనీస స్పృహ లేకుండా ఆడవాళ్లను కేవలం వస్తువులుగా, పెంపుడు జంతువులుగా లేదా అంతకంటే హీనంగా పరిగణించే ఈ సంస్కృతిని తప్పుబడుతూ వీటిని ఉపయోగించడం నిషిద్ధంలాంటి ఆజ్ఞ వచ్చి ఉంటే ఆ చారి త్రాత్మక పరిణామాన్ని సూచించేందుకు ఈ శిల్పం చెక్కారేమో అని భావించేందుకు ఆస్కారం ఉంది. కాకతీయులకు సంబంధించి మరెక్కడ ఇలాంటి శిల్పాలు లేవు. కాబట్టి ఈ అంశంపై మనకు లభించిన ఆధారాలను క్రమంలో పేర్చుకుంటూ ఇలా అయి ఉండవచ్చు అనేది హైపో థిసీస్ అవుతుంది. ఇది నిజమా లేక అబద్ధమా అని నిర్ధారించేందుకు పటిష్టమైన ఆధారాలు లభించాలి. దురాచారం వచ్చిందిలా .. పూర్వకాలంలో తమ సంపదను దాచుకునే అనేక పద్ధతుల్లోనే అంతఃపుర కాంతల శీలం కాపాడటం లేదా కేవలం తమ అదుపాజ్ఞల్లో ఉంచడం అనే ఆలోచనలతో ఇనుప కచ్చడాలు అనే దురాచారం రాజులు అమలు చేసేవారు. వీటికి సంబంధించి ఓరగచ్చ, కక్షాపటం, కచ్చ, కచ్చ(డ)(ర)ము, కచ్చటిక, కచ్చము, కౌపీనము, ఖండితము, గుహ్యాంబరము, గో(ణ)(ణా)ము, గోవణము, చీరము, తడుపు పుట్టగోచి, పొట్టము, పొటముంజి, బాలో పవీతం, బొట్టము, లంగోటి ఈ పేర్లన్నీ కూడా లోదుస్తులు అనే దానికి పర్యాయపదాలు. లోహలతో తాళం తీసి వేసేందుకు వీలుగా లో దుస్తులను రూపొందించారు. వీటిని ఇనుముతో చేస్తే ఇనుప కచ్చడాలు అని అని లోహంతో అయితే లోహకచ్చడాలు అని అనడం పరిపాటి. ఈ అంశంపై ప్రముఖ రచయిత తాపీ ధర్మారావు ఇనుప కచ్చడాలు పేరుతో పుస్తకం రాశారు. కాలకృత్యాలకు అడ్డురాకుండా ఉంటూ లైంగిక కార్యకలాపం జరపడానికి వీలులేకుండా ఇనుము లేదా లోహంతో తయారు చేసిన కచ్చడాలను స్త్రీలు తమ మొల చుట్టూ ధరించడం ఈ దురాచారంలో భాగం. ఇవి శరీరానికి ఒరుసుకు పోకుండా లోపటి వైపు తోలు గుడ్డ వంటి మెత్తలను ఉంచేవారు. బహుశా కాలక్రమంలో ఈ సంస్కృతే సిగ్గుబిల్ల, మరుగు బిళ్లలుకు దారితీశాయనే వాదనలు ఉన్నాయి. సంస్కృతంలో పిప్పలదనము అని, ఆంగ్లంలో ఫిగ్ లీఫ్‌గా పేర్కొన్నారు. జపాన్‌లోనూ ఇలాంటి సంస్కృతి ఉన్నట్లు ఆధారాలున్నాయి. రావి ఆకు ఆకారంలో ఉండే ఈ కచ్చడాలకు నడుముపై వడ్డాణంతో బంధించేవారు. వీటికి తాళాల ను బిగించేవారు. ఎవరుగాని, ఎలాంటి మారుతాళంతోగాని వీటిని తెరవడానికి వీలులేకుండా ఉండే విధంగా కొత్త తాళాలు తయారుచేసేవారు. కాలక్రమంలో అమానవీయ దురాచారం కనుమరుగైంది. -
నేడు తాపీ ధర్మారావు జయంతి
కేంద్రసాహిత్య అకాడమీ అవార్డును, మరెన్నో సాహిత్య అవార్డులను సంపాందించుకున్న తాపీ ధర్మారావు గారి జయంతి వేడుకలు నేడు. ‘తాతాజీ’గా ముద్దుగా పిలుచుకునే ఈయన అందరికీ సుపరిచితులే. గౌరవ పురస్కాలు : శృంగేరీ పీఠాధిపతులు జగద్గురు చంద్రశేఖర భారతీ శంకరాచార్యుల వారి నుండి 1926లో ‘ఆంధ్రవిశారద’ బిరుదు, చేమకూరి వెంకటకవి రచించిన ‘విజయవిలాసం’ కావ్యానికి చేసిన ‘హృదయోల్లాస వ్యాఖ్య’ కు 1971లో కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు. మరెన్నో సాహిత్య అవార్డులు. ఇతర విషయాలు : ‘తాతాజీ’ గా అందరికీ సుపరిచితులు. ఈయన గిడుగు రామమూర్తి పంతులు గారి శిష్యులు. కొండెగాడు, సమదర్శిని, జనవాణి, కాగడా వంటి పత్రికలలో పనిచేశారు. కళాశాల, సర్వే డిపార్ట్మెంట్లలో పలు ఉద్యోగాలు చేశారు. ఈయన తొలి రచన 1911లో ‘ఆంధ్రులకొక మనవి’ అనే పేరుతో వెలువడింది. తరువాత అనేక రచనలు చేశారు. మాలపిల్ల (1938) సినిమా రచనతో సినీరంగ ప్రవేశం జరిగింది. 1943లో జరిగిన మొదటి అభ్యుదయ రచయితల సమావేశానికి అధ్యక్షత వహించారు. రచయితగా, భాషాపండితుడిగా, హేతువాదిగా, సంఘసంస్కర్తగా ప్రసిద్ధులు. ‘పాతపాళీ’, ‘కొత్తపాళీ’, ‘దేవాలయంపై బూతుబొమ్మలెందుకు?’ మొదలైన గ్రంథాలను రచించిన హేతువాది. చేమకూర వెంకటకవి ‘విజయ విలాసాని’కి హృదయోల్లాస వ్యాఖ్యను రచించారు మరణం : 08-05-1973 పూర్తిపేరు : తాపీ ధర్మారావు నాయుడు జననం : 19-09-1887 జన్మస్థలం : ఒరిస్సాలోని బరంపురం తల్లిదండ్రులు : నరసమ్మ, డాక్టర్ అప్పన్న చదువు : బి.ఏ. (పచ్చయ్యప్ప కాలే జ్ , చెన్నై) తోబుట్టువులు : అన్నయ్య (నరసింగరావు), తమ్ముడు (తులసీరావు), చెల్లెళ్లు (వెంకటనరసమ్మ, తిరుపతమ్మ) వివాహం : 1902 భార్య : అన్నపూర్ణమ్మ పిల్లలు : కుమార్తెలు (లక్షుమమ్మ, బంగారమ్మ), తర్వాత కవలలు పుట్టి చనిపోయారు. కుమారులు (మోహనరావు, కీ॥అహోబలరావు, చాణక్య) పాటలు రాసిన తొలిచిత్రం : రైతుబిడ్డ (1939) ఆఖరిచిత్రం : భీష్మ (1962) పాటలు : సుమారు 250