అరుణాచల్ సంక్షోభంలో కొత్త ట్విస్ట్
ఈటానగర్: అరుణాచల్‌ప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం కొత్త మలుపు తిరిగింది. పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్(పీపీఏ) నుంచి సస్పెన్షన్ కు గురైన సీఎం పెమా ఖండూకు బీజేపీ బాసటగా నిలిచింది. పెమా ఖండూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని, ఇప్పటికీ ఆయననే ముఖ్యమంత్రిగా భావిస్తున్నామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు తాపిర్ గయో పేర్కొన్నారు. తమ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు ఖండూ నాయకత్వాన్నే కోరుకుంటున్నారని జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ స్పష్టం చేశారు.
ఖండూ నాయకత్వంపై తాము అసంతృప్తిగా ఉన్నామని, ఆయన ఒంటెత్తు పోకడలు అవలంభిస్తున్నారని పీపీఏ అధ్యక్షుడు ఖాఫా బెంజియా తెలిపారు. ప్రభుత్వానికి, పార్టీకి మధ్య సమన్వయం సాధించడంతో ఆయన విఫలమయ్యారని మండిపడ్డారు. మరోవైపు ఖండూ స్థానంలో సీఎం పదవికి ముగ్గురు పీపీఏ నేతలు పోటీలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి. పీపీఏ నుంచి సస్పెన్షన్ కు గురైన ఖండూ సీఎం పదవికి రాజీనామా చేస్తారా, లేదా ఆసక్తికరంగా మారింది. ఆయనతో క్రమశిక్షణ చర్య ఎదుర్కొన్న డిప్యూటీ సీఎం చౌనా మీన్ తో పాటు మరో ఐదుగురు ఎమ్మెల్యేల భవిష్యత్ కార్యాచరణతో అరుణాచల్ రాజకీయాలు ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో చూడాలి.