మణిపూర్ ముఖ్యమంత్రి ఓక్రమ్ ఇబోబి సింగ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి తపిర్ గేవ్ డిమాండ్ చేశారు. ఓక్రమ్ పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు అడుగంటాయని ఆరోపించారు. రాష్ట్రంలో వారం రోజుల కాలవ్యవధిలో వరుస బాంబు పేలుళ్లే చోటు చేసుకోవడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
మణిపూర్లో శాంతి భద్రతలు శూన్యం అనడానికి ఆ పేలుళ్లే ఉదాహరణ అని అన్నారు. ఆ బాంబు పేలుళ్లకు సీఎం నైతిక బాధ్యత వహించాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో చోటు చేసుకున్న బాంబు పేలుళ్లలో అమాయకులు మరణించడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మణిపూర్ సీఎం నివాసానికి కూతవేటు దూరంలో మంగ, బుధవారాల్లో బాంబు పేలుళ్లు సంభవించాయి. శనివారం మరో బాంబు పేలుడు చోటు చేసుకుంది. ఆ ఘటనల్లో ముగ్గురు మరణించారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు ఇంఫాల్ లోని పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.