Tapir Gao
-
కుక్కను నరికి.. బీజేపీ అధ్యక్షుడికి డెత్ వార్నింగ్
ఇటానగర్ : అరుణాచల్ ప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ తాపిర్ గావ్‌కు దుండగులు డెత్ వార్నింగ్ ఇచ్చారు. తాపిర్ గావ్ ఇంటి ఎదుట తమవెంట తీసుకొచ్చిన ఓ కారుకు నిప్పంటించి, అనంతరం శునకాన్ని అతికిరాతకంగా కత్తితో నరికి చంపారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని గిరిజన తెగల సంప్రదాయాల ప్రకారం శత్రువును చంపేస్తామని బెదిరించడానికి, శునకాన్ని బలి ఇవ్వడం వారి ఆచారం. ప్రస్తుతం తాపిర్ గావ్ ఢిల్లీలో ఉన్నారు. ఈ ఘటనపై తాపిర్ గావ్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 'ఓ దుండగుడు కారును మా ఇంటి ముందుకు తీసుకొచ్చి తగలబెట్టాడు. అనంతరం ఓ కుక్కను చంపాడు. నన్ను, నా కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేయడానికి ఇలా చేసుంటారు' అని తాపిర్ పేర్కొన్నారు. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితున్ని గుర్తించామని, అతన్ని అరెస్ట్ చేయడానికి ప్రత్యేక బృందాలను పంపామని అరుణాచల్ ప్రదేశ్ డీజీపీ ఎస్బీకే సింగ్ తెలిపారు. తాపిర్ ఇంటి వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశామని చెప్పారు. లోక్ సభ ఎన్నికల్లో అరుణాచల్ ప్రదేశ్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి తాపిర్ గెలుపొందారు. రాజకీయ ప్రత్యర్థులే ఈ దుశ్చర్యలకు పాల్పడి ఉంటారని తాపీర్ అనుమానం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 60 మంది సభ్యులున్న అరుణాచల్‌ప్రదేశ్ అసెంబ్లీలో బీజేపీ 41 స్థానాలు గెలుపొంది అధికారాన్ని చేపట్టింది. అరుణాచల్‌ప్రదేశ్ పదో ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత పెమాఖండూ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. -
కుక్కను చంపి.. కారును తగలబెట్టి
ఇటా నగర్ : ఓ బీజేపీ నాయకుడి ఇంటి ఎదురుగా కుక్కను చంపడమే కాక ఓ కారును తగులబెట్టి భయభ్రాంతులకు గురి చేసిన సంఘటన శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. అరుణాచల్ ప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తపిర్ గావో ఇంటి ఎదుట ఈ సంఘటన జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘ఈ రోజు ఉదయం కొందరు ఆగంతకులు ఓ మారుతి కారులో మా ఇంటి వద్దకు వచ్చారు. అనంతరం తాము వచ్చిన కారుకు స్వయంగా వారే నిప్పు పెట్టారు. అంతేకాక ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ కుక్కను కత్తితో పొడిచి చంపేశారు. మా ఆచారం ప్రకారం ఎవరి ఇంటి ముందైనా కుక్కను చంపితే.. త్వరలోనే ఆ ఇంట్లో వ్యక్తుల్లో ఎవరో ఒకర్ని చంపుతామనడానికి సూచన. అంటే వారు మా కుటుంబంలో ఎవరినో చంపుతామని ఇండైరెక్ట్‌గా మమ్మల్ని బెదిరించారు’ అని తెలిపారు. ఈ విషయం గురించి తపిర్ మాట్లాడుతూ.. ‘ఈ సంఘటన జరిగినప్పుడు నేను ఇంటి వద్ద లేను. నిన్న ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఉండటంతో ఢిల్లీ వెళ్లాను. ఇంటికి వచ్చాక జరిగిన దారుణం గురించి తెలిసింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాను. ప్రస్తుతం వాళ్లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నార’ని తెలిపారు. ప్రతిపక్షానికి చెందిన వారే ఈ పని చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెలపడమే కాక.. తపిర్ కుటుంబానికి పూర్తి రక్షణ కల్పిస్తామని పోలీసులు పేర్కొన్నారు. -
అరుణాచల్ సంక్షోభంలో కొత్త ట్విస్ట్
ఈటానగర్: అరుణాచల్‌ప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం కొత్త మలుపు తిరిగింది. పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్(పీపీఏ) నుంచి సస్పెన్షన్ కు గురైన సీఎం పెమా ఖండూకు బీజేపీ బాసటగా నిలిచింది. పెమా ఖండూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని, ఇప్పటికీ ఆయననే ముఖ్యమంత్రిగా భావిస్తున్నామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు తాపిర్ గయో పేర్కొన్నారు. తమ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు ఖండూ నాయకత్వాన్నే కోరుకుంటున్నారని జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ స్పష్టం చేశారు. ఖండూ నాయకత్వంపై తాము అసంతృప్తిగా ఉన్నామని, ఆయన ఒంటెత్తు పోకడలు అవలంభిస్తున్నారని పీపీఏ అధ్యక్షుడు ఖాఫా బెంజియా తెలిపారు. ప్రభుత్వానికి, పార్టీకి మధ్య సమన్వయం సాధించడంతో ఆయన విఫలమయ్యారని మండిపడ్డారు. మరోవైపు ఖండూ స్థానంలో సీఎం పదవికి ముగ్గురు పీపీఏ నేతలు పోటీలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి. పీపీఏ నుంచి సస్పెన్షన్ కు గురైన ఖండూ సీఎం పదవికి రాజీనామా చేస్తారా, లేదా ఆసక్తికరంగా మారింది. ఆయనతో క్రమశిక్షణ చర్య ఎదుర్కొన్న డిప్యూటీ సీఎం చౌనా మీన్ తో పాటు మరో ఐదుగురు ఎమ్మెల్యేల భవిష్యత్ కార్యాచరణతో అరుణాచల్ రాజకీయాలు ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో చూడాలి. -
మణిపూర్ సీఎం వెంటనే రాజీనామా చేయాలి:బీజేపీ
మణిపూర్ ముఖ్యమంత్రి ఓక్రమ్ ఇబోబి సింగ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి తపిర్ గేవ్ డిమాండ్ చేశారు. ఓక్రమ్ పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు అడుగంటాయని ఆరోపించారు. రాష్ట్రంలో వారం రోజుల కాలవ్యవధిలో వరుస బాంబు పేలుళ్లే చోటు చేసుకోవడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మణిపూర్‌లో శాంతి భద్రతలు శూన్యం అనడానికి ఆ పేలుళ్లే ఉదాహరణ అని అన్నారు. ఆ బాంబు పేలుళ్లకు సీఎం నైతిక బాధ్యత వహించాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో చోటు చేసుకున్న బాంబు పేలుళ్లలో అమాయకులు మరణించడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మణిపూర్ సీఎం నివాసానికి కూతవేటు దూరంలో మంగ, బుధవారాల్లో బాంబు పేలుళ్లు సంభవించాయి. శనివారం మరో బాంబు పేలుడు చోటు చేసుకుంది. ఆ ఘటనల్లో ముగ్గురు మరణించారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు ఇంఫాల్ లోని పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.