ఇటా నగర్ : ఓ బీజేపీ నాయకుడి ఇంటి ఎదురుగా కుక్కను చంపడమే కాక ఓ కారును తగులబెట్టి భయభ్రాంతులకు గురి చేసిన సంఘటన శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. అరుణాచల్ ప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తపిర్ గావో ఇంటి ఎదుట ఈ సంఘటన జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘ఈ రోజు ఉదయం కొందరు ఆగంతకులు ఓ మారుతి కారులో మా ఇంటి వద్దకు వచ్చారు. అనంతరం తాము వచ్చిన కారుకు స్వయంగా వారే నిప్పు పెట్టారు. అంతేకాక ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ కుక్కను కత్తితో పొడిచి చంపేశారు. మా ఆచారం ప్రకారం ఎవరి ఇంటి ముందైనా కుక్కను చంపితే.. త్వరలోనే ఆ ఇంట్లో వ్యక్తుల్లో ఎవరో ఒకర్ని చంపుతామనడానికి సూచన. అంటే వారు మా కుటుంబంలో ఎవరినో చంపుతామని ఇండైరెక్ట్‌గా మమ్మల్ని బెదిరించారు’ అని తెలిపారు.
ఈ విషయం గురించి తపిర్ మాట్లాడుతూ.. ‘ఈ సంఘటన జరిగినప్పుడు నేను ఇంటి వద్ద లేను. నిన్న ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఉండటంతో ఢిల్లీ వెళ్లాను. ఇంటికి వచ్చాక జరిగిన దారుణం గురించి తెలిసింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాను. ప్రస్తుతం వాళ్లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నార’ని తెలిపారు. ప్రతిపక్షానికి చెందిన వారే ఈ పని చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెలపడమే కాక.. తపిర్ కుటుంబానికి పూర్తి రక్షణ కల్పిస్తామని పోలీసులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment