మణిపుర్ : మణిపూర్ గవర్నర్ నజ్మా హెప్తుల్లాను సీఎల్పీ నేత ఓక్రమ్ ఇబోబి సింగ్ సోమవారం ఉదయం కలిశారు. తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ఆయన ఈ సందర్భంగా గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. కాగా ఇప్పటికే బీజేపీకి మద్దతుగా నిలుస్తున్న ఎమ్మెల్యేలంతా ఆదివారం రాత్రే గవర్నర్‌ను కలిశారు. రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ అవతరించినా.. తమకే ఎమ్మెల్యేల మద్ధతు ఉందని ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని గవర్నర్‌ను బీజేపీ నేతలు కోరారు.
అయితే మొత్తం అరవై నియోజవర్గాలకుగానూ కాంగ్రెస్ పార్టీ 28 కైవసం చేసుకోగా, బీజేపీ 21 స్థానాలతో రెండో స్థానంలో నిలిచింది. ఇక నాగా పీపుల్స్ ఫ్రంట్ 4, నేషనల్ పీపుల్స్ పార్టీ 4, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్, లోక్ జనశక్తి పార్టీ, స్వతంత్ర అభ్యర్థి ఒక్కో స్థానంలో నెగ్గారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 31 మంది సీట్లు కావాలి.
అయితే బీజేపీ మాత్రం వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. '60 సీట్లున్న మణిపూర్ అసెంబ్లీలో బీజేపీ బలం 32కు చేరింది. 11 మంది స్వతంత్ర సభ్యులు బీజేపీకి మద్దతు పలికారు' అంటూ గవర్నర్‌ను కలిసిన తర్వాత బీజేపీ నేత, అస్సాం మంత్రి హిమంత బిస్వా శర్మ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కన్నా బీజేపీకి 7 సీట్లు తక్కువ అయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన 31 సీట్ల కన్నా 10 సీట్ల వెనుకబాటు అయితేనేం మణిపూర్ గద్దెపై కాషాయ జెండా రెపరెపలాడబోతోంది.