Okram Ibobi Singh
-
ఈశాన్యంలో పెద్దన్న.. ఆ పార్టీకి బలమూ ఆయనే.. బలహీనత ఆయనే
దేశంలోని అతి కొద్దిమంది హ్యాట్రిక్ ముఖ్యమంత్రుల్లో ఒకరు.. మణిపూర్‌లో 30 మిలిటెంట్ గ్రూపులు చురుగ్గా ఉన్నప్పుడు సీఎం పీఠాన్ని ఎక్కి తీవ్రవాదాన్ని ఎదిరించి పోరాడిన శక్తిమంతుడు! సంకీర్ణ సర్కార్‌ని నడిపించడంలోనూ, అధికార వ్యతిరేకతను ఎదుర్కోవడంలోనూ.. తనకు సాటిపోటీ లేరని నిరూపించుకున్నారు. విజయాలు వస్తే పొంగిపోలేదు. పరాజయాలకు కుంగిపోలేదు. ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీలో బలమైన నాయకుడిగా ఎదిగారు. తొమ్మిది మంది అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లున్న కుటుంబంలో పెద్దన్నగా తన బాధ్యతల్ని సమర్థవంతంగా పోషించిన ఇబోబి అదే విధంగా ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పెద్దన్నగా అందరినీ కలుపుకొని వెళ్లడానికే తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి బలమూ ఆయనే.. బలహీనత కూడా ఆయనే. మణిపూర్‌లో ప్రస్తుతప్రతిపక్ష నాయకుడు ఒక్రామ్ ఇబోబి సింగ్ మీద నమ్మకంతోనే మరోసారి కాంగ్రెస్ పార్టీ బీజేపీపై ఆయన నేతృత్వంలోనే సమరభేరి మోగించింది. ►ఒక్రామ్ ఇబోబి సింగ్ 1948 సంవత్సరం జూన్ 19న మణిపూర్‌లోని ఒక నిరుపేద రైతు కుటుంబంలో జన్మించారు ►ఇంఫాల్‌లోని డీఎం కాలేజీ నుంచి డిగ్రీ పట్టా తీసుకున్నారు ►ఇబోబి సింగ్ భార్య లంధోని దేవి కూడా ఎమ్మెల్యే. వారికి ఒక కుమారుడు , ఒక కుమార్తె ఉన్నారు ►1981లో కోఆపరేటివ్ సొసైటీకి కార్యదర్శిగా ఇబోబి సింగ్ రాజకీయ జీవితం ప్రారంభమైంది. ►1984లో తొలిసారిగా మణిపూర్ అసెంబ్లీకి స్వతంత్ర అభ్యర్థిగా ఖంగాబాక్ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఏడాదికి కాంగ్రెస్‌లో చేరారు. ►1990లో జరిగిన ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించి గృహనిర్మాణం, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పదవి చేపట్టారు. ►రాజకీయాల్లో ఎన్నో విజయాలు సాధించారు. మరెన్నో ఓటములు చవిచూశారు. వరసగా 1995, 2000 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. ►ఓటమి ఎదురైనా కుంగిపోలేదు. మణిపూర్ కాంగ్రెస్‌లో ఎదిగారు. 1999లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు. ►2002లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కేవలం 20 స్థానాలు వచ్చినప్పటికీ తొలిసారి ముఖ్యమంత్రి పీఠమెక్కారు. సీపీఐతో కలిసి సంకీర్ణ సర్కార్‌ని విజయవంతంగా నడిపించారు. ►అప్పట్నుంచి వరసగా మూడుసార్లు రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని చేపట్టి హ్యాట్రిక్ సీఎంగా రికార్డులకెక్కారు. 2002–2017 మధ్య కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. ►తీవ్రవాదంతో అతలాకుతలమయ్యే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించడంలో ఇబోబి సింగ్ కీలకపాత్ర పోషించారు. 2012లో అధికార వ్యతిరేకత ఎక్కువగా ఉన్నప్పటికీ మొత్తం 60 స్థానాల్లో ఏకంగా 42 స్థానాల్లో కాంగ్రెస్‌ని గెలిపించి తన సత్తాచాటారు. ►2017 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 28 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటులో ఇబోబి సింగ్ విఫలమై ప్రతిపక్ష నాయకుడిగా పరిమితమయ్యారు. ►విపక్ష నాయకుడిగా ఆయన ట్రాక్ రికార్డు గాడి తప్పింది. ఈ అయిదేళ్లలో అసెంబ్లీలో బలం 28 నుంచి 15కి పడిపోయింది. వలసల్ని నివారించడంలోనూ, బీజేపీకి ఎదురొడ్డి నిలవడంలోనూ ఆయన విఫలమయ్యారు. ►ఇబోబి సీఎంగా ఉన్న 15 ఏళ్ల కాలంలో పదేళ్లు అధికారాన్ని కాపాడుకోవడానికి, మిలిటెంట్లకు ఎదురొడ్డి నిలబడడానికే సరిపోయింది. ►ఇబోబిపై పలుమార్లు హత్యాయత్నాలు జరిగాయి. వాటి నుంచి కూడా బయటపడ్డారు. 2006, 2008లో మిలిటెంట్ గ్రూపులు ఆయన నివాసంపైనే దాడులు చేసినప్పటికీ ప్రాణాలతో బయటపడ్డారు. ►ప్రభుత్వ ప్రాజెక్టులు, కాంట్రాక్టుల్లో 10శాతం వాటా తీసుకుంటారని వికీలీక్స్ ఆరోపణల్లో వెలుగులోకి వచ్చింది. 2006 సెప్టెంబర్‌లో వికీలీక్స్‌లో మిస్టర్ 10% అని ఇబోబిని సంబోధించినట్టు తెలుస్తోంది. ►మనీల్యాండరింగ్‌కు సంబంధించి 2020లో ఈడీ ఆయనపైనా, కుటుంబ సభ్యులపైనా కేసు నమోదు చేసింది. రూ.332 కోట్ల డెవలప్మెంట్ సొసైటీ కుంభకోణాన్ని సీబీఐ విచారిస్తోంది. ►అనారోగ్య సమస్యలు, ఈడీ కేసులు, అవినీతి ఆరోపణలు చుట్టుముట్టడంతో ఇబోబి సింగ్ గతంలో మాదిరిగా ఉత్సాహంగా లేరు. బీజేపీలోని అంతర్గత పోరే తమ పార్టీని గట్టెక్కిస్తుందని ఆయన ఆశిస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానం కూడా ఇబోబికి మించిన నాయకుడెవరూ పార్టీలో దొరకక ఆయన సామర్థ్యం మీదే ఆశలు పెట్టుకుంది. -నేషనల్ డెస్క్,సాక్షి -
పతనం అంచున బీజేపీ సర్కార్
ఇంపాల్ : ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వాలను విచ్చిన్నం చేస్తున్న భారతీయ జనతా పార్టీకి ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) ఊహించని షాక్ ఇచ్చింది. ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నామని ప్రకటించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలో తమ పార్టీకి చెందిన నలుగురు మంత్రుల చేత గురువారం రాజీనామా చేయించింది. వీరిలో డిప్యూటీ సీఎం జోయ్ కుమార్ సింగ్ కూడా ఉన్నారు. మరోవైపు బీజేపీ సర్కార్‌కు మద్దతు ఇస్తున్న మరో నలుగురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు కూడా దోస్తీకి గుడ్‌బై చెప్పారు. అంతేకాకుండా అధికార పార్టీకి చెందిన ముగ్గురు సభ్యులు సైతం తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి ప్రభుత్వానికి గట్టి షాక్ ఇచ్చారు. (విభేదాలు వీడి కలిసి పనిచేద్దాం) దీంతో బీరేన్ ప్రభుత్వం శాసనసభలో మైనార్టీలో పడింది. ఇక ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేంతా ప్రతిపక్ష కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించడం ఊహించని పరిణామం. ఈ క్రమంలోనే అసెంబ్లీలో బలనిరూపణ చేపట్టాలని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పక్షనేత ఇబోబీ సింగ్ గవర్నర్‌తో భేటీ కానున్నారు. బీజేపీ ప్రభుత్వం సభలో విశ్వాసాన్ని కోల్పోయిందని, వెంటనే బర్తరఫ్ చేయాలని కోరనున్నారు. అలాగే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తమకు అవకాశం కల్పించాలని గవర్నర్‌ను కోరే అవకాశం ఉంది. రాజ్యసభ ఎన్నికల ముందు బీజేపీకి ఈ పరిణామం ఊహించనింది. కాగా 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 60 స్థానాలకు కాగా 28 సీట్లలో కాంగ్రెస్ విజయం సాధించి.. సభలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయతే కేవలం 21 స్థానాలు గెలిచిన బీజేపీ ఇతరులను తమవైపుకు తిప్పుకుని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తాజా రాజీనామాలతో బీజేపీ సభ్యుల సంఖ్య 19కి పడిపోయింది. ఇతరుల మద్దతు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామలపై బీజేపీ అధిష్టానం ఆరా తీస్తోంది. (మళ్లీ తెర ముందుకు అమిత్ షా!) -
‘సీఎం పదవికి ముందు రాజీనామా చేయండి’
ఇంపాల్: మణిపూర్ ముఖ్యమంత్రి ఓక్రామ్ ఇబోబీ సింగ్‌ను రాజీనామా చేయాల్సింది ఆ రాష్ట్ర గవర్నర్ నజ్మాహెప్తుల్లా కోరారు. రాజీనామా చేస్తే తదుపరి ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేసేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలన్న ఆయన డిమాండ్‌ను గవర్నర్ తోసిపుచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల మొత్తం 60 స్థానాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం కాంగ్రెస్‌కు 28, బీజేపీకి 21 స్థానాలు, మిగితా సీట్లు ఇతర పార్టీలు, స్వతంత్ర్య అభ్యర్థులు గెలుచుకున్నారు. ప్రభుత్వం ఏర్పాటుచేయాలంటే 31 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. ఈ ప్రకారం కాంగ్రెస్ పెద్ద పార్టీగా అవతరించినా మేజిక్ ఫిగర్ మాత్రం అందుకోలేకపోయింది. ఇతర పార్టీలవారు బీజేపీకి మద్దతిస్తామని చెబుతున్నారు. అయితే, గత రాత్రి ఇబోబీతోపాటు డిప్యూటీ సీఎం గైఖాంగమ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు టీఎన్ హావోకిప్ గవర్నర్‌ను కలిశారు. ఈ నేపథ్యంలో వెంటనే రాజీనామా చేయాలని ఇబోబీకి గవర్నర్ హెజ్మా సూచించారు. అయితే, తమ పార్టీకే ఎక్కువ స్థానాలు వచ్చాయని, 28 సీట్లు గెలుచుకున్న తమకే ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని ఇబోబీ కోరారు. దాంతోపాటు నేషనల్ పీపుల్స్ పార్టీ ఎమ్మెల్యేల మద్దతు తమకే ఉందని ఖాళీ పేపర్లో రాసుకొని వచ్చి చూపించారు. అయితే, కాగితంపై రాసివ్వడం కాకుండా ఆ పార్టీ అధ్యక్షుడిని, గెలిచిన ఎమ్మెల్యేలను తీసుకొచ్చి చూపించాలని కోరారు. బీజేపీ 21మంది గెలిచిన అభ్యర్థులతోపాటు ఎన్పీపీ అధ్యక్షుడిని కాంగ్రెస్ ఎమ్మెల్యేలనుచ ఎల్జేపీ, టీఎంసీ ఎమ్మెల్యేను తీసుకొచ్చి తమకే అవకాశం ఇవ్వాలని కోరినట్లు ఆమె గుర్తు చేశారు. ఈ నేపథ్యంలోనే ఇబోబిని రాజీనామా చేయాలని కోరినట్లు తెలుస్తోంది. -
గవర్నర్‌ను కలిసిన సీఎల్పీ నేత ఇబోబి సింగ్
మణిపుర్ : మణిపూర్ గవర్నర్ నజ్మా హెప్తుల్లాను సీఎల్పీ నేత ఓక్రమ్ ఇబోబి సింగ్ సోమవారం ఉదయం కలిశారు. తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ఆయన ఈ సందర్భంగా గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. కాగా ఇప్పటికే బీజేపీకి మద్దతుగా నిలుస్తున్న ఎమ్మెల్యేలంతా ఆదివారం రాత్రే గవర్నర్‌ను కలిశారు. రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ అవతరించినా.. తమకే ఎమ్మెల్యేల మద్ధతు ఉందని ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని గవర్నర్‌ను బీజేపీ నేతలు కోరారు. అయితే మొత్తం అరవై నియోజవర్గాలకుగానూ కాంగ్రెస్ పార్టీ 28 కైవసం చేసుకోగా, బీజేపీ 21 స్థానాలతో రెండో స్థానంలో నిలిచింది. ఇక నాగా పీపుల్స్ ఫ్రంట్ 4, నేషనల్ పీపుల్స్ పార్టీ 4, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్, లోక్ జనశక్తి పార్టీ, స్వతంత్ర అభ్యర్థి ఒక్కో స్థానంలో నెగ్గారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 31 మంది సీట్లు కావాలి. అయితే బీజేపీ మాత్రం వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. '60 సీట్లున్న మణిపూర్ అసెంబ్లీలో బీజేపీ బలం 32కు చేరింది. 11 మంది స్వతంత్ర సభ్యులు బీజేపీకి మద్దతు పలికారు' అంటూ గవర్నర్‌ను కలిసిన తర్వాత బీజేపీ నేత, అస్సాం మంత్రి హిమంత బిస్వా శర్మ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కన్నా బీజేపీకి 7 సీట్లు తక్కువ అయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన 31 సీట్ల కన్నా 10 సీట్ల వెనుకబాటు అయితేనేం మణిపూర్ గద్దెపై కాషాయ జెండా రెపరెపలాడబోతోంది. -
రాహుల్ గాంధీకి మోదీ విషెస్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ 46వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయనకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో ఎల్లకాలం ఉండాలని మోదీ ఆకాంక్షించారు. ఈ మేరకు ఆదివారం తన ట్విటర్ పేజీలో సందేశం పోస్ట్ చేశారు. తనకు జన్మదిన శుభాంక్షాలు తెలిపిన ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ ధన్యవాదాలు తెలిపారు. 68వ పుట్టినరోజు జరుపుకుంటున్న మణిపూర్ ముఖ్యమంత్రి ఓక్రమ్ ఇబోబీ సింగ్ కూడా ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఇబోబీ సింగ్ మంచి ఆరోగ్యంతో జీవించాలని ప్రార్థించినట్టు మోదీ తెలిపారు. Birthday wishes to the Congress VP, Shri Rahul Gandhi. May he be blessed with a long and healthy life. @OfficeOfRG — Narendra Modi (@narendramodi) 19 June 2016 Greetings to the CM of Manipur, Shri Okram Ibobi Singh on his birthday. I pray for his good health and long life. — Narendra Modi (@narendramodi) 19 June 2016 -
మిమ్మల్ని సంప్రదించాకే తుది ఒప్పందం
మణిపూర్, నాగా సీఎంలకు ప్రధాని హామీ న్యూఢిల్లీ: నాగా గ్రూపులతో కేంద్రం తుది ఒప్పందం చేసుకునే ముందు ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులను తప్పకుండా సంప్రదిస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ హామీ ఇచ్చారు. గత వారం ఎన్ఎస్సీఎన్(ఐఎం)తో కేంద్రం చేసుకున్న శాంతి ఒప్పందం వివాదాస్పదం అయిన నేపథ్యంలో మణిపూర్ ముఖ్యమంత్రి ఓక్రమ్ ఇబోబీ సింగ్, నాగాలాండ్ ముఖ్యమంత్రి టీఆర్ జీలియాంగ్ ప్రధాని మోదీని విడివిడిగా కలసి ఒప్పందం గురించి చర్చించారు. తుది ఒప్పందం చేసుకునే ముందు ఏడు ఈశాన్యరాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించిన తరువాతే నిర్ణయం తీసుకుంటామని ప్రధాని హామీ ఇచ్చినట్లు మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. నాగా ఒప్పందం చేసుకునే ముందు ఈశాన్యరాష్ట్రాల ముఖ్యమంత్రులను కేంద్రం సంప్రదించకపోవటం దారుణమంటూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ విమర్శలు చేసిన నేపథ్యంలో ప్రధాని ఈ హామీ ఇచ్చారు. నాగాలాండ్ ముఖ్యమంత్రి ఎన్డీఏ మిత్రపక్షమైన నాగాలాండ్ పీపుల్స్ఫ్రంట్ నేత కాగా, మణిపూర్‌లో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. మణిపూర్ ముఖ్యమంత్రి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ను కూడా కలసి ఒప్పందం కాపీ కావాలంటూ విజ్ఞప్తి చేశారు. అయితే అది తుది ఒప్పందం కాదని.. అందుకు సంబంధించిన ప్రాథమిక మార్గదర్శకాలు మాత్రమేనని రాజ్‌నాథ్ చెప్పారు. కాగా, నాగాతో శాంతి ఒప్పందం చేసుకోవటం ఇతర ఈశాన్యరాష్ట్రాలను నిర్లక్ష్యం చేసినట్లు కాదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరణ్ రిజిజు గువాహటిలో స్పష్టంచేశారు. అటు బీజేపీ కూడా ఈ ఒప్పందాన్ని కాంగ్రెస్ వివాదం చేయటంపై మండిపడింది. -
రాహుల్ గాంధీకి మోదీ విషెస్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాహుల్ గాంధీ నేడు 45వ పడిలోకి అడుగుపెట్టారు.ఈ సందర్భంగా రాహుల్ కు ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. రాహుల్ గాంధీ ఆయురారోగ్యాలతో కలకాలం వర్ధిల్లాలని మోదీ ఆకాంక్షించారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మణిపూర్ ముఖ్యమంత్రి ఒక్రమ్ ఇబోబి సింగ్ కూ ట్విటర్ లో మోదీ శుభాకాంక్షలు తెలిపారు. కాగా, చాలా ఏళ్ల తర్వాత తన పుట్టినరోజు నాడు రాహుల్ గాంధీ ఢిల్లీలో ఉండడంతో వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధమవుతున్నారు. Wishing the Congress Vice President, Shri Rahul Gandhi a Happy Birthday. I pray for his good health & long life. @OfficeOfRG — Narendra Modi (@narendramodi) June 19, 2015 -
ముఖ్యమంత్రి ఇంటికి కన్నం
ఇంపాల్: దొంగలు ఏకంగా ముఖ్యమంత్రి నివాసానికే కన్నం వేశారు. మణిపూర్ ముఖ్యమంత్రి ఒక్రాం ఇబోబి సింగ్ ప్రైవేట్ ఇంట్లోకి వెల్లి గృహోపకరణ వస్తువులను దోచుకెళ్లారు. తౌబల్ జిల్లాలో ఉన్న సీఎం ఇంటికి ఆయన భార్య, కాంగ్రెస్ ఎమ్మెల్యే లంధోనీ దేవి ఆదివారం వెళ్లినపుడు ఈ సంఘటన వెలుగు చూసింది. తాళం వేసిన ఈ ఇంట్లో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు ఎవరూ నివసించడం లేదు. అయినా 30 మంది రిజర్వ్ బెటాలియన్ సిబ్బందిని ఇంటికి రక్షణగా నియమించారు. అయితే భద్రత సిబ్బంది ముఖ్యమంత్రి నివాసానికి పక్కనే ఉన్న ఆయన సోదరుడు ఒక్రాం ఇబోటొంబా ఇంటి వద్ద కాపలాగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. భద్రత సిబ్బంది అందరినీ మార్చినట్టు చెప్పారు. దొంగతనం జరిగిన సమయం, దోపిడీకి గురైన వస్తువల విలువ కచ్చితంగా తెలియదని తెలిపారు. దొంగతన విషయం వెలుగుచూసిన వెంటనే డీజీపీ సహా సీనియర్ పోలీసు అధికారులు, ఫోరెన్సిక్, బాంబు నిర్వీర్య సిబ్బంది సంఘటనా స్థలానికి వెళ్లి విచారించారు. -
మణిపూర్‌లో బాంబు పేలుడు
మణిపూర్ రాజధాని ఇంఫాల్ నగరంలోని కంగ్లాలో జరుగుతున్న గణతంత్ర వేడుకలకు కూతవేటు దూరంలో బాంబు పేలుడు సంభవించింది. దాంతో అప్రమత్తమైన పోలీసు ఉన్నతాధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆ పేలుడులో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. గణతంత్ర దినోత్సవాన్ని బహిష్కరించాలని మణిపూర్‌కు చెందిన నిషేధిత తీవ్రవాద సంస్థలు ఇప్పటికే పిలుపునిచ్చాయి. ఆ సంస్థల ఘాతుకచర్యే అని పోలీసులు భావిస్తున్నారు. అయితే 65వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా మణిపూర్ ముఖ్యమంత్రి ఓక్రమ్ ఇబోబి సింగ్ శనివారం రాత్రి రాష్ట్ర ప్రజలకు సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... హింసతో సాధించేది ఏమి లేదని తీవ్రవాద సంస్థలు సూచించారు. హింసను విడిచి జనజీవన స్రవంతిలో కలసి, సమాజ అభివృద్దికి పాటుపడాలని తీవ్రవాదులకు ఆయన హితవు పలికారు. -
మణిపూర్ సీఎం వెంటనే రాజీనామా చేయాలి:బీజేపీ
మణిపూర్ ముఖ్యమంత్రి ఓక్రమ్ ఇబోబి సింగ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి తపిర్ గేవ్ డిమాండ్ చేశారు. ఓక్రమ్ పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు అడుగంటాయని ఆరోపించారు. రాష్ట్రంలో వారం రోజుల కాలవ్యవధిలో వరుస బాంబు పేలుళ్లే చోటు చేసుకోవడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మణిపూర్‌లో శాంతి భద్రతలు శూన్యం అనడానికి ఆ పేలుళ్లే ఉదాహరణ అని అన్నారు. ఆ బాంబు పేలుళ్లకు సీఎం నైతిక బాధ్యత వహించాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో చోటు చేసుకున్న బాంబు పేలుళ్లలో అమాయకులు మరణించడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మణిపూర్ సీఎం నివాసానికి కూతవేటు దూరంలో మంగ, బుధవారాల్లో బాంబు పేలుళ్లు సంభవించాయి. శనివారం మరో బాంబు పేలుడు చోటు చేసుకుంది. ఆ ఘటనల్లో ముగ్గురు మరణించారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు ఇంఫాల్ లోని పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. -
మణిపూర్ సీఎం ఇంటివద్ద బాంబు పేలుడు
ఇంఫాల్: మణిపూర్‌లోని ఇంఫాల్ వెస్ట్ జిల్లాలో ఉగ్రవాదులు బుధవారం రెండు శక్తిమంతమైన బాంబులు పేల్చడంతో ఇద్దరు పౌరులు మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. ఉదయం 6.20 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి ఓక్రమ్ ఇబోబీ సింగ్ అధికారిక కార్యాలయం-నివాసం వద్ద నిలిచిన ఓ స్కూలు బస్సులో మొదటి ఐఈడీ బాంబును పేల్చారు. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. ఐదుగురు గాయపడ్డారు. ఇక్కడికి ఐదు కిలోమీటర్ల దూరంలోని మోయిదాంగ్పోక్ ప్రాంతంలో భద్రతా దళాలు పెట్రోలింగ్ జరుపుతున్న చోట మరో బాంబు పేల్చారు. అదృష్టవశాత్తూ ఎవరికీ ప్రాణ నష్టం జరగలేదు. ఉగ్రవాదుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. -
మణిపూర్ సీఎం నివాసం సమీపంలో బాంబు పేలుడు
మణిపూర్ ముఖ్యమంత్రి ఓక్రమ్ ఇబోబి సింగ్ అధికార నివాసానికి కూతవేటు దూరంలో మంగళవారం ఉదయం 6 గంటలకు శక్తివంతమైన బాంబు పేలింది. ఆ ఘటనలో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లోని సీఎం నివాసానికి అత్యంత సమీపంలోని కవైర్రాంబండ మార్కెట్ కాంప్లెక్ సమీపంలోని బిరొడన్ స్కూల్ వద్ద ఆ బాంబు విస్ఫోటం సంభవించింది. సీఎం నివాసం సమీపంలో బాంబు పేలుడుతో పోలీసులు అప్రమత్తమైయ్యారు. అడుగడుగున తనిఖీలు చేపట్టారు. అయితే తీవ్రవాదులు ఆ బాంబును అమర్చార లేక విసిరార అనేది ఇంకా తెలియలేదని పోలీసులు వెల్లడించారు. అలాగే ఆ బాంబు పేలుడుకు తామే బాధ్యుల మంటూ ఇంతవరకు ఎవరు ప్రకటించలేదు. గత ఆగస్టులో కూడా సీఎం ఓక్రమ్ ఇబోబి సింగ్ ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని ఆయన నివాస ప్రాంగణం ఎదుట బాంబు పేలిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఘటనలో కూడా ఎవరు గాయపడలేదు. -
తిరుబాటుదారులు జనజీవన స్రవంతిలో కలవండి
రాష్ట్రంలో తిరుగుబాటుదారులు హింసకు స్వస్తి పలకాలని మణిపూర్ ముఖ్యమంత్రి ఓక్రాం ఇబోబీసింగ్ గురువారం ఇంఫాల్‌లో వెల్లడించారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం చేపడుతున్న అభివృద్ధి పథకాల్లో భాగస్వాములు కావాలని ఆయన తిరుబాటుదారులకు సూచించారు. తిరుబాటుదారులతో చర్చలకు ప్రభుత్వ తలుపులు ఎల్లప్పుడు తెరిచే ఉంటాయన్నారు. ప్రజాస్వామ్య సమాజంలో హింసకు తావుండకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. 67వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని రాష్ట్ర రాజధాని ఇంఫాల్ పేరెడ్ గ్రౌండ్లో ఓక్రాం ఇబోబీసింగ్ జెండా ఆవిష్కరణ చేసి, ప్రభుత్వ దళాలు అందించిన గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన ప్రసంగించారు. ముఖ్యమంత్రి కార్యక్రమానికి కొద్ది నిమిషాల ముందు పేరెడ్ గ్రౌండ్లో సమీపంలోని మిరంగ్కొమ్ ప్రాంతంలోని పేట్రోల్ బంక్ వద్ద బాంబు పేలుడు సంభవించింది. అయితే ఆ ఘటనలో ఎవరు గాయపడలేదని ఆ రాష్ట్ర ఉన్నతాధికారులు వెల్లడించారు. అలాగే రాష్టవ్యాప్తంగా ఆ ఒక్క సంఘటన మినహా మరెక్కడ ఎటువంటి ఘటన చోటు చేసుకోలేదని అధికారులు తెలిపారు. భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టింది. అయితే ఇటీవలే ముఖ్యమంత్రి ఓక్రాం ఇబోబీసింగ్ నివాసం వద్ద బాంబుపేలుళ్లు సంభవించిన సంగతి తెలిసిందే. -
మణిపూర్ సీఎం ఇంటి ఎదుట బాంబు పేలుడు
మణిపూర్ ముఖ్యమంత్రి ఓక్రమ్ ఇబోబి సింగ్ ఇంటి ఎదుట శక్తిమంతమైన గ్రెనేడ్ ఒకటి పేలింది. ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని ఆయన నివాస ప్రాంగణం ఎదుట సాయంత్రం ఈ బాంబు పేలినా, ఎవరికీ పెద్దగా ప్రమాదం జరగలేదని పోలీసు వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో త్వరలో జరగబోతున్న స్వాతంత్ర్య దినోత్సవ సంబరాల సందర్భంగా అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నిస్తున్న ఉగ్రవాదులే ఈ గ్రెనేడ్ పేల్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. సాయంత్రం 6.35 గంటల ప్రాంతంలో ఈ పేలుడు సంభవించగా, ఆ తర్వాతి నుంచి పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. ఇంఫాల్ తూర్పు, ఇంఫాల్ పశ్చిమ, బిషెన్పూర్, తౌబల్ జిల్లాలన్నింటిలో పోలీసు, సెక్యూరిటీ ఔట్‌పోస్టులను ఏర్పాటుచేశారు.